TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ కేబినెట్ రీషఫుల్: ముమ్మర కసరత్తు చేస్తున్న సీబీఎన్.!

Published on: Fri Nov 13, 2026 8:49AM

ఆంధ్రప్రదేశ్ లో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు రెడీ అవుతున్నారా? అంటే ప్రభుత్వ వర్గాల నుంచీ, పరిశీలకుల నుంచీ కూడా ఔనన్న సమాధానమే వస్తోంది. రాష్ట్రంలో స్థానిక పోరు ముగింపునకు వచ్చిన తరుణంలో.. ఇక పాలన, పథకాలు, సంక్షేమ కార్యక్రమాలను మరింత పకడ్బందీగా అమలు చేయడంపై దృష్టి పెట్టిన ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రివర్గ ప్రక్షాళనపై కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.

గత రెండేళ్లలో జరిగిన లోటు పాట్లను సమీక్షించుకుని మంత్రివర్గంలో మార్పులు చేర్పులూ చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. తద్వారా  పాలనలో వేగం పెంచి ప్రజలకు మరింత చేరువ కావాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు. 2029 ఎన్నికలకు సమాయత్తమయ్యే క్రమంలో కీలకమైన రానున్న రెండేళ్లలో ఇప్పటి వరకూ గమనించిన పాలనా లోపాలను సరిదిద్దడమే కాకుండా, ఇటు ప్రభుత్వం, అటు పార్టీని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు చంద్రబాబు నడుంబిగించారని అంటున్నారు.  

ప్రస్తుత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండన్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్న నేపథ్యంలో  మిగిలిన పాలనా కాలాన్ని మరింత సమర్ధంగా వినియోగించుకునే లక్ష్యంతో చంద్రబాబు కేబినెట్ మార్పులూ చేర్పులూ చేయాలని భావిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలుస్తోంది. అదీ కాక కేంద్రంలో మోడీ కూడా తన కేబినెట్ విస్తరణకు ముమ్మర కసరత్తు జరుపుతున్న నేపథ్యంలో, ఇటు రాష్ట్రంలో కూడా మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టి  కేబినెట్ కూర్పులో మార్పులు చేయాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  

2024 ఎన్నికలలో తొలిసారి ఎమ్మెల్యేలుగా గెలిచిన కొంతమందికి మంత్రి పదవులు దక్కాయి. ఆ సందర్భంగా కొందరు సీనియర్లకు అవకాశం దక్కలేదు. ఇప్పుడు తొలి సారి ఎమ్మెల్యేలుగా ఎన్నికై కేబినెట్ లో స్థానం దక్కించుకున్న వారిలో ఆశించిన స్థాయిలో పని తీరు కనబరచని కొందరికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలికి, కొత్త ముఖాలకు, మరీ ముఖ్యంగా సీనియర్లు, తొలి కేబినెట్ లో అవకాశం దక్కని వారికి అవకాశం ఇవ్వాలని చంద్రబాబు భావిస్తున్నట్లు చెబుతున్నారు.  అదే విధంగా జిల్లాల వారీగా పార్టీని పటిష్ఠం చేయగలిగిన సమర్ధులకు కేబినెట్ లో చోటు కల్పించాలన్న భావనతో సీఎం ఉన్నారని పార్టీ, ప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది.  

ఇది కూడా చదవండి:  చంద్రబాబు కేబినెట్ ప్రక్షాళన? ఎందరు మంత్రులపై వేటంటే?

కొన్ని జిల్లాల్లో పార్టీ నాయకత్వ లోపాలు, ఆశించిన ఫలితాలు రాకపోవడం వంటి అంశాలు కేబినెట్ ప్రక్షాళనకు ప్రధాన కారణాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా రాయలసీమ,  ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి కొందరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అలాగే, ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న జనసేన, బీజేపీ పార్టీల  కోటాలో కూడా కొన్ని మార్పులు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. సామాజిక సమీకరణాలను దృష్టిలో ఉంచుకుని బీసీ వర్గాలకు సముచిత ప్రాధాన్యత కల్పించేలా  చంద్రబాబు కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 

కేబినెట్ లో కొందరి శాఖలను మార్చడం, కొందరికి ఉద్వాసన పలకడం ద్వారా కొత్తగా కేబినెట్ లోకి ఎందరిని తీసుకుంటారు? ఎవరెవరికి ఉద్వాసన పలుకుతారు అన్న చర్చ ఇప్పుడు పార్టీ, ప్రభుత్వ వర్గాలలో జోరుగా సాగుతోంది.  దీంతో ఆశావహులు తమ వంతు ప్రయత్నాలను ఇప్పటికే ఆరంభించినట్లు చెబుతున్నారు. కూటమి ఐక్యతను మరింత పెంచేలా, సామాజిక, ప్రాంతీయ సమతుల్యత ఉండేలా చంద్రబాబు కేబినెట్ పునర్వ్యవస్థీకరణ ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మీకు నచ్చవచ్చు: ఉగాది తరువాత ఏపీ కేబినెట్ విస్తరణ.?

ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

[CBN, Cabinet, Reshuffle, NewFaces, Changes, Inclissions, TeluguOne]