స్వాతంత్ర్య సంగ్రామం గత చరిత్ర కాదు.. మన వారసత్వ సంపద : చాగంటి
Published on: Sun Sep 20, 2026 3:20PM

స్వాతంత్ర్య సంగ్రామం కేవలం గత చరిత్ర కాదని.. అది ప్రతి భారతీయుడి వారసత్వ సంపద అని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఏపీ ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు అన్నారు. స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. కాకినాడ జిల్లా రూరల్ మండలం తిమ్మాపురంలోని ఆకుండి లక్ష్మీ స్మారక గోశాలలో విద్యార్థుల్లో దేశభక్తి, భారతీయ సంస్కృతి, సేవాభావం పెంపొందించేలా ‘భారతీయం’ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ.. ఎందరో మహనీయులు తమ జీవితాలను త్యాగం చేసి మనకు స్వేచ్ఛ, స్వాతంత్ర్యాన్ని అందించారని గుర్తుచేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తులు అందించడంతో పాటు.. ఆ సంపద వెనుక ఉన్న కష్టం, విలువలను కూడా తెలియజేసినప్పుడే దాని విలువ తెలుస్తుందని అన్నారు. అదేవిధంగా స్వాతంత్ర్యం అనే అమూల్యమైన సంపద వెనుక ఉన్న త్యాగాలను భావితరాలకు తెలియజేయాల్సిన అవసరం ఉందన్నారు.

దేశభక్తి అంటే కేవలం జాతీయ జెండాను ఎగురవేయడం మాత్రమే కాదని.. ‘నేను భారతీయుడిని’ అని గర్వంగా చెప్పుకునే స్వేచ్ఛ వెనుక ఎందరో చేసిన త్యాగాలను గుర్తుంచుకోవడమే నిజమైన దేశభక్తి అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య సమరయోధుల జీవితాలను చదవడంతో పాటు.. వారు నడయాడిన ప్రాంతాలు, జైళ్లు, స్మారక ప్రదేశాలను సందర్శిస్తే పిల్లల్లో దేశభక్తి మరింత పెరుగుతుందని చెప్పారు.
‘భారతీయం’ అనే భావన స్వాతంత్ర్య ఉద్యమ కాలంలోనే బలపడిందని చాగంటి వివరించారు. సైమన్ కమిషన్‌కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరిగిన ఉద్యమాలను గుర్తుచేస్తూ.. భారతదేశానికి సంబంధించిన నిర్ణయాలను భారతీయులే తీసుకోవాలనే ఆకాంక్ష అప్పట్లో బలంగా వ్యక్తమైందన్నారు. ఇలాంటి చారిత్రక ఘట్టాలను పిల్లలకు వివరించాల్సిన అవసరం ఉందన్నారు.
అండమాన్‌లోని కాలాపాని జైలు వంటి ప్రదేశాలు స్వాతంత్ర్య సమరయోధులు అనుభవించిన కష్టాలకు సాక్ష్యాలుగా నిలిచాయని చెప్పారు. గాంధీజీ, నెహ్రూ, లాలా లజపతిరాయ్, టంగుటూరి ప్రకాశం పంతులు, పొట్టి శ్రీరాములు వంటి మహనీయుల జీవితాలను చదివితే స్వాతంత్ర్యం ఎంతటి త్యాగాల ఫలితమో అర్థమవుతుందన్నారు. పిల్లలకు స్వాతంత్ర్య సమరయోధుల జీవిత చరిత్రలను చదివించాలని, చారిత్రక ప్రదేశాలను సందర్శించేలా ప్రోత్సహించాలని సూచించారు.

విద్యార్థుల వేషధారణలు.. ఆకట్టుకున్న సందేశాలు..!
‘భారతీయం’ కార్యక్రమంలో విద్యార్థులు స్వాతంత్ర్య సమరయోధులు, ప్రముఖుల పాత్రల్లో కనిపిస్తూ దేశభక్తి సందేశాలను అందించారు. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్, లాల్ బహదూర్ శాస్త్రి, డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్, అబ్దుల్ కలామ్, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, దుర్గాబాయి దేశ్‌ముఖ్, ఎం.ఎస్. సుబ్బలక్ష్మి, తరిగొండ వెంగమాంబ, డొక్కా సీతమ్మ, సచిన్ టెండూల్కర్ తదితరుల పాత్రల్లో విద్యార్థులు ఇచ్చిన సందేశాలు ఆకట్టుకున్నాయి.
‘భారతీయం’లో పాల్గొన్న మంత్రి లోకేష్..!
కార్యక్రమానికి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదపండితుల ఆశీర్వచనాలు అందుకున్నారు. చాగంటి కోటేశ్వరరావు లోకేష్‌కు వేద ఆశీర్వచనం అందించారు. కంచి కామకోటి పీఠం 68వ పీఠాధిపతి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతీ మహాస్వామి రచించిన ‘దేవుని స్వరం’ పుస్తకాలను ఆయనకు బహుకరించారు. అనంతరం సత్సంగం సభ్యులతో లోకేష్ ముచ్చటించారు. కార్యక్రమంలో భారతమాతకు 108 మంత్రాలతో పుష్పాంజలి సమర్పించారు. భారతీయతను ప్రతిబింబించే శబ్దాలు, స్వరాలతో ‘వందేమాతరం’ గీతాలాపన చేస్తూ వినూత్నంగా భారతమాతకు హారతులు ఇచ్చారు.
మాజీ సైనికుడి అనుభవాలు..!
మాజీ సైనికుడు డా. కిరణ్ కుమార్ భారత సైన్యంలో తాను అందించిన సేవలు, అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. దేశ రక్షణ కోసం ఆయన చేసిన సేవలను అభినందిస్తూ మంత్రి లోకేష్ ఘనంగా సత్కరించారు. అనంతరం విద్యార్థులకు మెమెంటోలు అందజేశారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు, ఆధ్యాత్మికతతో పాటు దేశభక్తి, సేవాభావం, సైనికుల త్యాగాలపై విద్యార్థుల్లో అవగాహన కల్పించడమే లక్ష్యంగా ‘భారతీయం’ కార్యక్రమం కొనసాగింది.
[ Chaganti Koteswara Rao, Bharateeyam, Kakinada, Freedom Struggle, Indian Independence, Patriotism, Indian Culture, Freedom Fighters, Nara Lokesh, Andhra Pradesh, Students, Vande Mataram, Indian Heritage, Nationalism, Kakinada Rural ]


