డిజిటల్ సీఎం నుంచి రైతు బాంధవుడి వరకూ: నారా చంద్రబాబు ప్రస్ధానం.!
Published on: Sat Sep 26, 2026 3:34PM

తెలుగు రాష్ట్రాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ విప్లవానికి నాంది పలికి, హైదరాబాద్‌ను ప్రపంచ ఐటీ మ్యాప్‌లో నిలబెట్టిన నాయకుడిగా, దార్శనికుడిగా చంద్రబాబుకు తిరుగులేనిగుర్తింపు ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత నవ్యాంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఆయన, రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్నారు. రాజకీయ ప్రత్యర్థులు సైతం ఆయనను టెక్నాలజీ పట్ల మక్కువ గల నేతగా అభివర్ణిస్తుంటారు.
ఆయన దార్శనికతను అభినందిస్తారు. 2014లో నవ్యాంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ఆయన పేరు తప్ప మరేమీ మిగలని ఆంధ్రప్రదేశ్ ను గాడిలో పెట్టేందుకు నిరంతరం శ్రమించారు. 2019 ఎన్నికలలో ఓటమి తరువాత పలు సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొన్నారు. 2024 ఎన్నికలలో విజయం తరువాత.. చంద్రబాబు పని తీరులో సమూల మార్పు వచ్చింది. పరిశీలకులు ఆయన ప్రస్తుత పాలనను చంద్రబాబు 2.0 అంటున్నారు. ఏకకాలంలో టెక్నాలజీకి, వ్యవసాయానికీ, ఇరిగేషన్ కు ప్రాధాన్యత ఇస్తూ ముందుకు సాగుతున్నారు.

వ్యవసాయ రంగానికి పెద్దపీఠ వేసేలా చంద్రబాబు 35 వేలకోట్ల రూపాయల అంచనాతో సాగునీటి రోడ్‌మ్యాప్‌ను ప్రకటించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న 36 సాగునీటి ప్రాజెక్టులను వేగంగా పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అంతేకాకుండా.. దేశంలోనే తొలిసారిగా ఆంధ్రప్రదేశ్‌లో ఇరిగేషన్ అండ్ వాటర్ క్యాలెండర్ ను అందుబాటులోకి తెచ్చారు. ఈ విధానం ద్వారా అన్నదాతలు తమ పంటల సాగుకు సంబంధించి శాస్త్రీయంగా ముందస్తు ప్రణాళిక చేసుకునే అవకాశం లభిస్తుంది.
ఈ ప్రణాళికలో ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతమైన రాయలసీమకు చంద్రబాబు ప్రాధాన్యత ఇచ్చారు. హంద్రీ నీవా సుజల స్రవంతి, వెలిగొండ ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి, అదనంగా 52 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచే దిశగా అడుగులు వేస్తున్నారు. దీనివల్ల దాదాపు 14 లక్షల ఎకరాలకు సాగునీరు అందనుంది. అదేవిధంగా, కృష్ణా-గోదావరి బేసిన్ పరిధిలో కాల్వల ఆధునీకరణ, నదుల అనుసంధాన పనులను కూడా వేగవంతం చేశారు. రైతులు లాభాలు గడించేందుకు వీలుగా రాయితీపై మైక్రో ఇరిగేషన్ విధానాన్ని ప్రోత్సహిస్తున్నారు.
వర్షపాతం నమోదు, జలాశయాల నీటి మట్టాలు, నీటి వినియోగంపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నారు. రైతు ఉత్పత్తిదారుల సంఘాల ద్వారా ప్రభుత్వ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా వ్యవసాయాన్ని మరింత లాభసాటిగా మార్చవచ్చని చంద్రబాబు ధీమాగా చెబుతున్నారు.
గతంలో వైసీపీ చంద్రబాబుపై వేసిన వ్యవసాయ వ్యతిరేకి అనే ముద్రను చంద్రబాబు తన నిర్ణయాల ద్వారా పూర్తిగా చెరిపేశారు. టెక్నాలజీతో పాటు వ్యవసాయాన్ని సమాంతరంగా అభివృద్ధి చేస్తూ ఆయన తన కార్పొరేట్ ఇమేజ్ ను అలాగే కాపాడుకుంటూ.. అచ్చమైన రైతు నేతగా ట్రాన్స్ ఫారమ్ అయ్యారు. జాతీయ స్థాయి మీడియా సంస్థలు సైతం చంద్రబాబు నాయుడు తీసుకుంటున్న ఈ నిర్ణయాలను ప్రముఖంగా ప్రశంసిస్తున్నాయి.
[Chandrababu Naidu, Digital CM, Transform, Farmer Friend, Andhra Pradesh agriculture, irrigation projects, Rayalaseema irrigation, AP news, Telugu One]


