TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పేదల కళ్లల్లో ఆనందం.. జన్మధన్యమైందంటూ చంద్రబాబు భావోద్వేగం.!

Published on: Sat Sep 19, 2026 6:10PM

విశాఖపట్నంలోని వేలాది పేద కుటుంబాల దశాబ్దాల కల సాకారమైది, పేదలకు పట్టాభిషేకం పేరిట నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలకు సంబంధించిన కన్వీనియన్స్ డీడ్స్‌  అందజేశారు. దశాబ్దాలుగా సొంత గూడు ఉన్నప్పటికీ దానిపై పూర్తి స్థాయి హక్కులు లేక సతమతమవుతున్న వేలాది మందికి ఈ నిర్ణయంతో పూర్తి హక్కులు లభించాయి. ఈ డీడ్స్ అందుకున్న ప్రజల ముఖాల్లో  ఆనందోత్సాహాలను కళ్లారా చూసిన ముఖ్యమంత్రి చంద్రబాబు  భావోద్వేగానికి గురయ్యారు. పేద ప్రజల కళ్లలో వెల్లివిరిసిన సంతోషాన్ని చూసి తన జీవితం ధన్యమైపోయిందని, ప్రాణం ఉన్నంతవరకు ఈ అరుదైన క్షణాన్ని  గుర్తుపెట్టుకుంటానని అంటూ ఎమోషన్ అయ్యారు. 

ఈ వేడుకలో భాగంగా ప్రభుత్వం చేపట్టిన భూ క్రమబద్ధీకరణ ప్రక్రియ విశేషాలను ముఖ్యమంత్రి   వెల్లడించారు. విశాఖ  పరిధిలోని గాజువాక, పెందుర్తి, భీమిలి, గోపాలపట్నం తదితర ప్రాంతాలతో పాటు మొత్తం 111 మండలాల పరిధిలోని   399 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న 19.33 లక్షల చదరపు గజాల భూమిని పూర్తిగా క్రమబద్ధీకరించినట్లు తెలిపారు. దాదాపు  8,874 కోట్ల రిజిస్ట్రేషన్ విలువ కలిగిన ఈ ఆస్తులను ఎలాంటి వివాదాలకు తావులేకుండా నేరుగా పేద ప్రజలకే దక్కేలా చేశామన్నారు. నిన్నటి వరకు తమ ఇళ్లపై ఎలాంటి అధికారిక హక్కులు లేక, అత్యవసర సమయాల్లో బ్యాంకు రుణాలు కూడా పొందలేని దుస్థితిలో ఉన్న సామాన్యులకు ఇప్పుడు చట్టపరమైన సర్వ హక్కులు లభించాయని చంద్రబాబు చెప్పారు. 

ఈ సందర్భంగా గత ప్రభుత్వ పాలనపై ముఖ్యమంత్రి విమర్శలు కురిపించారు. గడచిన ఐదేళ్ల కాలంలో రాష్ట్రం తీవ్రమైన విధ్వంసానికి,   గురైందన్న చంద్రబాబు.. వేల కోట్ల అప్పులతో పాటు ఎక్కడ చూసినా భూకబ్జాలు, కల్తీ మద్యం దందాలు రాజ్యమేలాయని విమర్శించారు. విశాఖపట్నాన్ని రాజధాని చేస్తామని నమ్మబలికిన గత పాలకులు, రుషికొండపై విలాసవంతమైన భవనాలు నిర్మించుకుని ప్రజా ధనాన్ని  దుర్వినియోగం చేశారని విమర్శించారు. గతంలో వారాంతం వచ్చిందంటే చాలు ఏ ఇళ్లు కూల్చివేస్తారోననే భయానక వాతావరణంలో ప్రజలు బతికారన్నారు. కానీ తాము అధికారంలోకి వచ్చాక విధ్వంసం స్థానంలో వికాసాన్ని, భయం స్థానంలో భరోసాని నింపుతున్నామని పేర్కొన్నారు. తొలి విడతగా 28 వేలకు పైగా కుటుంబాలకు లబ్ధి చేకూర్చామని, మిగిలిన ప్రాంతాల్లోని అర్హులకు కూడా త్వరలోనే హక్కు పత్రాలు అందిస్తామని హామీ ఇచ్చారు. 


[Chandrababu Naidu, Visakhapatnam House Site Pattas, Pedalaku Pattabhishekam, AP Government, Property Rights, Chandrababu Emotional Speech]