TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

11వేల 359 కోట్లతో పట్టణాల అభివృద్ధి.. ఏపీ ప్రభుత్వం బృహత్తర ప్రణాళిక.!

Published on: Tue Sep 22, 2026 12:13PM

ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న పట్టణ ప్రాంతాల రూపురేకలను పూర్తిగా మార్చివేసే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమానికి తెరతీసింది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా  11 వేల 359 కోట్ల రూపాయల  అంచనా వ్యయంతో పట్టణ అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మున్సిపాలిటీల్లో మౌలిక వసతులను మెరుగుపరచడమే ధ్యేయంగా హెచ్ఏఎం  పద్ధతిలో తొలిసారిగా రాష్ట్రంలోని   123 మున్సిపాలిటీల్లో ఈ అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ప్రజలు రోజూ ఎదుర్కొనే సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతూ, పట్టణాల్లో సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తీసుకురావాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది.  

ఈ  ప్రాజెక్టును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా శాంతిపురం వద్ద హంద్రీనీవా కాలువకు ముఖ్యమంత్రి జలహారతి ఇవ్వనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో సుమారు 2 వేల165 కిలోమీటర్ల మేర అధునాతన రోడ్ల నిర్మాణం చేపట్టనున్నారు. కేవలం రోడ్లే కాకుండా, ప్రజల ఆహ్లాదం కోసం,  పర్యావరణ పరిరక్షణ కోసం పట్టణాల్లో   502 నూతన పార్కుల నిర్మాణాన్ని కూడా ఈ పథకంలో భాగంగా లక్ష్యంగా పెట్టుకున్నారు.   పట్టణాల్లో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా తాగునీరు, భూగర్భ డ్రైనేజీ, సీవరేజ్ వ్యవస్థ, ఎల్‌ఈడీ వీధి దీపాలు వంటి సదుపాయాలను ఒకేసారి మెరుగుపరిచేలా ఈ ప్రణాళికను రూపొందించారు. 

ప్రజలు ప్రతిరోజూ ప్రత్యక్షంగా ఉపయోగించే మౌలిక వసతులను అభివృద్ధి చేయడం ద్వారా మున్సిపాలిటీల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. హెచ్ఏఎం విధానం ద్వారా చేపట్టే ఈ పనులలో నాణ్యతా ప్రమామాలు పాటించడంతో పాటు, నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి అయ్యేలా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. మొత్తానికి, ఏపీలోని నగరాలు మరియు పట్టణాలను భవిష్యత్ అవసరాలకు తగినట్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ  ప్రణాళికను అమలు చేస్తున్నది.  

[Chandrababu Naidu, AP Urban Development, 11359 Crore Projects, Kuppam, AP Municipalities, Andhra Pradesh, Telugu One]