రేవంత్ సర్కార్ అరాచకాలపై బీఆర్ఎస్ పింక్ బుక్.!
Published on: Tue Sep 22, 2026 3:34PM

రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పై ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ విమర్శల దూకుడు పెంచింది. బీఆర్ఎస్ నాయకులు, పార్టీ శ్రేణులను లక్ష్యంగా చేసుకుని ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును, సాగిస్తున్న అణచివేత ధోరణిని తీవ్రంగా పరిగణించిన బీఆర్ఎస్.. పింక్ బుక్‌ను తెరపైకి తెచ్చింది. ప్రభుత్వం మారిన నాటి నుంచి ప్రతిపక్ష నేతలపై జరుగుతున్న ప్రతీకార చర్యలు, అక్రమ కేసులు, వేధింపులకు సంబంధించిన ప్రతి అంశాన్ని ఈ పింక్ బుక్ లో లిఖితపూర్వకంగా నమోదు చేసేందుకు ఈ ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసింది.
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరుగుతున్న పరిణామాలపై బీఆర్ఎస్ అగ్రనేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్టీ కేడర్‌ను ఇబ్బంది పెడుతున్న వ్యవహారాలపై ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు ఫిర్యాదులను స్వీకరించి, వాటిని రికార్డు చేస్తున్నారు. ఈ బాధ్యతలను పర్యవేక్షించేందుకు పార్టీ కీలక నేతలు కేటీఆర్, హరీష్‌రావుల ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగాయి. క్షేత్రస్థాయి నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, బాధితులు ఇస్తున్న ఫిర్యాదుల్లో అత్యధిక శాతం పోలీసు అధికారుల తీరుపైనే ఉండటం గమనార్హం. చట్టబద్ధంగా వ్యవహరించాల్సిన కొందరు పోలీసు అధికారులు అధికార పార్టీకి తొత్తులుగా మారి ప్రతిపక్ష నేతలను ఇబ్బంది పెడుతున్నారని బీఆర్ఎస్ నేతలు తీవ్రంగా ఆరోపిస్తున్నారు.
.webp)
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి వంతపాడుతున్న అధికారులకు బీఆర్ఎస్ హెచ్చరిస్తూ.. తాము తిరిగి అధికారపగ్గాలు చేపట్టిన తరువాత, చట్టాన్ని అతిక్రమించి తమ నాయకులను టార్గెట్ చేసిన ఏ అధికారినీ వదిలిపెట్టేది లేదని హెచ్చరిస్తోంది. పొరుగురాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం ప్రతిపక్షంలో ఉండగా అప్పటి జగన్ ప్రభుత్వ అరాచకాలు, వేధింపులు, కక్ష సాధింపులను నారా లోకేష్ రెడ్ బుక్ లో రికార్డ్ చేసిన చందంగానే ఇప్పుడు తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్ఎస్ పింక్ బుక్ ను తెరపైకి తెచ్చింది.
గతంలో తాము అధికారంలో ఉన్నప్పుడు ప్రజా సంక్షేమం, రాష్ట్ర అభివృద్ధిపైనే పూర్తి దృష్టి పెట్టామని, ప్రతికార రాజకీయాలకు ఎప్పుడూ తావు ఇవ్వలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. అయితే ప్రస్తుత రేవంత్ సర్కార్ మాత్రం కక్షపూరిత ధోరణితో వ్యవహరిస్తోందని విమర్శించారు. తమ పార్టీ శ్రేణులను ఇబ్బంది పెడుతున్న ప్రతి ఒక్కరి లెక్కా రాస్తున్నామని, భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని కేటీఆర్ హెచ్చరిస్తున్నారు.
[BRS Pink Book, Telangana Politics, KTR, Revanth Reddy Government, BRS Action Plan, elangana News, Telugu One]


