విదేశీ వస్త్ర బహిష్కరణకు నాంది వీర్ సావర్కర్.!
Published on: Thu Sep 10, 2026 12:50PM

భారత స్వాతంత్య్రోద్యమ చరిత్రను పరిశీలిస్తే విదేశీ వస్త్రాల బహిష్కరణ అనగానే మహాత్మా గాంధీ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. అయితే.. బ్రిటిష్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా విదేశీ వస్త్రాలను బహిరంగంగా దహనం చేసే సంప్రదాయానికి గాంధీజీ కంటే పదహారేళ్ల ముందే తెరలేపింది మాత్రం వీర్ సావర్కర్. లార్డ్ కర్జన్ చేపట్టిన బెంగాల్ విభజన నిర్ణయానికి వ్యతిరేకంగా పూణేలోని ఫెర్గూసన్ కాలేజీ విద్యార్థిగా ఉన్న సావర్కర్ ఈ విదేశీ వస్తు బహిష్కరణకు నాంది పలికారు. బ్రిటిష్ ఇంటెలిజెన్స్ రికార్డులు, సమకాలీన పత్రికల ఆధారాల ప్రకారం దేశంలో సావర్కారే చేసినదే మొట్టమొదటి విదేశీ వస్తువుల బాన్‌ఫైర్ అయినప్పటికీ, ప్రధాన స్రవంతి చరిత్ర మాత్రం ఈ కోణాన్ని పెద్దగా వెలుగులోకి తీసుకురాలేదు. చరిత్రలో ఈ ఘట్టానికి బలమైన నేపథ్యం ఉంది. అప్పటి వైస్రాయ్ లార్డ్ కర్జన్ పరిపాలనా సౌలభ్యం ముసుగులో 1905 జూలై 19న బెంగాల్ విభజనను అధికారికంగా ప్రకటించారు. ఈ నిర్ణయం వెనుక దేశంలోని జాతీయవాద స్ఫూర్తిని దెబ్బతీయాలనే కుట్ర దాగి ఉందని గ్రహించిన స్వదేశీ నేతలు ఆగస్టు 7న కలకత్తా టౌన్ హాల్‌లో జరిగిన సమావేశంలో బహిష్కరణ తీర్మానాన్ని ఆమోదించారు.

ఈ పరిణామాల నేపథ్యంలో పూణే వేదికగా విప్లవ భావాలు కలిగిన ఇరవై ఏళ్ల వినాయక్ దామోదర్ సావర్కర్ క్రియాశీలక పాత్ర పోషించారు. బాల గంగాధర్ తిలక్ మార్గదర్శకత్వంలో అభినవ్ భారత్ వంటి రహస్య సంస్థలను స్థాపించిన సావర్కర్, విదేశీ వస్త్రాలను బహిరంగంగా అగ్నికి ఆహుతి చేయాలని నిర్ణయించారు. ఈ ఉద్యమం ఊపందుకునే క్రమంలో పలు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. 1905 ఆగస్టు 27న పూణేలో వేలాది మంది విద్యార్థులతో సమావేశం నిర్వహించి, తిలక్ సమక్షంలో సావర్కర్ ప్రసంగించారు. ఆ తర్వాత అక్టోబర్ మొదటి వారంలో జరిగిన సభల్లో విదేశీ వస్త్రాలను పేదలకు పంపిణీ చేయడం కంటే బహిరంగంగా తగలబెట్టడం వల్లనే నైతిక ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఆయన బలంగా వాదించారు. చివరకు 1905 అక్టోబర్ లో విజయదశమి పర్వదినాన పూణేలోని లక్డీ పూల్ వద్ద భారీ జనసమూహం మధ్య విదేశీ వస్త్రాల తొలి బహిరంగ దహన కార్యక్రమం విజయవంతంగా నిర్వహించబడింది. ఈ నిరసన ప్రదర్శనలో నాయకులు విదేశీ కోట్లను తొలగించి వాటి జేబులను వెలుపలకు తిప్పి చూపడం ద్వారా బ్రిటిష్ పాలన దేశ సంపదను ఎలా దోచుకుంటున్నదో ప్రజలకు ప్రతీకాత్మకంగా వివరించారు. ఈ చారిత్రక ఘటన అనంతర పరిణామాలు కూడా తీవ్రంగానే ఉన్నాయి.
ఫెర్గూసన్ కాలేజీ ప్రిన్సిపాల్ ఆర్.పి. పరంజపే ఈ నిరసనలో పాల్గొన్నందుకు సావర్కర్‌ను హాస్టల్ నుంచి తొలగించి పది రూపాయల జరిమానా విధించారు. బ్రిటిష్ రహస్య పోలీసు రికార్డులలో సావర్కర్‌ను ఒక తీవ్రమైన వక్తగా అభివర్ణించడంతో పాటు, ఆయనపై నిఘా ఉంచాలని జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాలు జారీ చేశారు. అయితే కాలేజీ అధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నప్పటికీ, తోటి విద్యార్థుల సహకారంతో జరిమానా చెల్లించి సావర్కర్ తన చదువును కొనసాగించారు. ఆ తర్వాత కాలంలో ఇదే స్పూర్తితో ఆయన లండన్‌కు వెళ్లి విప్లవ కార్యకలాపాలను మరింత విస్తృతం చేశారు. మహాత్మా గాంధీ ప్రవేశంతో ఈ ఉద్యమ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి.
1921 నాటి సహాయ నిరాకరణ ఉద్యమంలో భాగంగా గాంధీజీ విదేశీ వస్త్ర బహిష్కరణను కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేయకుండా దేశవ్యాప్తంగా ఉన్న కోట్ల మంది ప్రజలకు చేరువయ్యేలా ఒక జన ఉద్యమంగా మలిచారు. బాంబే వంటి ప్రధాన నగరాల్లో స్వయంగా గాంధీజీ భారీ బాన్‌ఫైర్‌లను ప్రారంభించడంతో విదేశీ వస్త్రాల దిగుమతులు గణనీయంగా పడిపోయాయి. సావర్కర్ ప్రారంభించిన ఈ పద్ధతిని గాంధీజీ విస్తృత స్థాయిలో సత్యాగ్రహ సిద్ధాంతాలకు అనుగుణంగా అహింసా మార్గంలో ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు తీసుకెళ్లారు.
స్వాతంత్య్రానంతర కాలంలో చరిత్ర రచనలో జరిగిన మార్పుల కారణంగా సావర్కర్ చేసిన తొలి ప్రయత్నాలు వెనుకకు వెళ్లాయని చెప్పవచ్చు. ఆయన తర్వాతి కాలంలో హిందూ మహాసభ వైపు అడుగులు వేయడం, హిందుత్వ సిద్ధాంతకర్తగా మారడం వంటి పరిణామాలు ప్రధాన స్రవంతి చరిత్ర ఆయన తొలి నాళ్ల విప్లవ పోరాటాలను విస్మరించడానికి ఒక కారణమయ్యాయి. అయినప్పటికీ, ఒక చారిత్రక సత్యాన్ని పరిశీలిస్తే విదేశీ వస్త్ర బహిష్కరణకు మొదటిసారిగా బాన్‌ఫైర్ రూపంలో ఆచరణాత్మక రూపం ఇచ్చింది సావర్కర్ అయితే, దానిని దేశవ్యాప్తంగా అహింసా యుతంగా సర్వజనీన స్థాయికి తీసుకెళ్లిన మహానేత మాత్రం మహాత్మా గాంధీ. ఈ ఇద్దరు నాయకులు వేర్వేరు కాలాల్లో, భిన్నమైన రాజకీయ తత్వాలతో ఉద్యమానికి తమ వంతు పాత్ర పోషించారనే వాస్తవాన్ని గుర్తించడమే సరైన చారిత్రక దృక్పథం అవుతుంది.
-సీతారాం కంఠంనేని
ఈ విశ్లేషణ మీకు నచ్చినట్లయితే, దయచేసి మా https://TeluguOne.com పోర్టల్‌ను అనుసరించండి, మీ స్నేహితులతో పంచుకోండి, అలాగే మీ విలువైన అభిప్రాయాలను తెలియజేయండి.
[Boycott of foreign cloth, Veer Savarkar, Mahatma Gandhi, Swadeshi movement, Telugu One]


