TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

రెచ్చగొట్టే వ్యాఖ్యలు: తాడిపత్రిలో కేతిరెడ్డి పెద్దారెడ్డిపై కేసు.!

Published on: Fri Oct 16, 2026 3:28PM

తాడిపత్రిలో మళ్లీ  ఉద్రిక్తతలు నెలకొన్నాయి.  స్థానిక సంస్థల ఎన్నికల వాతావరణం వేడెక్కుతున్న తరుణంలో..  ప్రత్యర్థి వర్గాన్ని ఉద్దేశించి రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో  వైసీపీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిపై  పోలీసులు కేసు నమోదు చేశారు. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా, ప్రజలను రెచ్చగొట్టేలా మాట్లాడారంటూ,,  తెలుగుదేశం  నేతలు చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్న సమయంలో కేతిరెడ్డి పెద్దారెడ్డి తాడిపత్రిలో  పార్టీ శ్రేణులతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ నేత, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గంపై నిప్పులు చెరుగుతూ విమర్శలు గుప్పించారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ తరఫున ఫయాజ్ బాషాను మున్సిపల్ ఛైర్‌పర్సన్ అభ్యర్థిగా బరిలోకి దింపుతున్నామని ప్రకటించిన కేతిరెడ్డి పెద్దారెడ్డి.. ఈ సందర్భంగా జేసీ ప్రభాకరరెడ్డి, ఆయన వర్గంపై తీవ్ర స్థాయిలో విమర్శలు, ఆరోపణలు చేశారు. 

తనను తాడిపత్రిలోకి రాకుండా అడ్డుకునేందుకు   ప్రయత్నించారని, అయినప్పటికీ న్యాయస్థానం అనుమతితోనే తాను నియోజకవర్గానికి రాగలిగానని కేతిరెడ్డి గుర్తుచేశారు.   అధికారంలో ఉన్నామని విర్రవీగడం మానుకోవాలనీ, అధికారం  శాశ్వతం కాదనీ,  జేసీ ప్రభాకర్ రెడ్డి అనుచరులు, కొందరు అధికారులు బాగా గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. తనతో పెట్టుకుంటే తగిన ప్రతీకారం తీర్చుకుంటాననంటూ కేతిరెడ్డి పెద్దారెడ్డి హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన జేపీ మాటలు విని ఎవరైనా పోటీ చేశారో జాగ్రత్త అంటూ  ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పందంగా మారాయి. 

పెద్దారెడ్డి  ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వీడియోలు మరియు సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడంతో, తెలుగుదేశం పార్టీ శ్రేణులు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ వ్యవహారంపై టీడీపీ తాడిపత్రి పట్టణ అధ్యక్షుడు హాజీ బాషా నేరుగా పోలీసులను ఆశ్రయించారు. కేతిరెడ్డి పెద్దారెడ్డి తన ప్రసంగంలో ప్రత్యర్థి వర్గాన్ని బెదిరించేలా, శాంతిభద్రతలకు భంగం కలిగించేలా మాట్లాడారని ఆయన తన ఫిర్యాదులో స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో ఇలాంటి హెచ్చరికలు ప్రజల్లో భయాందోళనలు సృష్టిస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

 

టీడీపీ నేత హాజీ బాషా అందించిన ఫిర్యాదును పరిశీలించిన అనంతరం, తాడిపత్రి పోలీసులు  కేతిరెడ్డి పెద్దారెడ్డిపై పలు సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్ నమోదు చేసి,  దర్యాప్తు చేపట్టారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న తరుణంలో నమోదైన ఈ కేసు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

గతంలో కూడా తాడిపత్రి నియోజకవర్గంలో కేతిరెడ్డి పెద్దారెడ్డికి, జేసీ ప్రభాకర్ రెడ్డి వర్గానికి మధ్య తరచూ రాజకీయ ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. ఇరువర్గాల మధ్య నెలకొన్న ఈ కక్షసాధింపు రాజకీయాలు, సవాళ్లు, ప్రతిసవాళ్లు నియోజకవర్గంలో ఎప్పుడూ ఒక రకమైన ఉద్రిక్త వాతావరణాన్ని సృష్టిస్తుంటాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు మునుపటి కంటే మరింత ప్రతిష్టాత్మకంగా మారడంతో, నేతల మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరింది. 

[Case Against Kethireddy Peddareddy, YCP Former Mla, Tadipatri, JC Prabhakar Reddy, YCP VS TDP, Telugu One]