బ్రిటన్ భవితవ్యంపై కార్డిఫ్ ఒప్పందం: యూకే విచ్ఛిన్నం కానుందా?
Published on: Thu Sep 17, 2026 5:23PM

బ్రిటిష్ రాజకీయాల్లో గతంలో ఎన్నడూ లేనివిధంగా సరికొత్త పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. వేల్స్ రాజధాని కార్డిఫ్‌లో జరిగిన ఒక కీలక సమావేశంలో స్కాటిష్ నేషనల్ పార్టీ, ప్లైడ్ సిమ్రు, సిన్ ఫెయిన్ అగ్రనేతలు ఒక చారిత్రక ఒప్పందంపై సంతకాలు చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. బ్రిటన్ కేంద్ర ప్రభుత్వమైన వెస్ట్‌మిన్‌స్టర్ పాలనా కాలం త్వరలోనే ముగియనుందని ఈ సందర్భంగా ఆ నేతలు ప్రకటించారు. అంతేకాకుండా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్ ప్రాంతాలలో రాజ్యాంగ పరమైన మార్పుల కోసం సిద్ధం కావాలని, ఇందుకు తగిన ప్రణాళికలు రూపొందించాలని బ్రిటిష్ ప్రభుత్వాన్ని వారు డిమాండ్ చేశారు. ముఖ్యంగా స్కాటిష్ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ మాట్లాడుతూ.. ప్రస్తుత ప్రధాని ఆండీ బర్న్‌హామ్ యునైటెడ్ కింగ్‌డమ్‌కు చివరి ప్రధాన మంత్రి అవుతారని జోస్యం చెప్పడం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుత హోలీరూడ్ పదవీకాలం ముగిసేలోపు స్వాతంత్ర్యంపై ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని డిమాండ్లు ఊపందుకున్నాయి.
ఒకప్పుడు ప్రపంచంలోని భూభాగంలో నాలుగో వంతును పాలించిన, సూర్యుడస్తమించని మహా సామ్రాజ్యం.. ఇప్పుడు తన స్వంత దేశ సరిహద్దులను తిరిగి గీసుకోవాలని కోరడం చారిత్రక పరిణామంగా చెప్పాల్సి ఉంటుంది. అయితే కార్డిఫ్ వేదికగా విడుదలైన ప్రకటనలకు, యూకే వాస్తవంగా విడిపోవడానికి మధ్య చట్టపరమైన అంశాలు, లెక్కలు, ప్రజాభిప్రాయం రూపంలో బలమైన అడ్డంకులు ఉన్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
చారిత్రక నేపథ్యం, అంతర్గత మార్పులు
బ్రిటిష్ సామ్రాజ్యం గతంలో వాణిజ్య కేంద్రాలుగా ప్రారంభమై ప్రపంచంలోనే అతిపెద్ద సామ్రాజ్యంగా అవతరించింది. నాటి ప్లాసీ యుద్ధం మొదలుకొని విక్టోరియా రాణి హయాం వరకు ప్రపంచవ్యాప్తంగా విస్తరించిన ఈ సామ్రాజ్యం, రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత బలహీనపడింది. 1947లో ఇండియాకు స్వాతంత్ర్యం లభించడం వలసవాద నిర్మూలనలో అతిపెద్ద మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత కాలక్రమేణా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వలస రాజ్యాలు విడిపోవడంతో సామ్రాజ్యం కరిగిపోయింది. బాహ్య ప్రపంచంలో జరిగిన ఈ మార్పులతో పాటు, యూకే అంతర్గతంగా కూడా అనేక ప్రాంతాల కలయికతో ఏర్పడింది. ఇంగ్లాండ్, వేల్స్, స్కాట్లాండ్, ఐర్లాండ్‌లు వేర్వేరు చట్టాలు, ఒప్పందాల ద్వారా యునైటెడ్ కింగ్‌డమ్‌గా ఏర్పడ్డాయి. అయితే కాలక్రమేణా ఈ ప్రాంతాలలో స్వయం పాలన డిమాండ్లు పెరుగుతూ వచ్చాయి. 1997-98 కాలంలో జరిగిన అధికార బదిలీ కారణంగా స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లకు ప్రత్యేక పార్లమెంట్లు, అసెంబ్లీలు ఏర్పడినప్పటికీ రాజ్యాంగపరమైన పూర్తి అధికారాలు మాత్రం వెస్ట్‌మిన్‌స్టర్ చేతిలోనే ఉండిపోయాయి.
2014లో జరిగిన స్కాటిష్ స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణలో స్వల్ప తేడాతో స్వాతంత్ర్యం తిరస్కరించబడినప్పటికీ, ఆ తర్వాత జరిగిన బ్రెగ్జిట్ పరిణామాలు ఈ డిమాండ్లను మరింత బలంగా ముందుకు తీసుకువచ్చాయి. యూరోపియన్ యూనియన్‌లోనే కొనసాగాలని స్కాట్లాండ్ ప్రజలు కోరుకున్నప్పటికీ, బ్రెగ్జిట్ కారణంగా యూకే మొత్తం ఈయూ నుంచి బయటికి రావాల్సి వచ్చింది. దీనితో పాటు 2022లో యూకే సుప్రీంకోర్టు వెస్ట్‌మిన్‌స్టర్ అనుమతి లేకుండా స్కాటిష్ పార్లమెంట్ ఏకపక్షంగా ప్రజాభిప్రాయ సేకరణ జరపలేదని స్పష్టం చేసింది. తాజా ఎన్నికల్లో స్కాట్లాండ్, వేల్స్ ప్రాంతాలలో స్వాతంత్ర్య అనుకూల పార్టీలు విజయం సాధించడంతో ఈ రాజ్యాంగ సంక్షోభం మళ్లీ తెరపైకి వచ్చింది.
చట్టపరమైన అడ్డంకులు, రాజ్యాంగ సవాళ్లు
కార్డిఫ్ ఒప్పందానికి, బ్రిటన్ వాస్తవ విభజనకు మధ్య ఉన్న అతిపెద్ద గోడ చట్టపరమైన నిబంధనలేనని చెప్పాలి. స్కాట్లాండ్ చట్టం 1998 ప్రకారం, రాజ్యాంగపరమైన అన్ని కీలక అంశాలు వెస్ట్‌మిన్‌స్టర్ పార్లమెంట్ పరిధిలోనే ఉంటాయి. చట్టబద్ధమైన ప్రజాభిప్రాయ సేకరణ జరగాలంటే ఎడిన్‌బర్గ్‌కు అధికారాలను బదిలీ చేసే సెక్షన్ 30 ఆర్డర్ అత్యవసరం. అయితే గతంలో కన్జర్వేటివ్ ప్రభుత్వాలు, ప్రస్తుత లేబర్ ప్రభుత్వాలు కూడా ఈ ఆర్డర్‌ను మంజూరు చేయడానికి నిరాకరిస్తూ వచ్చాయి. వస్తున్నాయి. ఉత్తర ఐర్లాండ్ విషయంలో మాత్రం గుడ్ ఫ్రైడే ఒప్పందం ప్రకారం ప్రత్యేక నిబంధన ఉంది. ఐక్య ఐర్లాండ్ కోసం మెజారిటీ ప్రజలు కోరుకుంటున్నారని స్పష్టమైన సంకేతాలు ఉంటే అక్కడ బోర్డర్ పోల్ నిర్వహించాల్సి ఉంటుంది. కానీ వేల్స్ విషయానికి వస్తే అక్కడ స్వాతంత్ర్య ప్రజాభిప్రాయ సేకరణను నిర్వహించడానికి ఎలాంటి ప్రత్యేక చట్టపరమైన యంత్రాంగం ఇప్పటివరకు అందుబాటులో లేదు. ఈ వాస్తవాలన్నీ తెలిసే ఆయా పార్టీల నేతలు ఈ ఒప్పందంపై సంతకాలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రజాభిప్రాయ సేకరణల కంటే ప్రభుత్వ మార్పు కోసం ప్రణాళికలు సిద్ధం చేసుకోవడంపైనే ఈ ఒప్పందం ప్రధానంగా దృష్టి సారించింది.
రాజకీయ ప్రతిస్పందనలు, ప్రజాభిప్రాయం
ఈ ఒప్పందంపై యూకేలోని యూనియనిస్ట్ పార్టీల నుంచి తీవ్ర వ్యతిరేక్త వ్యక్తమవుతోంది. స్కాటిష్ కన్జర్వేటివ్ నాయకులు స్పందిస్తూ.. సిన్ ఫెయిన్‌తో స్కాటిష్ నేషనల్ పార్టీ చేతులు కలపడాన్ని ప్రజలు హర్షించరని పేర్కొన్నారు. అలాగే వేల్స్‌లో మూడింట రెండు వంతుల కన్నా ఎక్కువ మంది ప్రజలు స్వాతంత్య్రాన్ని వ్యతిరేకిస్తున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. స్కాట్లాండ్‌లో కూడా ప్రజాభిప్రాయం రెండు భాగాలుగా చీలిపోయిందని, స్పష్టమైన మెజారిటీ లభించనంతవరకు ఈ డిమాండ్లు కేవలం రాజకీయ ప్రకటనలకే పరిమితమవుతాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో కూడా ఈ పరిణామాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. అమెరికా అధ్యక్ష పదవిలో ఉన్న డొనాల్డ్ ట్రంప్ వంటి ప్రముఖులు ఐరిష్ పునరేకీకరణపై సానుకూల వ్యాఖ్యలు చేయడం ఐరిష్ జాతీయవాదులకు పరోక్షంగా బలాన్ని చేకూరుస్తోంది. అయినప్పటికీ, ఆర్థిక వాస్తవాలు, యూరోపియన్ యూనియన్‌తో సంబంధాల పునరుద్ధరణ వంటి అంశాలపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
భవిష్యత్ పరిణామాలు
యునైటెడ్ కింగ్‌డమ్ తక్షణమే విడిపోయే అవకాశం లేనప్పటికీ, ప్రాంతీయ పార్టీలు చూపుతున్న పట్టుదల భవిష్యత్ రాజకీయ మార్పులకు పునాదిగా చెప్పవచ్చు. ప్రభుత్వాల మార్పులు, ఆర్థిక పరిస్థితులు, ప్రజల ఆలోచనా విధానంలో వచ్చే మార్పులే రాబోయే రోజుల్లో యూకే గమనాన్ని నిర్ణయిస్తాయి. ఒకప్పుడు ప్రపంచ దేశాల సరిహద్దులను శాసించిన బ్రిటన్, ఇప్పుడు తన స్వంత దేశంలోని ప్రాంతాల నుంచి వస్తున్న స్వయంప్రతిపత్తి డిమాండ్లను ఏ విధంగా ఎదుర్కొంటుందనేది చారిత్రక ప్రాధాన్యం సంతరించుకుంది. కార్డిఫ్ ఒప్పందం కేవలం కాగితంపై జరిగిన సంతకమే అయినప్పటికీ.. ఇది రాబోయే కాలంలో బ్రిటన్ రాజకీయాల్లో పెను మార్పులకు నాంది పలికే సూచనలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొత్తగా ఏర్పడుతున్న రాజకీయ సమీకరణాలు, ప్రజల నుంచి వస్తున్న స్పందనను బట్టి రాబోయే సంవత్సరాల్లో యూకే రాజ్యాంగ భవిష్యత్ ఏమిటనేది తేలనుంది. చరిత్ర తన గ్లోబల్ చక్రం ద్వారా సరికొత్త పాఠాలు నేర్పుతున్న తరుణంలో, బ్రిటన్ నాయకత్వం ఈ అంతర్గత సవాళ్లను ఎలా అధిగమిస్తుందనేది వేచి చూడాలి.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Cardiff Agreement, Britains departure, Scottish independence, Westminster Parliament, United Kingdom politics, Telugu One]


