TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీ గ్రీన్ చైర్మన్ నాగబాబుకు కేబినెట్ హోదా.. ఉత్తర్వులు జారీ.!

Published on: Thu Sep 10, 2026 11:33AM

జనసేన అధినేత పవన్ కల్యాణ్ సోదరుడు, ఆ పార్టీ కీలక నాయకుడు,   ఎమ్మెల్సీ నాగబాబుకు కేబినెట్ హోదా కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పర్యావరణ, అటవీ శాఖ పరిధిలోని  ఏపీ-గ్రీన్  ఎగ్జిక్యూటివ్‌ కమిటీ చైర్మన్ గా ఆయనను రెండేళ్ల కాలానికి నియమించిన ప్రభుత్వం... తాజాగా ఆయనకు కేబినెట్ ర్యాంక్‌తో పాటు సంబంధిత వేతన, భత్యాలను నిర్దేశిస్తూ  జీవో  విడుదల చేసింది.

ఆర్థిక శాఖ సమ్మతితో వెలువడిన ఈ ఉత్తర్వుల ప్రకారం.. నాగబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన తేదీ నుండి కేబినెట్ స్థాయి వేతన, భత్యాలు వర్తించనున్నాయి. పర్యావరణ పరిరక్షణ, అటవీకరణ, హరితాంధ్ర ప్రదేశ్‌ లక్ష్య సాధనలో భాగంగా 'వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 విజన్‌లో 50 శాతం పచ్చదనం సాధించడమే ధ్యేయంగా ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్‌ కమిటీ పనిచేస్తుంది. ఈ క్రమంలో ఈ కమిటీ వ్యవహారాలు, వివిధ శాఖల సమన్వయం, జిల్లాల వారీగా కార్యక్రమాల పర్యవేక్షణ వేగవంతం చేసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం  పేర్కొంది.  

  నాగబాబుకు కేబినెట్ హోదా దక్కడం పట్ల జనసైనికులు, మెగా అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అటవీకరణను ప్రోత్సహించడం, ప్లాంటేషన్ డ్రైవ్‌లను విస్తృతం చేయడం, పర్యావరణ సమతుల్యత  దెబ్బతినకుండా  చర్యలు తీసుకోవడంలో ఈ కమిటీ పాత్ర అత్యంత కీలకం కానుంది. ఇకపై అన్ని జిల్లాల్లో అధికారులను సమన్వయం చేసుకుంటూ, ప్రభుత్వం నిర్దేశించుకున్న 50 శాతం గ్రీన్ కవర్ లక్ష్య సాధన దిశగా నాగబాబు తన ప్రణాళికలను అమలు చేయనున్నారు. ప్రభుత్వ పాలనా వ్యవహారాల్లో,  పర్యావరణ హిత విధానాల రూపకల్పనలో కీలకమైన ఈ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి, రాష్ట్రానికి హరిత శోభను తీసుకురావడంలో నాగబాబు నాయకత్వం ఎంతో తోడ్పడుతుందని  పరిశీలకులు భావిస్తున్నారు.


[Cabinet Rank Nagababu, AP Government, Cabinet Status, AP Green Committee, Janasena Party, Viksit Andhra Pradesh, Telugu One]