TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

సాయికృష్ణ కస్టోడియల్ డెత్: దర్యాప్తు చేపట్టిన సీబీఐ.!

Published on: Fri Oct 23, 2026 10:03AM

ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో హైకోర్టు ఆదేశాల మేరకు దర్యాప్తును సీబీఐ చేపట్టింది. డీ మృతి కేసుకు సంబంధించి హైకోర్టు కీలకమైన ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో, ఈ కేసను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) విచారణకు బదిలీ చేస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.  ఈ దారుణ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపైనా, నిందితులను రక్షించే ప్రయత్నం జరుగుతోందనీ, మృతుడి తల్లి విజయలక్ష్మి హైకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్ ను విచారించిన ఏపీ హైకోర్టు కేసు దర్యాప్తును సీబీఐకి బదలీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు గాదె సాయికృష్ణ కస్టోడియల్ మృతి కేసు దర్యాప్తును సీబీఐ బుధవారం (అక్టోబర్ 22) అధికారికంగా చేపట్టింది. 

ఇక ఈ కేసు వివరాల్లోకి వెళితే, విజయవాడలోని కృష్ణలంక పోలీస్ స్టేషన్‌ పరిధిలో  ఒక కేసుకు సంబంధించి సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత ఆయన ఆచూకీ లభించలేదు. సాయికృష్ణను చిత్రహింసలకు గురి చేసినట్లు   సిట్  దర్యాప్తులో వెల్లడైంది. కృష్ణలంక  సీఐ ఎస్‌.ఎస్‌.వి.వి. నాగరాజు, హెడ్ కానిస్టేబుల్ అశోక్, కానిస్టేబుల్ నానిలతో పాటు మరో నలుగురు సిబ్బంది ఈ అమానుష కాండలో భాగస్వామ్యులుగా ఉన్నట్లు తేలింది. సాయికృష్ణను కస్టడీలో చిత్రహింసలకు గురి చేసి అతడి మృతికి కారకులు కావడమే కాకుండా,  ఆధారాలు మాయం చేసేందుకు మృతదేహాన్ని దహనం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. 

ఈ దారుణంపై జూన్ 2న సాయికృష్ణ తల్లి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వం ఐజీ ఎం. రవిప్రకాష్ నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేయగా, వారు జూన్ 21న సస్పెండ్ అయిన సీఐ నాగరాజును అరెస్ట్ చేసి సెప్టెంబర్‌లో చార్జ్‌షీట్ కూడా దాఖలు చేశారు. అయితే, పోలీసుల పాత్రపై లోతుగా విచారణ జరగలేదని, కిందిస్థాయి అధికారులతో పాటు అసలు దోషులను కాపాడే ప్రయత్నం జరుగుతోందని మృతుడి తల్లి కోర్టును ఆశ్రయించారు. ఆ పిటిషన్ ను విచారించిన హైకోర్టు దర్యాప్తులోని లోపాలను తీవ్రంగా పరిగణించింది. రాష్ట్ర పోలీసుల దర్యాప్తుపై  నమ్మకం సడలిందని పేర్కొంటూ, ఈ కేసులో నిజానిజాలు నిగ్గు తేల్చడానికి  సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది.  


[CBI Start Investigation Gade Sai Krishna custodial death Case, AP High Court, CBI Probe, Telugu One]