మరో బీఆర్ఎస్ వికెట్ డౌన్.. ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే బేతి రాజీనామా

బీఆర్ఎస్ నుంచి వలసల పర్వం కొనసాగుతోంది. సరిగ్గా సార్వత్రిక ఎన్నికల వేళ ఆ పార్టీకి వరుస షాక్ లు తగులుతున్నాయి. పార్టీ అగ్రనాయకత్వం ఎంతగా ప్రయత్నించినా పార్టీ నుంచి వలసలను ఆపడంలో విఫలమౌతున్నది. తాజాగా ఆ పార్టీ నుంచి మరో మాజీ ఎమ్మెల్యే రాజీనామా చేసి బయటకు వచ్చారు.

ఉప్పల్ బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి కారు దిగిపోయారు. లోక్ సభ ఎన్నికలకు పార్టీ టికెట్ విషయంలో అధిష్ఠానం ఏకపక్ష నిర్ణయాలను వ్యతిరేకిస్తూ తానీ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు. మల్కాజ్ గిరి ఎంపీ టికెట్ ను లక్ష్మారెడ్డికి ఇవ్వడంపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఆయనను గెలిపించాలంటూ తాను ప్రజల ముందుకు వెళ్లి ప్రచారం చేయలేనని బేతి సుభాష్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావుకు గురువారం (ఏప్రిల్ 18) ఓ లేఖ రాశారు. అవకాశ వాది అయిన లక్ష్మారెడ్డి తరఫున ఎన్నికల ప్రచారం చేయలేనని పేర్కొన్న ఆయన తెలంగాణ ఉద్యమ నేత, బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ కోసం తాను ప్రచారం చేయనున్నట్లు బేతి సుభాష్ రెడ్డి వెల్లడించారు. తన రాజీనామాను, కేసీఆర్ కు రాసిన లేఖను ఆయన సామాజిక మాధ్యమంలో షేర్ చేశారు.