రాత్రి వేళ‌ల్లో రోగాల ప్ర‌మాదం

 

తెల్ల‌వారుజామునే నిద్ర‌లేవాలి, రాత్రివేళ‌ల్లో ఎక్కువ‌సేపు మేల్కొని ఉండ‌కుండా ప‌డుకోవాలి, వేళ త‌ప్ప‌కుండా తినాలి. ఇలా మ‌న రోజువారీ దిన‌చ‌ర్య‌ల గురించి పెద్ద‌లు బోలెడు మంచిమాట‌లు చెప్పేవారు. మ‌న‌మేమో వాటిని చాద‌స్తం అంటూ కొట్టి పారేసేవారం. కానీ పెద్ద‌ల మాట‌లు ఎంత అమూల్య‌మైన‌వో నిరూపించే ప‌రిశోధ‌న ఒక‌టి వెలికిచూసింది.

 

జీవ‌గ‌డియారం

కేంబ్రిడ్జి విశ్వ‌విద్యాల‌యానికి చెందిన కొంద‌రు శాస్త్ర‌వేత్త‌లు ఈమ‌ధ్య‌నే ఒక ప‌రిశోధ‌న చేశారు. మ‌న శరీరం మీద రోగ‌కార‌కాలు ఏ స‌మ‌యంలో ఎక్కువ‌గా దాడి చేస్తాయా అని ప‌రిశీలించారు. ఇందుకోసం వాళ్లు కొన్ని ఎలుక‌ల మీద హెర్ప‌స్ అనే వైర‌స్ ఏ స‌మ‌యంలో ఎక్కువ‌గా దాడిచేయ‌గ‌ల‌దో గ‌మ‌నించారు. ఆశ్చ‌ర్యంగా ఎలుక‌లు నిద్ర‌పోయే స‌మ‌యంలో, వాటి మీద వైర‌స్ ప్ర‌భావం ప‌దిరెట్లు అధికంగా ఉన్న‌ట్లు తేలింది.

 

కార‌ణం!

మ‌న శ‌రీరంలో ప్ర‌తి క‌ణానికీ ఒక జీవ‌గ‌డియారం ఉంటుంది. ఏ స‌మ‌యంలో మ‌నం మెల‌కువ‌గా ఉంటాము? ఏ స‌మ‌యంలో మ‌నం నిద్ర‌స్తూ ఉంటాము? అన్న ప‌రిస్థితుల‌కు ఆధారంగా ఆ జీవ‌గ‌డియారం ప‌నిచేస్తూ ఉంటుంది. క‌ణాల‌లోని జీవ‌గ‌డియారాన్ని నియంత్రించే జ‌న్యువుకి Bmal1 అని పేరు పెట్టారు శాస్త్ర‌వేత్త‌లు. మ‌నం అప్ర‌మ‌త్తంగా ఉన్న‌ప్పుడు, మ‌న‌తో పాటుగా క‌ణాలు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండి రోగాల‌ను ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉంటాయి.

 

గ‌డియారం తారుమారైతే

ఒక ప‌ద్ధ‌తి లేకుండా ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు ప‌డుకోవ‌డం, ఇష్టం వ‌చ్చిన‌ప్పుడు ప‌నిచేయ‌డం వ‌ల్ల ఈ జీవ‌గ‌డియారం దెబ్బ‌తింటుంది. దాంతో శ‌రీరానికి ఎప్పుడు అప్ర‌మ‌త్తంగా ఉండాలో తెలియ‌కుండా పోవ‌డంతో రోగాలు త్వ‌ర‌గా మ‌న‌ల్ని చుట్టుముడ‌తాయి. పైగా విశ్రాంతి తీసుకోవ‌ల‌సిన స‌మ‌యంలో తిరుగుతూ ఉండ‌టంతో... వాతావ‌ర‌ణంలోని రోగ‌క‌ణాలు త్వ‌ర‌గా మ‌న మీద దాడి చేసే అవ‌కాశం ఉంటుంది. అంటే రాత్రివేళ‌ల్లో ప‌నిచేసేవారి మీదా, షిఫ్టుల ప్ర‌కారం ఒక స‌మ‌యం అంటూ లేకుండా ప‌నిచేస్తూ అస్త‌వ్య‌స్త‌మైన దిన‌చ‌ర్య ఉన్న‌వారి మీదా... రోగాలు త్వ‌ర‌గా దాడిచేసే అవ‌కాశం ఉంద‌న్న‌మాట‌.

 

ఉప‌యోగం

- వాతావ‌ర‌ణం బాగుండ‌న‌ప్పుడు రాత్రివేళ‌ బ‌య‌ట తిరిగేవారు మ‌రింత అప్ర‌మ‌త్తంగా ఉండాలి. చేతుల క‌డుక్కోవ‌డం వంటి జాగ్ర‌త్త‌ల‌ను పాటించడం, న‌లుగురూ మెసిలే చోట‌కి దూరంగా ఉండ‌టం చేయాలి.

 

- మ‌న శ‌రీరం మ‌రింత జాగ‌రూక‌త‌గా ఉండే ప‌గ‌టిపూట టీకాల‌ను వేస్తే, అవి మ‌రింత ప్ర‌భావ‌వంతంగా ప‌నిచేస్తాయ‌ని ఈ ప‌రిశోధ‌న సూచిస్తోంది.

 

- ఇన్నాళ్లూ జ‌లుబు, జ్వ‌రం వంటి రోగాలు చ‌లికాలంలో ఎందుకు ఉధృతంగా వ్యాపిస్తాయో తెలియ‌లేదు. చ‌లికాలంలోని వాతావ‌ర‌ణం వ‌ల్ల‌ Bmal1 జ‌న్యువు ప‌నితీరు స‌వ్యంగా లేక‌పోవ‌డం వ‌ల్లే... ఆ కాలంలో మ‌నం త్వ‌ర‌గా రోగాల‌బారిన ప‌డ‌తామ‌ని ఈ ప‌రిశోధ‌న‌తో తేలిపోయింది.

 

 

- నిర్జ‌ర‌.