TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

వైద్య సేవల చార్జీలు బహిరంగంగా ప్రదర్శించాలి: రాష్ట్రాల ప్రభుత్వాలకు కేంద్రం ఆదేశాలు.!

Published on: Mon Oct 12, 2026 3:38PM

దేశవ్యాప్తంగా  ఆస్పత్రులలో వైద్య సేవలు, చికిత్సకు సంబంధించిన చార్జీలను అందరికీ కనిపించేలా బహిరంగంగ ప్రదర్శించాలని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆదేశించింది. ఈ మేరకు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకూ, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వాలనూ ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.  వైద్య సేవల రంగాన్ని మరింత పారదర్శకంగా మార్చడం, ఆర్థికంగా రోగులకు ఎలాంటి ఇబ్బందులూ లేకుండా చూడడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకుంది.  

ఈ విధివిధానాల అమలుపై కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్య సలిల శ్రీవాస్తవ దేశంలోని అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు ప్రత్యేకంగా లేఖలు రాశారు. ఆసుపత్రులు, నర్సింగ్ హోమ్‌లు,   వైద్య కేంద్రాలలో రోగుల నుంచి వసూలు చేసే ఫీజులు, ప్యాకేజీల వివరాలు ఎలాంటి దాపరికం లేకుండా అందరికీ అందుబాటులో ఉండేలా ప్రదర్శించాలని ఆ లేఖలో పేర్కొన్నారు.   ఆసుపత్రి ప్రాంగణంలో రోగులు, వారి సహాయకులు సులభంగా చూడగలిగే ప్రాంతాలలో ఈ చార్జీల పట్టికలను ప్రదర్శించేలా చూడాలని  రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు.

ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశం రోగులకు వైద్య ఖర్చులపై ముందే పూర్తి స్థాయి అంచనాను అందించడమేనని మంత్రిత్వ శాఖ క్లారిటీ ఇచ్చింది.  చాలా సందర్భాలలో అత్యవసర సమయాల్లో ఆసుపత్రులలో చేరిన రోగులకు చికిత్స ముగిసిన తర్వాత భారీ బిల్లులు రావడం, ఆ కుటుంబాలు తీవ్ర మానసిక ఆందోళనకు, ఆర్థిక ఇబ్బందులకు గురవుతుండటం జరుగుతోంది. ముందే చికిత్స చార్జీలు, గది అద్దెలు, వైద్య పరీక్షల ఖర్చులు వంటి సమగ్ర వివరాలు అందుబాటులో ఉంటే, రోగులు తమ ఆర్థిక స్థోమతకు తగినట్లుగా ప్రణాళిక వేసుకోవడానికి,  నిర్ణయాలు తీసుకోవడానికి  వెసులుబాటు కలుగుతుంది.

ఈ నిబంధనల అమలు కోసం దేశంలో ఇప్పటికే అమల్లో ఉన్న క్లినికల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ (రిజిస్ట్రేషన్ అండ్ రెగ్యులేషన్) చట్టం,  దీనికి సంబంధించిన కేంద్ర నిబంధనలను పకడ్బందీగా పాటించాల్సి ఉంటుంది. ఈ చట్టం పరిధిలోకి వచ్చే ప్రతి వైద్య సంస్థ కూడా తమ వద్ద లభించే వివిధ రకాల చికిత్సల రేట్లను ఇంగ్లీషులోనే కాకుండా, స్థానిక ప్రాంత ప్రజలు సులభంగా చదువుకునేలా స్థానిక భాషలో కూడా ప్రముఖంగా ప్రదర్శించాలి. దీనిద్వారా ఆసుపత్రి యాజమాన్యాలకు, రోగులకు మధ్య బిల్లింగ్ విషయమై ఏర్పడే వివాదాలు గణనీయంగా తగ్గుముఖం పడతాయి.  ఈ ఆదేశాల కారణంగా భవిష్యత్తులో దేశంలోని వైద్య ఆరోగ్య రంగంలో జవాబుదారీతనం మరింత మెరుగవుతుందనీ, అలాగే  ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీకి కళ్లెం పడుతుందనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  


[Central Health Ministry irections On Hospital Service Charges, Clinical Establishments Act, Medical Billing Transparency, Health Sector Reforms, Telugu One]