TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నితిన్ గడ్కరీ, కోమటిరెడ్డి భేటీ: భాగ్యనగరం డబుల్ డెక్కర్ కారిడార్ కే కేంద్రం గ్రీన్ సిగ్నల్.!

Published on: Tue Oct 13, 2026 3:16PM

హైదరాబాద్‌లో ట్రాఫిక్‌ సమస్య రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఎల్బీనగర్‌ నుంచి హయత్‌నగర్‌ వరకు ప్రయాణించే వాహనదారులకు రద్దీ పెద్ద సమస్యగా మారింది.  హైదరాబాద్, విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ మార్గంలో రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన ప్రయత్నాలు సత్ఫలితాలను ఇస్తున్నాయి. ఎల్బీనగర్‌ హయత్‌నగర్‌ డబుల్‌ డెక్కర్‌ ఎలివేటెడ్‌ కారిడార్‌ ప్రతిపాదనకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 

తెలంగాణ రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి కేంద్ర రోడ్డు రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీతో సమావేశమై రాష్ట్రానికి సంబంధించిన పలు రహదారి, రవాణా ప్రాజెక్టులపై చర్చించారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్, హాయత్ నగర్ డబుల్ డెక్కర్ ప్రాజెక్టుకు సంబంధంచి ఆయన గట్టిగా కోరినట్లు తెలుస్తోంది. ఆరు కిలోమీటర్ల ఈ కారిడార్   ప్రాజెక్టు తుది డిజైన్‌, ఖర్చు, నిర్మాణ పనులు ప్రారంభమయ్యే తేదీ వంటి అంశాలపై ఇంకా క్లారిటీ రాలేదు. అయితే ఈ కారిడార్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని విశ్వసనీయంగా తెలిసింది.  

ఈ ప్రాజెక్టులో అత్యంత కీలకమైన అంశం డబుల్‌ డెక్కర్‌ నిర్మాణ విధానం. సాధారణంగా రహదారి విస్తరణ, మెట్రో మార్గ నిర్మాణం వేర్వేరుగా చేపడితే భూసేకరణ, స్థల లభ్యత, ట్రాఫిక్‌ మళ్లింపులు వంటి సమస్యలు ఎదురవుతాయి. డబుల్‌ డెక్కర్‌ విధానంలో రహదారి, మెట్రో వంటి రవాణా వ్యవస్థలను ఒకే కారిడార్‌లో సమన్వయం చేసే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్‌ మెట్రో రెండో దశలో మియాపూర్‌ ఎల్బీనగర్‌ మార్గాన్ని హయత్‌నగర్‌ వరకు పొడిగించే ప్రతిపాదన ఉంది. ఈ నేపథ్యంలో డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ను మెట్రో విస్తరణతో సమన్వయం చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. 

హైదరాబాద్‌ నుంచి విజయవాడ వైపు వెళ్లే వాహనాలకు ఎల్బీనగర్‌–హయత్‌నగర్‌ మార్గం కీలకం. ఈ ప్రాంతంలో నివాస సముదాయాలు, వ్యాపార కార్యకలాపాలు పెరగడంతో స్థానిక ప్రయాణాలు, ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనాలు ఒకే రహదారిపై ప్రయాణించాల్సి వస్తోంది. దీంతో రద్దీ సమయాల్లో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

డబుల్‌ డెక్కర్‌ కారిడార్‌ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే..  రవాణా ప్రవాహాన్ని మెరుగ్గా విభజించేందుకు అవకాశం ఉంటుంది. దీని వల్ల ప్రయాణ సమయం తగ్గడం, జంక్షన్ల వద్ద రద్దీ నియంత్రణ, ప్రజా రవాణాకు మెరుగైన అనుసంధానం వంటి ప్రయోజనాలు కలగుతాయి.  


[Center Green Signal To LB Nagar Hayathnagar Double Decker Corridor, Hyderabad Traffic, Telangana Infrastructure Project, Komatireddy Venkat Reddy, Nitin Gadkar Meting, Telugu One]