గందరగోళం నేపథ్యంలో ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ ట్రయల్స్ మరో సారి... ఆస్ట్రాజెనికా వెల్లడి 

ఆక్స్ ఫర్డ్ యూనివర్సిటీ, ఆస్ట్రాజెనికా ఫార్మా సంయుక్తంగా రూపొందించిన కరోనా వ్యాక్సిన్ ట్రయల్స్ ఫలితాలలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో వ్యాక్సిన్ పనితీరును మరింత లోతుగా పరిశీలించేందుకు ప్రపంచవ్యాప్తంగా మరోమారు ట్రయల్స్ నిర్వహించాలని ఆస్ట్రాజెనికా పీఎల్సీ నిర్ణయించింది. తాజాగా ఈ విషయాన్ని సంస్థ సంస్థ సిఇవో పాస్కల్ సోరియట్ స్వయంగా వెల్లడించారు. వ్యాక్సిన్ ఫలితాల నివేదిక విడుదలైన తరువాత మొట్టమొదటిసారిగా అయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యాక్సిన్ పై జరుగుతున్న అధ్యయనంలో కొన్ని ప్రశ్నలు తలెత్తాయని, దీంతో మరోసారి ట్రయల్స్ కు వెళుతున్నామని ఆయన చెప్పారు.

 

ఆక్స్ ఫర్డ్ వ్యాక్సిన్ తక్కువ డోస్ తీసుకున్న వారిలో ఎక్కువ రోగ నిరోధక శక్తి పెరిగినట్టు ట్రయల్స్ లో రిపోర్టులు రాగా, దీని ఆధారంగానే వ్యాక్సిన్ ను మరింత లోతుగా విశ్లేషించనున్నామని పాస్కల్ తెలిపారు. అయితే, ఇప్పటికే అనుమతులు ఉన్నందున తాజా ట్రయల్స్ చాలా త్వరితగతినే పూర్తవుతాయని, అంతేకాకుండా చాలా దేశాల్లో ట్రయల్స్ జరుగుతాయని, వ్యాక్సిన్ పనితీరుపై అంతర్జాతీయ అధ్యయనం చేసిన తరువాత దీన్ని విడుదల చేస్తామని అయన తెలిపారు.

 

అదనపు ట్రయల్స్ కు మళ్ళీ నియంత్రణా సంస్థల నుంచి మరోమారు అనుమతి కోరాల్సిన అవసరం లేదని తెలిపిన ఆయన, యూకే, యూరప్ తో పాటు మరిన్ని దేశాల్లో ట్రయల్స్ జరుగుతాయని తెలిపారు. మరి కొన్ని దేశాల్లో ట్రయల్స్ కు అనుమతులు ఈ ఏడాది చివర్లో వచ్చే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అయితే అమెరికాలో టీకాకు ఎఫ్డీయే నుంచి అంత త్వరగా అనుమతులు రావని, వేరే దేశంలో జరిగిన ట్రయల్స్ ఆధారంగా అమెరికా నిర్ణయం తీసుకోదని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు.