కోడలు గెలిచింది..కుమార్తె ఓడింది..బొత్స కుటుంబానికి మిశ్రమ ఫలితాలు.!
Published on: Sun Nov 8, 2026 11:46AM

విజయనగరం జిల్లాలో బొత్స కుటుంబ హవా.!
ఆంధ్రప్రదేశ్‌లో జరిగిన పరిషత్ ఎన్నికల ఫలితాలు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు తెరలేపాయి. ముఖ్యంగా బొత్స సత్యనారాయణ కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థులు ఎన్నికల బరిలో నిలవడం.. కొందరు విజయం సాధించగా, మరికొందరు ఓటమి పాలవడంతో జిల్లా రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి.
గరివిడి జడ్పీటీసీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కోడలు బొత్స పూజిత విజయం సాధించారు. ఆమెకు ప్రత్యర్థిగా చీపురుపల్లి టీడీపీ ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు సంధ్య బరిలో నిలిచారు. ఇద్దరూ రాజకీయంగా ప్రముఖ కుటుంబాలకు చెందినవారు కావడంతో ఈ ఎన్నికపై మొదటి నుంచీ ఆసక్తి నెలకొంది. చివరకు ఈ పోరులో పూజిత తన సమీప ప్రత్యర్థి సంధ్యపై 1,599 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
ఇదే జిల్లాలోని గుర్ల జడ్పీటీసీ స్థానంలోనూ వైఎస్సార్సీపీ అభ్యర్థి, బొత్స సత్యనారాయణ సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి విజయం సాధించారు. దీంతో బొత్స కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళా అభ్యర్థులు జడ్పీటీసీ ఎన్నికల్లో గెలుపొందినట్లయింది.
అయితే, బొత్స కుటుంబానికి మరోవైపు ఎదురుదెబ్బ కూడా తగిలింది. బొండపల్లి జడ్పీటీసీ స్థానంలో టీడీపీ అభ్యర్థి పాశల నీరజ విజయం సాధించారు. వైఎస్సార్సీపీ తరఫున పోటీ చేసిన బొత్స సత్యనారాయణ కుమార్తె అనూష ఓటమి పాలయ్యారు. నీరజ.. అనూషపై 5,136 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. జిల్లా పరిషత్ చైర్పర్సన్ రేసులో ఉన్న అనూష పరాజయం వైఎస్సార్సీపీ శ్రేణులకు నిరాశ కలిగించింది.
మరో ఆసక్తికర పరిణామం ఏమిటంటే.. స్థానిక ఎన్నికలకు ముందు టీడీపీలో చేరిన బొత్స మేనల్లుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) కుమార్తె సిరి సహస్ర తెర్లాం జడ్పీటీసీ స్థానం నుంచి విజయం సాధించారు. దీంతో బొత్స కుటుంబానికి చెందినవారి గెలుపోటములతో పాటు, కుటుంబానికి రాజకీయంగా దగ్గరి సంబంధాలున్న వారి విజయాలు కూడా చర్చనీయాంశంగా మారాయి.

వాస్తవానికి ఈ ఎన్నికల్లో బొత్స కుటుంబం నుంచి నలుగురు జడ్పీటీసీ స్థానాలకు పోటీ చేయాలని ప్రయత్నించారు. పూసపాటిరేగ నుంచి బొత్స సోదరుడి కుమారుడు చైతన్య నామినేషన్ దాఖలు చేయగా, అది తిరస్కరణకు గురైంది. బొండపల్లి నుంచి కుమార్తె అనూష, గరివిడి నుంచి కోడలు పూజిత, గుర్ల నుంచి సోదరి వెంకటలక్ష్మి ఎన్నికల బరిలో నిలిచారు.
ఈ క్రమంలో గరివిడి, గుర్లలో విజయాలు.. బొండపల్లిలో ఓటమి.. మరోవైపు తెర్లాంలో మజ్జి శ్రీనివాసరావు కుమార్తె గెలుపు విజయనగరం జిల్లా రాజకీయాల్లో ప్రత్యేక చర్చకు కారణమయ్యాయి. ఒకే కుటుంబానికి చెందిన పలువురు అభ్యర్థుల ఎన్నికల ఫలితాలు స్థానిక రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా మారాయి.
ఇది కూడా చదవండి: సీఎం రేవంత్‌రెడ్డికి ప్రముఖుల జన్మదిన శుభాకాంక్షలు..ప్రత్యేక లేఖ రాసిన ప్రధాని మోదీ.!
[ Botsa Satyanarayana, Botsa Poojitha, Botsa Anusha, Sangamreddy Venkatalakshmi, Majji Srinivasa Rao, Siri Sahasra, Vizianagaram ZPTC Elections, Garividi ZPTC, Bondapalli ZPTC, Gurla ZPTC, TDP, YSRCP, AP Local Body Elections ]


