TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

నమ్మకమే ప్రాణం తీసిందా.. చిన్నారి హత్యపై భగ్గుమన్న కమ్యూనిటీ.. న్యాయం కోసం పోరాటం..!

Published on: Mon Oct 12, 2026 3:21PM

సికింద్రాబాద్‌లోని బొల్లారం చిన్నారి మోజెస్ అరెలియా కిడ్నాప్, హత్య ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఐదేళ్ల చిన్నారిని అపహరించి హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న సెక్యూరిటీ గార్డు విక్రమ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. అయితే, చిన్నారి కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు కఠిన శిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ కమ్యూనిటీ సభ్యులు ఆందోళనకు దిగారు. సికింద్రాబాద్‌లోని పోలీస్ కమిషనర్ కార్యాలయానికి చేరుకున్న వారు తమ నిరసనను వ్యక్తం చేశారు.

చిన్నారుల భద్రత కోసం సెక్యూరిటీ గార్డులను నియమించుకుంటే.. అలాంటి వ్యక్తే కిడ్నాప్, హత్యకు పాల్పడటం తమను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసిందని కమ్యూనిటీ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. భద్రత కల్పించాల్సిన వ్యక్తులే ఇలాంటి నేరాలకు పాల్పడితే చిన్నారుల రక్షణ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మరోవైపు, ఈ కేసుకు సంబంధించిన వివరాలను మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి వెల్లడించారు. కౌకూర్‌లోని ఆర్కిడ్ కమ్యూనిటీలో శనివారం ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలిపారు. రూ.20 లక్షల డబ్బు కోసం ఐదేళ్ల మోజెస్ అరెలియాను కిడ్నాప్ చేసి హత్య చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పేర్కొన్నారు. చిన్నారి కాళ్లు, చేతులు కట్టేసి నీటి సంపులో పడేసినట్లు పోలీసులు గుర్తించారని తెలిపారు.

ఈ కేసులో బిహార్‌కు చెందిన విక్రమ్‌ను ప్రధాన నిందితుడిగా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీపీ వెల్లడించారు. నిందితుడు అదే కమ్యూనిటీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసేవాడని, ఇటీవల విల్లా నిర్వాహకులు అతడిని ఉద్యోగం నుంచి తొలగించారని వివరించారు. అయితే, ఈ ఘటనలో ప్రధాన నిందితుడితో పాటు మరో ఇద్దరు సెక్యూరిటీ సిబ్బంది పాత్ర కూడా ఉన్నట్లు దర్యాప్తులో వెల్లడైందని తెలిపారు.

చిన్నారిని కోల్పోయిన కుటుంబానికి న్యాయం చేయాలని, నిందితులకు త్వరగా శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని కమ్యూనిటీ సభ్యులు కోరుతున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చిన్నారుల రక్షణకు మరింత కఠినమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చిన్నారి పేరుతో ప్రత్యేక చట్టం తీసుకురావాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

చిన్నారుల భద్రతపై తీవ్ర ఆందోళన కలిగించిన ఈ ఘటనలో పూర్తి వాస్తవాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. బాధ్యులందరికీ చట్టప్రకారం శిక్ష పడేలా చూస్తామని పోలీసులు హామీ ఇచ్చినట్లు సమాచారం.

 

 

 

[ Bollaram Child Murder Case, Moses Aurelia, Secunderabad Crime News, Malkajgiri CP Sumathi, Vikram Arrest, Child Kidnapping Case, ₹20 Lakh Kidnap Motive, Bollaram Protest, Security Guard Arrest, Koukur Orchid Community, Child Safety, Hyderabad Crime ]