TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..ఈ తప్పే కారణం కావచ్చు!

Published on: Sun Oct 11, 2026 4:12PM

ఎంత ప్రయత్నించినా బరువు తగ్గడం లేదా..ఈ తప్పే కారణం కావచ్చు!

బరువు తగ్గడం అనేది ఒక ప్రయాణం. ఈ క్రమంలో చాలామంది వేగంగా ఫలితాలు సాధించాలనే తొందరలో కొన్ని తీవ్రమైన పొరపాట్లు చేస్తుంటారు. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవడానికి పడే శ్రమ, సరైన పద్ధతిలో లేకపోతే ఆరోగ్యానికి మేలు జరగకపోగా తీవ్రమైన నష్టం వాటిల్లే అవకాశం ఉంది. వెయిట్ లాస్ జర్నీలో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదని చెప్పే ప్రధానమైన తప్పులు, వాటి వల్ల కలిగే నష్టాలు కొన్ని ఉన్నాయి. వాటి గురించి వివరంగా తెలుసుకుంటే..

ఆహారాన్ని పూర్తిగా తగ్గించడం లేదా స్కిప్ చేయడం..

బరువు తగ్గే క్రమంలో చాలామంది చేసే అతి పెద్ద పొరపాటు. త్వరగా బరువు తగ్గవచ్చనే అపోహతో ఉదయం పూట టిఫిన్ లేదా రాత్రి భోజనాన్ని మానేస్తుంటారు. ఇలా చేయడం వల్ల శరీరానికి కావలసిన శక్తి అందదు. దాంతో తీవ్రమైన అలసట, నీరసం ఏర్పడతాయి. అంతేకాకుండా, తర్వాత పూట అతిగా తినే ప్రమాదం పెరుగుతుంది. ఇది బరువు తగ్గించడానికి బదులు మరింత పెరగడానికి కారణమవుతుంది.

ఎనర్జీ, కేలరీల ప్రాధాన్యతను విస్మరించడం..

కేలరీలను తగ్గించుకోవాలనే ఆలోచనలో శరీర జీవక్రియలకు అవసరమైన కనీస శక్తిని కూడా ఇవ్వకపోవడం సరైనది కాదు. రోజువారీ పనులు చేసుకోవడానికి, ఉత్సాహంగా ఉండటానికి సరైన పరిమాణంలో క్యాలరీలు అవసరం. అతి తక్కువ కేలరీల ఆహారం తీసుకోవడం వల్ల మెటబాలిజం రేటు మందగిస్తుంది. ఫలితంగా శరీరం కొవ్వును కరిగించే సామర్థ్యాన్ని కోల్పోతుంది.

పోషకాహార లోపం..

 బరువు తగ్గే ప్రక్రియలో ఎదురయ్యే ప్రధాన సమస్య. కేవలం కేలరీల లెక్కింపు పైనే దృష్టి పెట్టి, తింటున్న ఆహారంలో విటమిన్లు, మినరల్స్, ప్రొటీన్, ఫైబర్ ఉన్నాయో లేదో గమనించకపోవడం పెద్ద తప్పు. కార్బోహైడ్రేట్లు లేదా కొవ్వులను పూర్తిగా పక్కన పెట్టేయడం వల్ల శరీరానికి కావలసిన ముఖ్యమైన పోషకాలు అందవు. దీనివల్ల జుట్టు రాలడం, చర్మం నిస్తేజంగా మారడం, ఎముకలు బలహీనపడటం , రోగనిరోధక శక్తి తగ్గడం వంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.

నీరు తగినంత తీసుకోకపోవడం..

నీరు తగినంత తీసుకోకపోవడం  శరీరంలో కొవ్వును కరిగించే వ్యవస్థను దెబ్బతీస్తుంది. చాలామంది దప్పికను, ఆకలిని సరిగా గుర్తుపట్టలేక దప్పికైనప్పుడు కూడా ఏదో ఒకటి తింటూ ఉంటారు. ప్రతిరోజూ శరీరానికి అవసరమైన స్థాయిలో నీరు తాగడం వల్ల టాక్సిన్లు బయటకు పోవడమే కాకుండా, జీర్ణక్రియ సమర్థవంతంగా పనిచేస్తుంది.

వ్యాయామం..

వ్యాయామం విషయంలో కూడా తీవ్రమైన తేడాలు కనిపిస్తుంటాయి. కొందరు అసలు వ్యాయామమే చేయకుండా కేవలం డైటింగ్ పై ఆధారపడితే, మరికొందరు మితిమీరిన వ్యాయామాలు చేస్తుంటారు. శరీరానికి తగినంత విశ్రాంతి ఇవ్వకుండా నిరంతరం కష్టపెట్టడం వల్ల కండరాల బలహీన పడతాయి,  గాయాలు అయ్యే అవకాశం ఉంది.

నిద్ర..

బరువు తగ్గే ప్రయాణంలో నిద్ర పాత్ర చాలా కీలకమైనది. సరైన నిద్ర లేకపోవడం వల్ల శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతిని ఆకలిని పెంచే హార్మోన్లు విడుదలవుతాయి.

మానసిక ఒత్తిడి..

మానసిక ఒత్తిడి కూడా బరువు తగ్గే ప్రక్రియకు పెద్ద అడ్డంకి. ఒత్తిడి వల్ల కార్టిసోల్ అనే హార్మోన్ విడుదలై పొత్తికడుపు భాగంలో కొవ్వు పెరగడానికి కారణమవుతుంది. ప్రతిరోజూ బరువు చూసుకుంటూ తీవ్ర ఆందోళనకు గురికావడం వల్ల కూడా ఎలాంటి పాజిటివ్ ఫలితాలు రావు.

బరువు తగ్గడం అనేది చాలా చిన్న  ప్రక్రియ కాదు, అదొక ఆరోగ్యకరమైన జీవనశైలి మార్పు. ఎనర్జీ , పోషకాల విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, సమతుల్యాహారాన్ని సరిపడా పరిమాణంలో తీసుకుంటూ, క్రమం తప్పకుండా వ్యాయామం, తగినంత నిద్ర, మంచి నీరు బాగా తాగడం వంటి అలవాటు పాటించడం ద్వారా మాత్రమే పూర్తిగా బరువు తగ్గడం లో   ఆరోగ్యకరమైన ఫలితాలను పొందవచ్చు.

                         *రూపశ్రీ.