TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

లక్ష కోట్ల పెట్టుబడుల ప్రణాళిక: రైజింగ్ రాయలసీమ.. చంద్రబాబు విజన్.!

Published on: Sat Oct 3, 2026 10:31AM

ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ సమతుల్య అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాయలసీమపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. దశాబ్దాలుగా కరవు, సాగునీటి కొరత, ఉపాధి అవకాశాల లేమి వంటి సమస్యలను ఎదుర్కొంటూ కరవు సీమగా గుర్తింపు పొందిన రాయలసీమను పారిశ్రామికంగా, వ్యవసాయపరంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో  చంద్రబాబు సర్కార్  ప్రణాళికలను సిద్ధం చేస్తోంది.  రైజింగ్ రాయలసీమ  పేరుతో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల నుంచి లక్ష కోట్ల రూపాయలను సమీకరించడమే ధ్యేయంగా అడుగులు ముందుకు వస్తున్నది. 

రాయలసీమలో పారిశ్రామిక అభివృద్ధి ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించడంపై ప్రభుత్వం ప్రధానంగా దృష్టి సారించింది. అదే సమయంలో సాగు రంగానికీ సమ ప్రాధాన్యత ఇస్తోంది. గతంలో అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసిన కియా మోటార్స్ పరిశ్రమ ఈ ప్రాంతంలో ఆటోమొబైల్ రంగం విస్తరణకు దోహదపడింది. ప్రస్తుతం తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఎలక్ట్రానిక్స్, సెమీకండక్టర్లు, ఉక్కు, రక్షణ రంగాలకు సంబంధించిన పరిశ్రమలను ప్రోత్సహించే ప్రణాళికలు శరవేగంగా అమలవుతున్నాయి. ఈ పెట్టుబడులు కార్యరూపం దాలిస్తే పారిశ్రామిక కార్యకలాపాలు పెరగడంతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఇబ్బడిముబ్బడిగా విస్తరించే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. 

ఇక రాయలసీమలో నీటి కొరతకు చరమగీతం పాడి, వ్యవసాయాన్ని లాభసాటి వ్యాపకంగా మార్చే ఉద్దేశంతో చంద్రబాబు ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుంటోంది. ఇందు కోసం అత్యంత కీలకమైన సాగునీటి లభ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టింది. రాయల సీమలో  విస్తారమైన భూములు ఉన్నప్పటికీ వర్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితులు రైతులకు సవాళ్లుగా మారుతున్నాయి.

ఈ నేపథ్యంలో సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడం, ఇప్పటికే ఉన్న నీటి వనరులను సమర్థంగా వినియోగించుకోవడం, చెరువులు, కాలువల అభివృద్ధి వంటి అంశాలకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోంది. వెలిగొండ ప్రాజెక్టు సహా వివిధ సాగునీటి కార్యక్రమాల ద్వారా నీటి లభ్యతను మెరుగుపరచడమే లక్ష్యంగా వడివడిగా అడుగులు వేస్తోంది. 

తక్కువ నీటితో అధిక ఆదాయాన్ని అందించే పంటల సాగును ప్రోత్సహించడం రాయలసీమ అభివృద్ధి ప్రణాళికలో మరో ముఖ్యమైన అంశం. సంప్రదాయ పంటలతో పాటు అవకాడో, బ్లూబెర్రీ వంటి లాభసాటి ఉద్యాన పంటల సాగును విస్తరించేందుకు ప్రోత్సాహకాలు, ఆధునిక సాగు పద్ధతులను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. బిందు సేద్యం, సూక్ష్మ సేద్యం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గిస్తూ వ్యవసాయ ఉత్పాదకతను పెంచే దిశగా చర్యలు చేపడుతోంది.

అలాగే పంటల నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సదుపాయాల అభివృద్ధి దిశగా కూడా చర్యలు తీసుకుంటున్నది.  రైజింగ్ రాయలసీమలో భాగంగా సుమారు  .లక్ష కోట్ల రూపాయల పెట్టుబడుల లక్ష్యాన్ని నిర్దేశించుకుని ముందుకు సాగుతోంది. ఇందులో ప్రభుత్వ రంగం నుంచి రూ.40 వేల కోట్ల రూపాయలు,   ప్రైవేటు రంగం నుంచి రూ.60 వేల కోట్ల రూపాయలు సమీకరించే లక్ష్యంతో ప్రణాళికలు రచిస్తోంది.   


[Chandrababu Naidu, Andhrapradesh CM, Rayalaseema Development, Andhra Pradesh News, Raising Rayalaseema, AP Government Plans, Telugu One]