TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

మోడీ దౌత్య విజయం.. ఉక్రెయిన్ సంక్షోభం పరిష్కారానికి ప్రతిపాదనలు.. స్వాగతించిన పుతిన్.!

Published on: Tue Sep 15, 2026 7:48AM

న్యూఢిల్లీ వేదికగా  ముగిసిన 18వ బ్రిక్స్ సమ్మిట్,  అంతర్జాతీయ రాజకీయాల్లో సరికొత్త చర్చకు తెరలేపింది. ప్రపంచ దేశాలను తీవ్రంగా కలవరపెడుతున్న రష్యా, ఉక్రెయిన్ యుద్ధ సంక్షోభానికి తెరదించే దిశగా ఇండియా, చైనాలు   ముందడుగు వేశారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న దౌత్య ప్రతిష్టంభనను తొలగించేందుకు తాము గుడ్ ఆఫీసెస్ అందించడానికి సిద్ధంగా ఉన్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో స్పష్టం చేశారు. ఈ పరిణామం ప్రపంచ దేశాల దృష్టిని   ఆకర్షిస్తోంది.  ఈ కీలక పరిణామానికి సంబంధించి క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అధికారికంగా వివరాలను వెల్లడించారు. 

 ప్రధాని నరేంద్ర మోడీ,  చైనా అధినేత జీ జిన్‌పింగ్ చేసిన ఈ శాంతి ప్రతిపాదనను రష్యా అధినేత వ్లాదిమిర్ పుతిన్   స్వాగతించారని, ప్రస్తుత యుద్ధ పరిస్థితిని వారికి వివరించారని  స్పష్టం చేశారు. గత ఐదేళ్లుగా కొనసాగుతున్న ఈ  పోరును ముగించేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన దౌత్య ప్రయత్నాలు తాత్కాలికంగా స్తంభించిపోయిన తరుణంలో..  ఇండియా, చైనా వంటి బలమైన గ్లోబల్ సౌత్ శక్తులు ముందుకు రావడం అంతర్జాతీయ రాజకీయాల్లో  ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ సమ్మిట్ సందర్భంగా కేవలం ఉక్రెయిన్ అంశమే కాకుండా, పశ్చిమాసియాలో దశాబ్దాలుగా ఉన్న ఉద్రిక్తతలపై కూడా ఇండియా తన దౌత్య నైపుణ్యాన్ని చాటుకుంది. దశాబ్దాలుగా తీవ్ర శత్రువులుగా ఉన్న ఇరాన్, యుఏఈ  దేశాల నాయకులను ఒకే టేబుల్ వద్దకు రప్పించి, వారి మధ్య అరుదైన ఒప్పందం కుదిరేలా చేయడంలో ఇండియా సక్సెస్ అయ్యింది. 

ఇరు దేశాల మధ్య ఉన్న భేదాలను పక్కనపెట్టి గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తు వైపు చూడాలని ఒప్పించడంలో భారత నాయకత్వం చూపిన చొరవ ప్రశంసనీయమైనది. రాత్రి సమయంలో సుమారు నాలుగు గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల ఫలితంగా  న్యూఢిల్లీ డిక్లరేషన్ 2026  ఏకగ్రీవ ఆమోదం పొందింది.  అయితే, బ్రిక్స్ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ పేరు ప్రత్యక్షంగా లేనప్పటికీ, కేవలం  డైలాగ్, డిప్లమసీ  (చర్చలు, దౌత్యం) అనే ప్రాథమిక సూత్రం మాత్రమే చోటుచేసుకుంది. ఇది ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు అద్దం పట్టేలా వాస్తవిక దృక్పథంతో కూడిన నిర్ణయంగా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  రష్యా, ఉక్రెయిన్ మధ్య 2022 ఫిబ్రవరిలో పూర్తి స్థాయి సైనిక దాడి ప్రారంభమైన నాటి నుంచి భారత్  సంయమనంతో కూడిన స్పష్టమైన వైఖరిని అవలంబిస్తూ వస్తోంది. 

ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రవేశపెట్టిన పలు తీర్మానాల విషయంలో భారత్ తటస్థ వైఖరిని ప్రదర్శించినప్పటికీ, శాంతి స్థాపన కోసం ఎప్పుడూ వెనుకాడలేదు. 2022లో ఉజ్బెకిస్తాన్‌లోని సమర్కండ్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ముఖాముఖి భేటీ అయిన సందర్భంలో ప్రధాని మోడీ  ఇది యుద్ధ కాలం కాదు  అని కుండబద్దలు కొట్టినట్లు స్పష్టం చేశారు. ఆ తర్వాత 2024 సంవత్సరంలో మాస్కోతో పాటు ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో  స్వయంగా పర్యటించిన మోడీ.. తాము ఏ ఒక్క పక్షానికో పరిమితం కాకుండా  శాంతి పక్షం వహిస్తామని ప్రపంచానికి చాటిచెప్పారు. చారిత్రకంగా చూస్తే..  గతంలో కొరియా యుద్ధ సమయంలోనూ భారత్ న్యూట్రల్ నేషన్స్ రిపాట్రియేషన్ కమిషన్ నిర్వహించి శాంతి స్థాపనలో కీలక బాధ్యతలు నిర్వర్తించింది.  

మరోవైపు, చైనా కూడా 2023లో 12-పాయింట్లతో కూడిన సోంత శాంతి ప్రణాళిక  ప్రకటించింది. దేశాల సార్వభౌమత్వాన్ని గౌరవించడం, ప్రచ్ఛన్న యుద్ధం వీడడం, తక్షణమే యుద్ధాన్ని నిలిపివేయడం,  చర్చలను పునరుద్ధరించడం వంటి అంశాలను ఆ ప్రణాళికలో పొందుపరిచారు. అయితే.. ఆ ప్రతిపాదనలను పాశ్చాత్య దేశాలు,  ఉక్రెయిన్ పూర్తిగా అంగీకరించలేదు. ఇటువంటి క్లిష్టమైన నేపథ్యంలో భారత్ ఎలాంటి ఏకపక్ష ప్రతిపాదనలను బలపరచకుండా, ఒక నిష్పాక్షికమైన సమన్వయకర్త పాత్రకే పరిమితమైంది. రష్యా నుంచి చౌకగా క్రూడాయిల్ దిగుమతులను కొనసాగిస్తూనే, ఉక్రెయిన్‌కు అవసరమైన మానవతా సహాయాన్ని అందజేస్తూ రెండు దేశాలతోనూ సత్సంబంధాలను సక్సెస్ ఫుల్ గా నిలుపుకుంటూ వస్తోంది.  ఈ దౌత్య ప్రయాణంలో భాగంగా అనేక మైలురాళ్లు దాటుకుంటూ ప్రస్తుత స్థితికి చేరుకుంది. 2022లో మోడీ చేసిన హెచ్చరికలు, 2023 నాటి చైనా శాంతి ప్రణాళిక, 2024 నాటి మోడీ మాస్కో,  కీవ్ పర్యటనలు ఈ సంక్షోభ పరిష్కారానికి పునాది వేసాయి. ఆ తర్వాత 2026 ఆగస్టు 31న బిష్కెక్ నగరంలో జరిగిన ఎస్సీఓ  సమ్మిట్ సమావేశంలో ప్రధాని మోడీ మరోసారి పుతిన్‌ను కలుసుకుని, ఈ   యుద్ధాన్ని ముగించి శాంతి మార్గాన్ని ఎంచుకోవాలని గట్టిగా కోరారు. ఆ వరుసలోనే సెప్టెంబర్ 3వ తేదీన భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ కీవ్ లో పర్యటించి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో   కీలకమైన చర్చలు జరిపారు. తదనంతరం సెప్టెంబర్ 11 నుంచి 13 వరకు జరిగిన న్యూఢిల్లీ బ్రిక్స్ సమ్మిట్‌లో మోడీ, పుతిన్,  మధ్య జరిగిన ప్రత్యేక భేటీలు ఈ దౌత్య ప్రయత్నాలను పతాక స్థాయికి చేర్చాయి.  అంతర్జాతీయ చట్టాల ప్రకారం చూస్తే, ఏ దేశమైనా   యుద్ధంలో ఉన్న రెండు దేశాల మధ్య శాంతి స్థాపన కోసం మధ్యవర్తిత్వం వహించడం ఎటువంటి చట్టపరమైన నిబంధనలకు విరుద్ధం కాదు. 

ఐక్యరాజ్యసమితి చార్టర్ సూత్రాల ప్రకారం ప్రపంచ శాంతిని పరిరక్షించడం, చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునేలా ప్రోత్సహించడం ప్రతి దేశం  ప్రాథమిక బాధ్యత. భారత్, చైనా అందిస్తున్న ఈ గుడ్ ఆఫీసెస్  సేవలు కేవలం ఇరువర్గాలకు ఒక తటస్థ వేదికను కల్పించడం, రాయబార సందేశాలను మార్పిడి చేయడం కోసమే ఉపయోగపడతాయి. అయితే, ఈ ప్రయత్నాల తుది విజయం పూర్తిగా రష్యా, ఉక్రెయిన్ దేశాల సంకల్పంపైనే ఆధారపడి ఉంటుంది. ఉక్రెయిన్ భూభాగ సమగ్రతను కాపాడుకోవడం,  రష్యా తన భద్రతాపరమైన ఆందోళనలను తొలగించుకోవడం అనే రెండు భిన్నమైన ధృవాలు ఇంకా ఏకతాటిపైకి రాలేదు. అందుకే బ్రిక్స్ డిక్లరేషన్‌లో ఉక్రెయిన్ ప్రస్తావన లేకుండా కేవలం దౌత్య చర్చలకే పెద్దపీట వేయడం రాజకీయ వాస్తవికతకు నిదర్శనంగా నిలిచింది.  ప్రస్తుత భౌగోళిక రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే..  భారత్ తనదైన వ్యూహాత్మక స్వతంత్రతను స్పష్టంగా ప్రదర్శిస్తోందని అర్ధం అవుతుంది. 

రష్యాతో చారిత్రక వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూనే, అమెరికా, పశ్చిమ దేశాలతోనూ బలమైన సంబంధాలను కాపాడుకుంటూ గ్లోబల్ సౌత్ దేశాల గొంతుకను గట్టిగా వినిపిస్తోంది. మరోవైపు చైనా తన అంతర్జాతీయ ప్రభావాన్ని మరింత విస్తరించుకోవడానికి ప్రయత్నిస్తుండగా, రష్యా మాత్రం పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆధిపత్యం, ఆంక్షల నుంచి బయటపడేందుకు ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన మధ్యవర్తిత్వ యత్నాలు ఆశించిన ఫలితాలను ఇవ్వని తరుణంలో.. ఇండియా, చైనాల ఈ ఉమ్మడి ఆఫర్ అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.  ఈ పరిణామాలపై అంతర్జాతీయ మీడియాలో పలు విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఒక వర్గం మీడియా భారత్‌ను సమర్థవంతమైన శాంతి దూతగా అభివర్ణిస్తుండగా..  మరొక వర్గం మాత్రం ఇది పూర్తిగా రష్యాకు అనుకూలంగా సాగుతున్న దౌత్యమని విమర్శిస్తున్నాయి. 

అయితే  వాస్తవం ఈ రెండింటికి మధ్యలో ఉంది. భారత్ తన దేశ అవసరాల కోసం రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను కొనసాగిస్తూనే.. మరోవైపు ఉక్రెయిన్‌తో నిరంతరం సంభాషణలు జరుపుతూ సమతుల్యతను పాటిస్తోంది. ఇది పూర్తిగా జాతీయ ప్రయోజనాల ఆధారిత విధానమని నిపుణులు పేర్కొంటున్నారు. శాంతి కోసం నిజాయితీగా ప్రయత్నిస్తూనే, దేశ ఆర్థిక,  వ్యూహాత్మక ప్రయోజనాలను కాపాడుకోవడం ద్వారా భారత్ తన దౌత్య పరిణతిని చాటుకుంటోంది.  ఈ తాజా దౌత్య పరిణామాలు రాత్రికి రాత్రే యుద్ధాన్ని పూర్తిగా ఆపలేకపోయినప్పటికీ, దెబ్బతిన్న చర్చల మార్గాన్ని పునరుద్ధరించడానికి ఒక సరికొత్త మార్గాన్ని తెరిచాయని చెప్పవచ్చు. ప్రపంచ దేశాలన్నింటితోనూ ఒకేలా సత్సంబంధాలు కలిగి ఉన్న ఏకైక శక్తిగా భారత్ నిలవడం వల్లనే రష్యా, చైనా, అమెరికా, యూరప్, ఉక్రెయిన్‌లతో మాట్లాడే సామర్థ్యం లభించింది. ఇది పాశ్చాత్య దేశాల ఏకచ్ఛత్రాధిపత్యం నుంచి గ్లోబల్ సౌత్ దేశాలు స్వతంత్రంగా ఎదగగలవని నిరూపిస్తోంది.

అయితే, రష్యా దండయాత్రను పూర్తిగా,  బహిరంగంగా ఖండించకపోవడం, నిరంతరం చౌక చమురును దిగుమతి చేసుకోవడం వంటి అంశాలపై కొన్ని నైతిక విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. దీనికి భారత్ తరఫు నుంచి స్పష్టమైన వాదన వినిపిస్తోంది; ఈ యుద్ధం వల్ల తలెత్తిన తీవ్ర ఆర్థిక ప్రభావాలు అభివృద్ధి చెందుతున్న దేశాల మీదే ఎక్కువగా పడుతున్నాయని, ముఖ్యంగా ఇంధన ధరలు,  ఆహార భద్రత  దెబ్బతిన్నాయని భారత్ గట్టిగా వాదిస్తోంది.  ప్రజా చర్చల్లోనూ దీనిపై భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు దేశ ప్రజలు  భారత్ ప్రపంచ శాంతి కోసం పాటుపడుతున్న నిజమైన నేత  అని ప్రశంసిస్తుంటే, మరోవర్గం మాత్రం ఇది పక్షపాత ధోరణితో కూడిన రియల్‌పాలిటిక్ విధానమని చర్చిస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ,   యుద్ధం వద్దు, శాంతి ముగింపు ముఖ్యం  అనే విధానంతో భారత్ ముందుకు వెళ్తోంది. మొత్తానికి న్యూఢిల్లీలో జరిగిన   బ్రిక్స్ సమ్మిట్ భారత్‌కు ఒక అపూర్వమైన దౌత్య విజయంగా నిలిచింది. దశాబ్దాల శత్రువులను ఒకే వేదికపైకి తీసుకురావడంలోనూ, ఉక్రెయిన్ సమస్యపై స్పష్టమైన దిశను నిర్దేశించడంలోనూ మోడీ, జీ జిన్‌పింగ్  ఆఫర్ ప్రపంచానికి ఒక కొత్త ఆశను రేకెత్తించింది. ఈ యుద్ధం ముగియాలంటే ఉభయ దేశాలు రాజీకి రావాల్సిందేనని, ఆ దిశగా భారత్, చైనాలు తమ వంతు సహాయాన్ని అందించడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశాయి. ఇప్పుడు అందరి దృష్టి ఈ దౌత్యపరమైన అడుగులు కేవలం మాటలకే పరిమితమవుతాయా, లేక నిజమైన శాంతికి బాటలు వేస్తాయా అనే దానిపైనే నిలిచింది. 

-సీతారాం కంఠంనేని 

ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com  పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.    

 [BRICS Summit 2026, Narendra Modi Ukraine peace efforts,Vladimir Putin,  Russia Ukraine war, New Delhi Declaration, India diplomatic mediation]