TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

పారిశ్రామిక ఒప్పందాల అమలుపై ఆడిట్ రిపోర్ట్: పెట్టుబడులకు చట్టపరమైన రక్షణ.!

Published on: Sat Nov 14, 2026 9:19AM

ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక రంగంలో సరికొత్త చరిత్ర లిఖించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం వేగంగా ముందుకు సాగుతోంది.  విశాఖపట్నంలో రెండు రోజులు  నిర్వహించిన సీఐఐ భాగస్వామ్య సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీడియాతో మాట్లాడారు.  రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడుల ఒప్పందాలు కేవలం కాగితాలకే పరిమితం కాకుండా, క్షేత్రస్థాయిలో  కార్యరూపం దాల్చేలా నిరంతర పర్యవేక్షణ ఉంటుందన్నారు. కుదుర్చుకున్న ప్రతి ఒప్పందం పురోగతిపై ప్రతి ఏటా   ఆడిట్ నివేదికను విడుదల చేస్తామని ప్రకటించారు.

2024 జూన్ నెల నుంచి రాష్ట్రానికి వచ్చిన, రానున్న పెట్టుబడులకు పూర్తిస్థాయి భద్రత కల్పించేందుకు ప్రత్యేకంగా  ఇన్వెస్ట్‌మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ రూపొందించి కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపుతామని సీఎం చెప్పారు. పరిశ్రమల స్థాపనకు సంబంధించిన అనుమతుల ప్రక్రియను  ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి  స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్' స్థాయికి తీసుకెళ్లామన్నారు. పారిశ్రామికవేత్తలు సెల్ఫ్ సర్టిఫికేషన్‌తోనే పనులు ప్రారంభించే వెసులుబాటు కల్పిస్తూ, అవసరమైన అనుమతులను రియల్ టైమ్‌లో మంజూరు చేస్తున్నామన్నారు. అలాగే, ప్రోత్సాహకాల చెల్లింపుల్లో పారదర్శకత కోసం ప్రత్యేకంగా ఎస్క్రో ఖాతాను సైతం అందుబాటులోకి తెచ్చినట్లు వివరించారు.

ఇటీవల నిర్వహించిన ప్రాంతీయ సదస్సులు,  విశాఖ ప్రధాన సదస్సు ద్వారా రాష్ట్రానికి భారీ ఎత్తున పెట్టుబడులు తరలివచ్చాయి. ఈ సదస్సుల ద్వారా మొత్తం 303 కొత్త ఒప్పందాలు కుదరగా, రమారమి 9.88 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు,  3.48 లక్షల ఉద్యోగ అవకాశాలు లభించాయని సీఎం పేర్కొన్నారు. దీంతో 2024 జూన్ నుంచి ఇప్పటివరకు రాష్ట్రానికి వచ్చిన మొత్తం పెట్టుబడి ప్రతిపాదనల విలువ రూ.32.49 లక్షల కోట్ల రూపాయలకు చేరిందన్న ఆయన,   ప్రభుత్వ విశ్వసనీయతకు ఇది నిదర్శనమన్నారు.  కియా సంస్థ  18,878 కోట్ల రూపాయలతో పెనుకొండ ప్లాంట్ విస్తరణకు ముందుకు వచ్చిందని, దీనివల్ల అదనంగా 12 వేల మందికి ఉపాధి లభిస్తుందని చెప్పారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతిని మరింత వేగవంతం చేసేందుకు పాతిక సెక్టోరల్ పార్కులను ఏర్పాటు చేశామని, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ద్వారా ఎంఎస్ఎంఈలకు అండగా నిలుస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ హబ్‌గా తీర్చిదిద్ది, భవిష్యత్తులో  మేడ్ ఇన్ అమరావతి' క్వాంటం కంప్యూటర్లను విదేశాలకు ఎగుమతి చేసే స్థాయికి చేరుతామన్నారు. విశాఖను ఐటీ, ఏఐ, డేటా సెంటర్ల కేంద్రంగా అభివృద్ధి చేయడంతో పాటు, అరకు అందాలను అంతర్జాతీయ స్థాయిలో ప్రమోట్ చేస్తామన్నారు.

ఇది కూడా చదవండి: సీఐఐ సదస్సు: తొలి రోజు ఎంవోయూల విలువెంతో తెలుసా.?

సాంకేతికత వినియోగంపై వస్తున్న విమర్శలను ముఖ్యమంత్రి   తిప్పికొట్టారు. అంతరిక్షం నుంచి విద్యుత్ ఉత్పత్తి, శాటిలైట్ డేటా సెంటర్ల వంటి ఆధునిక ఆలోచనలను ఎగతాళి చేసేవారు ముందుగా టెక్నాలజీ గురించి నేర్చుకోవాలని హితవు పలికారు. ఇటీవల ఏపీని అతలాకుతలం చేసిన అర్నాబ్, మురసు పెను తుపాన్ల సమయంలో   సాంకేతికతను ఉపయోగించి ముందుకు సాగడం వల్లే  ప్రాణనష్టాన్ని నివారించగలిగామని గుర్తు చేశారు. వ్యవసాయ రంగంలోనూ ఏఐ స్టాక్ తీసుకొచ్చి రైతులకు అండగా నిలుస్తామని, మొండలీజ్ సంస్థతో కలిసి కోకో మిషన్ చేపడుతున్నామని వివరించారు.

రాష్ట్ర సమగ్రాభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన ఎంతో అవసరమని పేర్కొన్న చంద్రబాబు.. రోడ్డు, రైలు, విమాన, జల రవాణా మార్గాలను విస్తరిస్తున్నామని చెప్పారు.   పోలవరం నిర్మాణంతో పాటు  35 వేల కోట్ల రూపాయల వ్యయంతో 36 సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేసి ప్రతి ఎకరాకు నీరందిస్తామన్నారు. అభివృద్ధి విషయంలో పొరుగు రాష్ట్రాలతో ఆరోగ్యకరమైన పోటీ పడుతూనే, పరస్పర సహకారంతో ముందుకు సాగుతామన్నారు.   రానున్న రోజుల్లో ఈ భారీ పెట్టుబడుల ఒప్పందాలన్నీ వాస్తవ రూపం దాల్చి, ఆంధ్రప్రదేశ్ రూపురేకలు పూర్తిగా మారిపోతాయని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.  లక్షలాది మంది యువతకు స్థానికంగానే ఉపాధి అవకాశాలు లభించడంతో పాటు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలోపేతం అవుతుందన్నారు. ప్రభుత్వం ప్రకటించిన వార్షిక ఆడిట్ నివేదికలు, చట్టపరమైన రక్షణ చర్యలు పారిశ్రామికవేత్తల్లో మరింత నమ్మకాన్ని నింపి, భవిష్యత్తులో మరిన్ని అంతర్జాతీయ సంస్థలు ఏపీ వైపు చూసేలా చేస్తాయని ఆర్థిక నిపుణులు అంటున్నారు. 

మీకు నచ్చవచ్చు: ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి గేట్ వే భోగాపురం ఎయిర్‌పోర్ట్ : లోకేష్

విశాఖ వేదికగా భాగస్వామ్య సదస్సు: పెట్టుబడులు, ఉపాధి అవకాశాలే లక్ష్యం.!

[CBN,  CIISummit,  Investment Proposals, Andhra Pradesh,  Quantum,  TeluguOne]