అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం.. అనుభవాల సారం వృద్దుల జీవితం.. !
Published on: Sat Oct 3, 2026 10:50AM
అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం.. అనుభవాల సారం వృద్దుల జీవితం.. !

వయసు పైబడిన ప్రతి ఒక్కరి అనుభవం సమాజానికి గొప్ప మార్గదర్శకం. ప్రతి ఏటా అక్టోబర్ 1వ తేదీన ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం జరుపుకుంటాం. ముసలివాళ్లు అయిపోయారు, ఇక వాళ్లతో ఏం పని అని కొందరు అనుకుంటూ ఉంటారు. కానీ జీవితంలో ఎన్నో ఎత్తుపల్లాలను చూసి, ఎన్నో పాఠాలను నేర్చుకున్న వారు వృద్దులు. వృద్ధుల త్యాగాలను, వారు అందించిన సేవలను గుర్తుచేసుకోవడానికి , వారి పట్ల మన బాధ్యతను గుర్తుచేసుకోవడానికి, అంతర్జాతీయ వృద్దుల దినోత్సవం ఎంతగానో సహాయపడుతుంది. వృద్దుల ప్రాధాన్యత, వారి విషయంలో ఉండాల్సిన బాధ్యత, సమాజంలో వారి పాత్ర మొదలైన విషయాలను వివరంగా తెలుసుకుంటే..
వృద్దుల జీవితం..
తీపి జ్ఞాపకాలు, చేదు అనుభవాలు, కష్టాలు, విజయాలు అన్నీ కలగలిపిన ఒక గొప్ప పుస్తకం వృద్ధుల జీవితం. జీవితంలో ఏది మంచి, ఏది చెడు అనే విషయాన్ని అనుభవంతో తెలుసుకున్న వారు మన ఇళ్లలో ఉండటం ఒక రక్షణ కవచం లాంటిది. కుటుంబం కోసం, సమాజం కోసం తమ యవ్వనాన్ని, శ్రమను ధారపోసిన వారు వృద్ధాప్యంలో మన నుంచి ఆశించేది కేవలం కొద్దిపాటి ప్రేమ, ఆప్యాయత , గౌరవం మాత్రమే.
సమయమే ఇవ్వడం లేదు..
ఈనాటి వేగవంతమైన డిజిటల్ యుగంలో చాలామంది కుటుంబాల్లో పెద్దవారికి సరైన సమయం కేటాయించడం లేదు. ఒంటరితనం అనేది వారిని వేధించే అతిపెద్ద సమస్యగా మారుతోంది. వారితో రోజూ కొద్దిసేపు ప్రశాంతంగా మాట్లాడటం, వారి ఆరోగ్య విషయాలు అడిగి తెలుసుకోవడం, వారి అనుభవాలను వినడం వల్ల వారికి కొండంత బలంతో పాటు మనసుకి ఎంతో సంతోషం లభిస్తుంది.
సంరక్షణ..
వృద్ధుల సంక్షేమం, భద్రత, వారి ఆరోగ్య సంరక్షణ మనందరి ప్రాథమిక బాధ్యత. వారి అనుభవాల ద్వారా లభించే జ్ఞానాన్ని గౌరవించాలి, వారు తమ జీవితంలో కష్టాల నుండి బాధల నుండి నేర్చుకున్న విషయాలు కుటుంబంలో ఎందరికో ముందుజాగ్రత్తలు నేర్పుతాయి. వారి వృద్ధాప్య జీవితం ప్రశాంతంగా, గౌరవప్రదంగా సాగేలా చూడటమే మనం వారికి ఇచ్చే నిజమైన కానుక. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం సందర్భంగా మన ఇంట్లో, మన చుట్టుపక్కల ఉన్న పెద్దలందరికీ సేవ చేయడం, వారిని ఎల్లప్పుడూ ఆనందంగా చూసుకోవడం కోసం కనీస చిరు ప్రయత్నం అయినా చెయ్యాలి.
పిల్లలిచ్చే గౌరవమే కొండంత ఆనందం..
వృద్దులకు తమ పిల్లలు ఇచ్చే గౌరవమే కొండంత ఆనందాన్ని ఇస్తుంది. సాధారణంగా కొన్ని ఇళ్లలో మనవళ్లు, మనవరాళ్లు వృద్దులను చీదరించుకుంటూ, చిరాకు పడుతూ.. వారితో మాట్లాడటానికి ఇష్టపడరు. కానీ తమ తల్లిదండ్రులను పిల్లలు గౌరవిస్తూ వారితో ఆప్యాయంగా బాధ్యతగా ఉంటే.. వారి పిల్లలు కూడా తమ అవ్వ తాతల పట్ల ఎంతో ఆదరంగా, ప్రేమగా ఉండగలుగుతారు. కాబట్టి వృద్దులను ఎప్పుడూ నిర్లక్ష్యం చేయకూడదు.
*రూపశ్రీ.


