TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

4 నెలల ముందే స్కెచ్: ఆర్మీ ఆయుధాల చోరీలో సంచలన విషయాలు..!

Published on: Tue Sep 22, 2026 8:29PM

బొల్లారం ఆర్మీ ఆయుధాల చోరీ కేసులో దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు మల్లేష్‌ను పోలీసులు చంచల్‌గూడ జైలు నుంచి కస్టడీలోకి తీసుకున్నారు. మల్లేష్‌ను 10 రోజులపాటు పోలీసు కస్టడీకి అప్పగిస్తూ కోర్టు అనుమతించింది. దీంతో ఆయుధాల చోరీకి సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. కస్టడీ విచారణలో ఆయుధాల చోరీకి సంబంధించి పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. చోరీకి సుమారు నాలుగు నెలల ముందే మల్లేష్‌ పథకం రూపొందించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు సమాచారం. ఆదివారం రోజునే చోరీ చేయాలని అతడు ముందుగానే నిర్ణయించుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆదివారం గార్డ్‌ ఇన్‌చార్జ్‌లు, ఆర్మీ అధికారుల కదలికలు తక్కువగా ఉంటాయని భావించి ఆ రోజును ఎంచుకున్నట్లు తెలుస్తోంది.

ఆయుధాలను చోరీ చేసిన అనంతరం వాటిని విక్రయించేందుకు మల్లేష్‌ ప్రయత్నించినట్లు దర్యాప్తులో గుర్తించినట్లు పోలీసులు తెలిపారు. ఆయుధాలు కొనుగోలు చేయాలనుకునే వ్యక్తుల కోసం సోషల్‌ మీడియాలో అతడు వెతికినట్లు సమాచారం. ఆయుధాలను విక్రయించడం ద్వారా తన ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలని భావించినట్లు పోలీసులు చెబుతున్నారు. మరోవైపు, ఆర్మీలో తనకు మూడేళ్ల సర్వీస్‌ మిగిలి ఉన్నప్పటికీ తొలగించడంతో మల్లేష్‌ అధికారులపై కక్ష పెంచుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. బెటాలియన్‌ నుంచి ఆయుధాలను చోరీ చేసి ఆర్మీ అధికారుల ప్రతిష్టను దెబ్బతీయాలనే ఉద్దేశం కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

మల్లేష్‌ సుమారు 16 ఏళ్లపాటు మద్రాస్‌ రెజిమెంట్‌లో పనిచేసినట్లు తెలుస్తోంది. ఆర్మీలో పనిచేసిన అనుభవంతోనే ఆయుధాల చోరీకి పక్కా స్కెచ్‌ రూపొందించినట్లు దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు. అయితే, ఆర్మీలో పనిచేస్తున్న తన స్నేహితులతో మల్లేష్‌ తరచూ ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఇన్‌చార్జ్‌ నాయక్‌ వినోద్‌, మ్యాగజైన్‌ ఇన్‌చార్జ్‌ బల్లి మధు, గార్డ్‌ ఇన్‌చార్జ్‌ హవాల్దార్‌ కేవీ రమణ, క్వార్టర్‌ గార్డ్‌ ఇన్‌చార్జ్‌ నిరేష్‌తో అతడు మాట్లాడినట్లు సమాచారం.ఈ క్రమంలోనే సీసీ కెమెరాలను ఎప్పుడు ఆఫ్‌ చేస్తున్నారనే విషయంపై మల్లేష్‌ ఆరా తీసినట్లు దర్యాప్తులో వెలుగులోకి వచ్చినట్లు పోలీసులు చెబుతున్నారు. సీసీ కెమెరాలు పనిచేయని సమయాన్ని తెలుసుకున్న తర్వాతే చోరీకి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.

చోరీ చేసిన భారీ మొత్తంలో ఆయుధాలను అక్కడి నుంచి తరలించి తన స్వగ్రామంలోని ఇంట్లో దాచిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. ఆయుధాలు చోరీకి గురైన వెంటనే పోలీసులు, ఆర్మీ అధికారులు, ఇంటెలిజెన్స్‌, టాస్క్‌ఫోర్స్‌ బృందాలు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టాయి. చివరకు మల్లేష్‌ వ్యవహారం వెలుగులోకి రావడంతో అతడిని అరెస్ట్‌ చేసి, అతని వద్ద నుంచి ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం మల్లేష్‌ను చంచల్‌గూడ జైలుకు తరలించారు. తాజాగా కోర్టు అనుమతితో మల్లేష్‌ను 10 రోజుల కస్టడీకి తీసుకున్న పోలీసులు మొదటి రోజు విచారణ పూర్తి చేశారు. కార్ఖానాలోని ఏసీపీ కార్యాలయంలో ఆర్మీ అధికారులు కూడా మల్లేష్‌ను విచారించారు. చోరీ చేసిన ఆర్మీ ఆయుధాలతో ఏం చేయాలనుకున్నాడు? వాటిని ఎవరికి విక్రయించాలనుకున్నాడు? చోరీ వెనుక మరెవరైనా ఉన్నారా? అనే అంశాలపై ఆరా తీసినట్లు సమాచారం.విచారణ అనంతరం మల్లేష్‌ను ఆర్మీ అధికారులు పోలీసులకు అప్పగించి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మిగిలిన కస్టడీ రోజుల్లో ఆయుధాల చోరీ వెనుక ఉన్న పూర్తి నెట్‌వర్క్‌, సహకరించిన వ్యక్తుల వివరాలను రాబట్టేందుకు పోలీసులు దర్యాప్తు కొనసాగించనున్నారు.

 

 

[ Bollaram Army Weapons Theft, Bollaram Army, Army Weapons Theft, Mallesha, Mallesha Custody, Army Weapons Case, Chanchalguda Jail, Hyderabad Crime, Telangana Police, Telugu One, Telugu News  ]