గోశాలపై పెద్దపులి పంజా: ఆవులపై వరుస దాడులు.!
Published on: Sun Sep 27, 2026 11:03AM
.webp)
వికారాబాద్ జిల్లా పరిగి మండలం బసిరెడ్డిపల్లి సమీపంలో పెద్దపులి సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. కృష్ణగిరి క్షేత్ర ఆలయ పరిధిలోని గోశాలలో వరుసగా గోవులపై దాడులు జరుగుతుండటంతో చుట్టుపక్కల గ్రామాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.మూడు రోజుల క్రితం గోశాలలోని ఓ లేగదూడను పులి ఎత్తుకెళ్లినట్లు గో సంరక్షకులు చెబుతున్నారు. తాజాగా మరో ఆవుపై పులి దాడి చేసింది. గోశాల నిర్వాహకులు అప్రమత్తమై కేకలు వేయడంతో పులి అక్కడి నుంచి పరుగులు తీసినట్లు తెలిపారు. పులి దాడిలో ఆవు మెడ, ఉదర భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. వీపుపై పంజా ఆనవాళ్లు కూడా కనిపించాయి.

తీవ్ర గాయాలతో ఆవు మృతి చెందింది. దీంతో గోశాల నిర్వాహకులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజల్లో ఆందోళన మరింత పెరిగింది. గోశాలకు సమీపంలోని ఓ ఫామ్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో పులి కదలికలు రికార్డైనట్లు గోశాల నిర్వాహకులు తెలిపారు. దీంతో అది నిజంగానే పెద్దపులి సంచారమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది.గోశాలలో దాదాపు 200 వరకు ఆవులు ఉన్నాయని నిర్వాహకుడు కృష్ణస్వామి తెలిపారు. వరుస దాడులతో గోవులను ఎలా కాపాడుకోవాలోనన్న ఆందోళన నెలకొంది. వెంటనే పులిని బంధించి, దానిని వేరే అడవిలో వదిలి గోశాలను రక్షించాలని కృష్ణస్వామి కోరుతున్నారు. పెద్దపులి సంచారం నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
[ Big Tigers Paw on the Cowshed, Vikarabad District, Parigi Mandal, Basireddypalli, Cowshed Attack, Tiger Movement, Tiger Panic, Telangana Forest Department, Cattle Attack, Bengal Tiger, Krishna Giri Temple, Tiger CCTV Footage, Telangana Wildlife, Tiger Alert ]


