TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

క్యాబ్‌ డ్రైవర్‌ అనుమానాస్పద మృతి..!

Published on: Sat Sep 12, 2026 4:26PM

బేగంపేటలో ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి.. రుద్రారం వద్ద మృతదేహం..!

బేగంపేటలో క్యాబ్‌ డ్రైవర్‌గా పనిచేస్తున్న రాజశేఖర్‌ అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం కలకలం రేపింది. గురువారం మధ్యాహ్నం 3.30 గంటల ప్రాంతంలో ఇంటి నుంచి కారులో విధులకు వెళ్లిన ఆయన తిరిగి ఇంటికి రాలేదు. సాధారణంగా విధులు ముగించుకుని ఉదయం 6 గంటలలోపు ఇంటికి చేరుకునే రాజశేఖర్‌ శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. దీంతో ఆయన భార్య లీల బేగంపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు నమోదు చేసి రాజశేఖర్‌ ఆచూకీ కోసం గాలింపు చేపట్టారు. ఆయన ప్రయాణించిన మార్గం, ఫోన్‌ వివరాలు, కారుకు సంబంధించిన సమాచారంపై ఆరా తీశారు. ఈ క్రమంలో రాజశేఖర్‌కు చెందిన కారు కోహీర్‌–బుదేరా సమీపంలోని జాతీయ రహదారి పక్కన ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఆయన ఆచూకీ కోసం మరింత విస్తృతంగా గాలింపు చేపట్టారు.

ఇదిలా ఉండగా, శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పటాన్‌చెరు రుద్రారం సమీపంలో ఓ వ్యక్తి మృతదేహం ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి అది అదృశ్యమైన రాజశేఖర్‌దేనని గుర్తించారు. అనంతరం కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రాజశేఖర్‌ను కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉండవచ్చన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కారులోనే ఆయనను హత్య చేసి అనంతరం మృతదేహాన్ని రుద్రారం సమీపంలో పడేసి ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రాజశేఖర్‌ మృతికి అసలు కారణం ఏమిటన్నది పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తులో తేలాల్సి ఉంది.

రాజశేఖర్‌ మృతదేహం రుద్రారం వద్ద లభించగా, ఆయన కారు మాత్రం సుమారు 60 కిలోమీటర్ల దూరంలో కోహీర్‌–బుదేరా సమీపంలో లభించడం పలు అనుమానాలకు తావిస్తోంది. కారు అక్కడికి ఎలా చేరుకుంది? రాజశేఖర్‌ రుద్రారం వరకు ఎలా వచ్చారు? ఆయన వెంట ఎవరైనా ఉన్నారా? ఘటనకు ముందు ఏం జరిగింది? అనే కోణాల్లో పోలీసులు విచారణ చేస్తున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్‌ పోలీసులు, క్లూస్‌ టీమ్‌ ఆధారాలను సేకరించారు.

రాజశేఖర్‌ మహీంద్రా సాఫ్ట్‌వేర్‌ కంపెనీకి క్యాబ్‌ నడుపుతున్నారు. ఆయనకు నాలుగు కార్లు ఉన్నాయి. భార్య లీలా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. రాజశేఖర్‌ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.  రాజశేఖర్‌ అదృశ్యమైనప్పటి నుంచి మృతదేహం లభ్యమయ్యే వరకు జరిగిన పరిణామాలపై పోలీసులు పూర్తిస్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణం ఏమిటి? నిందితులు ఎవరు? అనే విషయాలను తేల్చేందుకు వివిధ కోణాల్లో విచారణ కొనసాగిస్తున్నారు.

 

 

 

[ Cab driver dies under suspicious circumstances, Rajasekhar, Wife Leela, Cyberabad Police, 
Mahindra Software Company, CP Sajjanar, DGP C.V. Anand,Telugu One, Telugu News ]