13 కోట్ల ఓట్లు గల్లంతు? సీఈసీ రాజీనామాకై ముంబైలో హోరెత్తిన నిరసన!
Published on: Sat Oct 3, 2026 9:41AM

భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేష్ కుమార్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని, లేనిపక్షంలో అక్టోబర్ 10న దేశరాజధాని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద భారీ నిరసన ప్రదర్శన చేపడతామని కాక్రోచ్ జనతా పార్టీ (CJP) వ్యవస్థాపకుడు, నాయకుడు అభిజీత్ దిప్కే సంచలన ప్రకటన చేశారు. ముంబైలోని చారిత్రాత్మక శివాజీ పార్క్‌లో వేలాది మంది యువకులు, విద్యార్థులు, రాజకీయ విశ్లేషకులు పాల్గొన్న భారీ బహిరంగ సభను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. పోలీసుల అనుమతి నిరాకరించినప్పటికీ, తీవ్రమైన ఎండను, పోలీసుల బారికేడ్లను లెక్కచేయకుండా వేలాది మంది జనం శివాజీ పార్క్‌కు పోటెత్తారు. జ్ఞానేష్ కుమార్ తన పదవికి రాజీనామా చేసి క్రిమినల్ విచారణను ఎదుర్కోవాలని, అలాగే 2025 నాటి ఓటర్ల జాబితాను స్తంభింపజేసి, 2023 నాటి ఎన్నికల కమిషనర్ల నియామక చట్టాన్ని రద్దు చేయాలని సభ వేదికగా సీజేపీ డిమాండ్ చేసింది.
ఎన్నికల వ్యవస్థలో జరుగుతున్న అక్రమాలపై అభిజీత్ దిప్కే అనేక గణంకాలను బయటపెడుతూ తీవ్రమైన ఆరోపణలు చేశారు. గత రెండు సంవత్సరాల కాలంలో దేశవ్యాప్తంగా దాదాపు 13 కోట్ల మంది అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుండి తొలగించారని ఆయన ఆరోపించారు. 2024 లోక్‌సభ ఎన్నికల సమయంలో దేశంలో మొత్తం 97 కోట్ల మంది నమోదు చేసుకున్న ఓటర్లు ఉండగా, ఎన్డీయే మరియు ఇండియా కూటమి మధ్య ఓట్ల వ్యత్యాసం కేవలం 2 శాతం మాత్రమే ఉందన్నారు. ఆ తేడాను మార్చడానికే ఎన్నికలకు సరిగ్గా 15 రోజుల ముందు జ్ఞానేష్ కుమార్‌ను నియామకం చేశారని విమర్శించారు. అంతేకాకుండా 2024 మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో 40 లక్షల కొత్త ఓటర్లను అనుమానాస్పదంగా చేర్చి ఎన్నికలను ప్రభావితం చేశారని ఆరోపించారు.
.webp)
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ప్రముఖ నాయకుల నియోజకవర్గాల్లో ఓటర్ల తొలగింపు జరిగిందని దిప్కే విశ్లేషించారు. ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నియోజకవర్గంలో 40,000 ఓటర్లను తొలగించడంతో ఆయన కేవలం 4,000 ఓట్ల తేడాతో ఓడిపోయారని తెలిపారు. తమిళనాడులో మాజీ ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్ నియోజకవర్గం నుండి సుమారు 1 లక్ష మంది ఓటర్లను తొలగించడం వల్ల ఆయన 10,000 ఓట్లతో పరాజయం పాలయ్యారని, పశ్చిమ బెంగాల్‌లో కూడా మమతా బెనర్జీ నియోజకవర్గంలో ఇదే రీతిలో ఓటర్ల తొలగింపు జరిగిందని గణాంకాలతో వివరించారు. అధికార పార్టీ "వన్ నేషన్, వన్ ఎలక్షన్, వన్ పార్టీ" అనే లక్ష్యంతో ప్రాంతీయ పార్టీలను తుడిచిపెట్టేందుకు కుట్ర పన్నుతోందని దుయ్యబట్టారు. NEET పేపర్ లీక్ ఆందోళనల తర్వాత కేవలం రెండు నెలల వ్యవధిలోనే మళ్ళీ వీధిలోకి వచ్చి పోరాడాల్సి రావడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని మండిపడ్డారు.
ఈ శివాజీ పార్క్ నిరసన ప్రదర్శనకు పలువురు ప్రముఖులు మరియు విద్యార్థి సంఘాలు మద్దతు తెలిపారు. ప్రముఖ నటులు నసీరుద్దీన్ షా, షబానా అజ్మీ, చిత్రదర్శకులు విశాల్ భరద్వాజ్, హన్సల్ మెహతా, సంగీత దర్శకుడు విశాల్ దద్లానీ, మరియు మహాత్మా గాంధీ ప్రపౌత్రుడు తుషార్ గాంధీ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI), AISF వంటి విద్యార్థి సంఘాలు పెద్ద సంఖ్యలో తరలివచ్చి "జ్ఞానూ, నీకు ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదా?" అనే ప్లకార్డులతో నిరసన తెలిపారు. రాజ్యాంగబద్ధంగా రావాల్సిన ఓటు హక్కును కాపాడుకోకపోతే భావి తరాల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందని అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేశారు. సిఈసీ రాజీనామా చేయకపోతే అక్టోబర్ 10న "జంతర్ మంతర్ 2.0" పేరుతో జాతీయ స్థాయి 'చలో ఢిల్లీ' ఆందోళన నిర్వహిస్తామని సీజేపీ స్పష్టం చేసింది.
[Chief Election Commissioner, Gyanesh Kumar, Cockroach Janata Party, Abhijeet Dipke, Election Commission of India, Voter List, Shivaji Park Protest, Jantar Mantar Protest, Electoral Reforms, Delhi Protest]


