TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

గ్రేటర్ లో పట్టు కోసం వ్యూహాలు: ఖైరతాబాద్ బైపోల్ లో విజయంపై ఆశలు.!

Published on: Mon Sep 28, 2026 11:25AM

గులాబీ పార్టీకి 2023 ఎన్నికలలో వెన్నుదన్నుగా నిలిచిన గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు ఎదురుగాలి వీస్తోంది. 2023 ఎన్నికలలో బీఆర్ఎస్ కు ప్రతిపక్ష హోదా దక్కించదంటే.. అందుకు ఆ పార్టీకి గ్రేటర్ లో దక్కిన విజయాలే కారణం. అటువంటి గ్రేటర్ హైదరాబాద్ లో ఇప్పుడు ఆ పార్టీకి వరుసగా సవాళ్లు ఎదురౌతున్నాయి. దీంతీ గ్రేటర్ లో పార్టీని బలోపేతం చేసి, పూర్వవైభవాన్ని అందిపుచ్చుకునేందుకు ఆ పార్టీ మల్లగుల్లాలు పడుతోంది.

గత కొంతకాలంగా గ్రేటర్ హైదరాబాద్  రాజకీయాల్లో బీఆర్ఎస్ కు వరుస ఓటములు,   నాయకుల వలసలు  తలనొప్పిగా మారాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో పరాజయం  తర్వాత..  గ్రేటర్ లో గులాబీ పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నిరుత్సాహం, నిస్తేజం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. ఇక త్వరలో  జీహెచ్‌ఎంసీ ఎన్నికలతో పాటు ఖైరతాబాద్ ఉప ఎన్నిక కూడా జరగ నుండటంతో పార్టీ పుంజుకునేందుకు తీసుకోవలసిన చర్యలపై ఆ పార్టీలో పెద్ద ఎత్తున చర్చోపచర్చలు జరుగుతున్నాయి. వ్యూహ రచన, రాజకీయ ఎత్తుగడలపై పార్టీ అగ్రనాయకత్వం మల్లగుల్లాలు పడుతోంది. 

గ్రేటర్   పరిధిలో బీఆర్ఎస్ కు చెందిన  పలువురు  ఎమ్మెల్యేలు, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్లు కాంగ్రెస్ లోకి జంప్ చేశారు.  దానం నాగేందర్, వివేకానంద వంటి నేతల ఫిరాయింపులు పార్టీ కేడర్‌లో నిరుత్సాహాన్ని నింపాయి. వీరు పార్టీని వీడటంతో బీఆర్ఎస్ క్షేత్రస్థాయిలో బలహీనపడినదన్న విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది.  అయితే తాజాగా దానం నాగేందర్ పై సుప్రీం కోర్టు అనర్హత వేటు వేయడం బీఆర్ఎస్ కు రాజకీయంగా కాకపోయినా నైతికంగా ఒకింత బలాన్ని ఇచ్చింది.  

అదే సమయంలో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలో విజయం సాధించి సిట్టింగ్ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి జీవన్మరణ సమస్యగా పరిణమించింది. ఖైరతాబాద్ బైపోల్ లో విజయం సాధిస్తేనే.. బీఆర్ఎస్ బలహీనపడలేదు, బలం చెక్కు చెదరలేదన్న సంకేతాన్ని ప్రజలకు, పార్టీ శ్రేణులకు ఇవ్వగలుగుతుంది.  ఈ నేపథ్యంలోనే .. ప్రభుత్వ వైఫల్యాలపై గట్టిగా గళమెత్తి.. ప్రజల విశ్వాసాన్ని చూరగొనాలని బీఆర్ఎస్ ప్రణాళికలు రచిస్తోంది.   మొత్తం మీద గ్రేటర్‌పై మళ్లీ పట్టు సాధించి సత్తా చాటాలన్న పట్టుదలతో బీఆర్ఎస్ వ్యూహాలు రచిస్తోంది.  


[BRS Party, Greater Hyderabad Politics, GHMC, KTR, Khairatabad Bypoll, Telangana News, Telugu One]