ఈవీఎంలు సురక్షితమైనవి.. సీఈసీ
Published on: Tue Aug 25, 2026 1:23PM
.webp)
దేశంలో ఎన్నికల నిర్వహణ, ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల విశ్వసనీయతపై తరచూ వ్యక్తమవుతున్న సందేహాలకు భారత ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ (సీఈసీ) జ్ఞానేష్ కుమార్ వివరణ ఇచ్చారు. భారత ఎన్నికల ప్రక్రియలో వినియోగించే ఈవీఎంలు సురక్షితమైనవనీ, అవి ఎలాంటి నెట్‌వర్క్‌తోనూ అనుసంధానం కాకుండా స్వతంత్రంగా పనిచేస్తాయని స్పష్టం చేశారు. సాంకేతికంగా ఈవీఎంలలో హ్యాకింగ్ లేదా వెలుపలి నుంచి డేటాను మార్చే అవకాశం లేదని విస్పష్టంగా చెప్పారు.
లక్నోలోని కొల్విన్ తాలూక్దార్స్ కాలేజీలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న సీఈసీ జ్ఞానేష్ కుమార్ విద్యార్థులు, యువతతో ఆయన ముఖాముఖీ మాట్లాడారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతం, ఎన్నికల యంత్రాంగం పనితీరు, యువ ఓటర్ల భాగస్వామ్యం తదితర అంశాలపై ఆయన విద్యార్థులు యువత అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ఈ సందర్భంగా ఈవీఎంల రూపకల్పన, వాటి భద్రతా ప్రమాణాల గురించి ఆయన వారికి వివరించారు. దేశంలో వినియోగించే ఈవీఎంలను ప్రభుత్వ రంగానికి చెందిన అత్యున్నత రక్షణ, ఎలక్ట్రానిక్స్ సంస్థలు తయారుచేస్తాయన్న ఆయన.. వీటిలో ఇంటర్నెట్, బ్లూటూత్, వైఫై వంటి ఎలాంటి వైర్‌లెస్ సాంకేతిక పరికరాలు లేదా రిసీవర్లు ఉండవన్నారు. నెట్‌వర్క్ కనెక్టివిటీకి ఎలాంటి అవకాశం లేకపోవడం వల్ల ఇంటర్నెట్ ద్వారా ఈవీఎంలను హ్యాక్ చేయడం, హ్యాంపర్ చేయడం అసాధ్యమన్నారు.
దేశంలో 100 కోట్ల మందికి పైగా నమోదిత ఓటర్లు ఉన్నారన్న ఆయన.. ఇంతటి భారీ సంఖ్యలో ఓటర్లు ఉన్న అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో సార్వత్రిక ఎన్నికలు నిర్వహణ గురుతరమైన బాధ్యతగా చెప్పారు. ప్రశాంతమైన వాతావరణంలో, పారదర్శకంగా ఓటింగ్ జరిగేలా చూసేందుకు ఎన్నికల సంఘం పటిష్టమైన యంత్రాంగాన్ని అందుబాటులోకి తెచ్చిందని వెల్లడించారు.
ఎన్నికల నిబంధనలు, చట్టబద్ధమైన మార్గదర్శకాలకు లోబడే ఈవీఎంల కేటాయింపు, తనిఖీలు, లెక్కింపు వరకు ప్రతీ ప్రక్రియ జరుగుతుందని స్పష్టం చేశారు. రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే విడతల వారీగా మాక్ పోలింగ్, సీలింగ్ ప్రక్రియలు పూర్తి చేస్తామని తెలిపారు. దీంతో ఓటింగ్ ప్రక్రియ పారదర్శకతపై ఎలాంటి అపోహలకు తావులేదని స్పష్టం చేశారు.
CEC on EVM Security, CEC Gyanesh Kumar, Indian Election Commission, EVM Hacking Clarity, Lucknow Colvin Taluqdars College


