బొల్లారం మిలిటరీ క్యాంప్‌లో తుపాకుల చోరీ కేసులో పురోగతి..!
Published on: Tue Sep 8, 2026 3:03PM

12 మంది అనుమానిత వ్యక్తులపై పోలీసుల ఫోకస్..!
సికింద్రాబాద్ సమీపంలోని అత్యంత భద్రత కలిగిన బొల్లారం మద్రాస్ రెజిమెంట్ మిలిటరీ సెంటర్ పరిధిలో చోటుచేసుకున్న ఆయుధాల మాయం ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. సైనిక ప్రాంగణం నుంచి ఏకంగా ఆధునిక ఆయుధాలు, భారీ ఎత్తున మందుగుండు సామగ్రి అదృశ్యం కావడంతో రక్షణ వ్యవస్థతో పాటు స్థానిక పోలీసు యంత్రాంగం ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఈ సంచలనాత్మక మిస్సింగ్ గన్స్ కేసులో దర్యాప్తు అధికారులు అత్యంత కీలకమైన పురోగతిని సాధించినట్లు మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడిస్తూ, సైన్యం, పోలీసు యంత్రాంగం అన్ని ప్రముఖ కేంద్ర దర్యాప్తు ఏజెన్సీలు సమన్వయంతో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నాయని ఆమె తెలిపారు.
అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే ఆర్మీ ఏరియా నుంచి ఈ స్థాయిలో తుపాకులు గాల్లో కలిసిపోవడం సామాన్యమైన విషయం కాదని దర్యాప్తు సంస్థలు భావిస్తున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం, ఈ భారీ అదృశ్యం ఘటనలో 12కి పైగా అత్యంత శక్తివంతమైన తుపాకులు మాయమయ్యాయి. వీటిలో సరిహద్దు పోరాటాల్లోనూ, తీవ్రవాద నిరోధక చర్యల్లోనూ ఉపయోగించే ఏకే-47 (AK-47) రైఫిళ్లు ఇన్సాస్ (INSAS) రకం అత్యాధునిక తుపాకులు ఉన్నాయి.
కేవలం ఆయుధాలు మాత్రమే కాకుండా, వాటికి సంబంధించిన దాదాపు 1,200కి పైగా సజీవ బుల్లెట్లు కూడా అదృశ్యమవ్వడం భద్రతా బలగాల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఒకేసారి ఇన్ని ఆయుధాలు వెయ్యికి పైగా రౌండ్ల అమ్యునిషన్ గాయబ్ కావడం వెనుక ఏదైనా అంతర్గత హస్తం ఉందా లేక వ్యవస్థీకృత నేరస్థుల పన్నాగామా అనే కోణంలో సుదీర్ఘ శోధన కొనసాగుతోంది.
కేసు తీవ్రతను దృష్టిలో ఉంచుకుని మల్కాజిగిరి పోలీసు కమిషనరేట్ పరిధిలోని ప్రత్యేక బృందాలు దర్యాప్తును వేగవంతం చేశాయి. సైనిక ఉన్నతాధికారుల సహకారంతో లోతుగా తనిఖీలు చేపడుతూ, ఒక పక్కా సైంటిఫిక్ పద్ధతిలో అనుమానితుల ఏరివేత ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.

సాంకేతిక ఆధారాలు, సిసిటివి ఫుటేజ్, కాల్ డేటా రికార్డులు మరియు సైనిక ప్రాంగణంలోకి వచ్చి వెళ్లిన వ్యక్తుల జాబితాను నిశితంగా పరిశీలిస్తున్నారు. దర్యాప్తు ప్రాథమిక దశలో ఉన్నందున అన్ని విషయాలను బయటకు వెల్లడించలేమని, అయితే ఇప్పటివరకు అందిన సమాచారం ఆధారంగా సుమారు 12 మందికి పైగా అనుమానితులను ప్రత్యేకంగా గుర్తించి విచారిస్తున్నట్లు సమాచారం అందుతోంది.
పోలీసు యంత్రాంగం దర్యాప్తు ఏజెన్సీల వ్యూహాత్మక అడుగులతో ఈ కేసులో రోజురోజుకు గుట్టు విప్పుతోందని, అతి త్వరలోనే ఈ సంచలన మిస్టరీని సంపూర్ణంగా ఛేదించి బాధ్యులను చట్టం ముందు నిలబెడతామని సిపి సుమతి విశ్వాసం వ్యక్తం చేశారు. ఆర్మీ క్యాంప్ పరిధిలో ఇంత పెద్దమొత్తంలో గన్స్ బుల్లెట్లు మాయం కావడంతో నగరవ్యాప్తంగా భద్రతా వర్గాల్లో ఈ కేసు అత్యంత ప్రాధాన్య అంశంగా మారింది. దర్యాప్తు బృందాలు వేస్తున్న ప్రతి అడుగు కేసును త్వరలోనే ఒక కొలిక్కి తెస్తుందని భావిస్తున్నారు.
(Bolarum missing guns case, Madras Regiment gun theft, AK 47 rifles missing Hyderabad, Malkajgiri CP Sumathi, Hyderabad, crime news, Bolarum army camp missing bullets, Telugu One, Telugu News)


