బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధు అరెస్ట్.!
Published on: Tue Sep 8, 2026 8:54AM

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ ను పోలీసులు మంగళవారం (సెప్టెంబర్ 8) ఉదయం అరెస్టు చేశారు. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్‌లోని నూతన ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో ఉన్న ఆయనను పోలీసులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు. తాతా మధుతో పాటు ఆయన అరెస్టును అడ్డుకోవడానికి ప్రయత్నించిన మరో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డిని సైతం పోలీసులు అదుపులోనికి తీసుకున్నారు. తాతా మధు అరెస్టును బీఆర్ఎస్ ఖండించింది. రేవంత్ సర్కార్ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా వ్యవహరిస్తోందని విమర్శించింది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు జరుగుతున్న వేళ ఈ అరెస్టులు దారణమని పేర్కొంది. ఇలా ఉండగా అసెంబ్లీ మర్యాదను కాపాడేందుకే తాతామధును అరెస్టు చేసినట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

అదలా ఉంటే సోమవారం (సెప్టెంబర్ 7) అసెంబ్లీ గేట్ల వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల మధ్య జరిగిన తోపులాట సందర్భంగా తాతా మధు స్పీకర్ గడ్డం ప్రసాద్ ను ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. దీనిపై సీరియస్ గా స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి స్పీకర్ ను ఉద్దేశించి ఎమ్మెల్సీ తాతామధు వాడిన భాష శాసనసభ గౌరవానికి, తెలంగాణ ఆత్మగౌరవానికి జరిగిన అవమానమని పేర్కొన్నారు. కాగా తాతా మధును శాసనమండలి నుంచి తక్షణమే బర్తరఫ్ చేయాలని మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ముఖ్యమంత్రిని కోరారు.
అయితే.. తాను స్పీకర్ ను ఉద్దేశించి అనుచితంగా మాట్లాడానంటూ వచ్చిన ఆరోపణలను తాతా మధు ఖండించారు. తాను స్పీకర్‌ను ఉద్దేశించి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని, తన మాటలను అధికార కాంగ్రెస్ పార్టీ వక్రీకరిస్తోందని ఆరోపించారు. ఒకవేళ తన వ్యాఖ్యలు స్పీకర్‌ను కించపరిచినట్లు భావిస్తే, అందుకు విచారం వ్యక్తం చేస్తూ వాటిని వెనక్కి తీసుకుంటున్నానన్నారు.
[BRS MLC Tata Madhusudhan arrest, Hyderabad police, Telangana assembly speaker, BRS leaders detention, Telangana Politics, Telugu One]


