బ్రిక్స్ సదస్సుతో బహుళ ప్రయోజనాలు

 

బ్రిక్స్ దేశాల కార్యాచరణ ఇప్పుడు కాస్త వేగం పుంజుకుంది. మొదట బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలతో మాత్రమే ఏర్పడిన కూటమి దక్షిణాఫ్రికా చేరాక బ్రిక్స్‌గా రూపాంతరం చెందింది. ప్రపంచ ఆర్థిక వ్యవహారాలలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ (ఐఎంఎఫ్), ప్రపంచ బ్యాంకుల పెత్తందారీతనం పెరిగింది. అవి అప్రజాస్వామికంగా తయారయ్యాయన్న ఆరోపణలు తీవ్రంగా వినిపిస్తున్నాయి. ఈ దశలో ఇలాంటి ప్రాంతీయ కూటముల అవసరం చాలా వుంది. డాలర్‌ను మాత్రమే అంతర్జాతీయ చలామణికి అర్హత వున్న కరెన్సీలా భావించే ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు తీరు, అంతర్జా తీయ మార్కెట్‌లను నియంత్రించలేని వాటి నిస్సహాయత కారణంగా ఆర్థిక సంక్షో భాలు తలెత్తుతున్నాయి. బ్రిక్స్ తొలి శిఖరాగ్ర సదస్సునాటికే వచ్చిపడిన ఆర్ధికమాంద్యంలో ఈ కూటమి దేశాలు వ్యవహరించిన తీరు ఆ మాంద్యం తీవ్రతను చాలా తగ్గించిందనే చెప్పాలి. ఇందుకు అప్పటికే జీ-20వంటి వేదికల్లో ఈ కూటమి దేశాలు పనిచేయడం చాలా అక్కరకొచ్చింది. బ్రిక్స్ దేశాల ఐక్యత వల్ల ఐఎంఎఫ్, ప్రపంచ బ్యాంకు గుత్తాధిపత్యానికి కళ్ళెం పడే అవకాశం వుంది.