వైసీపీకి సుప్రీంలో బిగ్ షాక్.!
Published on: Wed Aug 26, 2026 10:22AM

వైసీపీకి దేశ సర్వోన్నత న్యాయస్థానంలో బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాల నుంచి పోస్టులను తొలగించడాన్ని, హ్యాండిల్స్‌ను బ్లాక్ చేయడాన్ని సవాల్ చేస్తూ దాఖలు చేసిన రిట్ పిటిషన్‌ను కోర్టు తోసి పుచ్చింది. ఈ అంశంపై సంబంధిత రాష్ట్ర హైకోర్టునే ఆశ్రయించి పరిష్కారం వెతుక్కోవాలని ఆదేశిస్తూ ధర్మాసనం సదరు పిటిషన్‌ను కొట్టివేసింది.
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఎక్స్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్ వంటి సామాజిక మాధ్యమ వేదికలలో ఉన్న తమ పార్టీ అధికారిక ఖాతా జగనన్న కనెక్ట్స్ నుంచి పలు పోస్టులను తొలగిస్తున్నారని, ఖాతాలపై ఆంక్షలు విధిస్తున్నారని వైసీపీ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 కింద నేరుగా సుప్రీంకోర్టు తలుపు తట్టిన పార్టీ, రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని రాజ్యాంగ విరుద్ధమైన సెన్సార్‌షిప్‌గా సదరు పిటిషన్ లోపేర్కొంది.
జస్టిస్ దీపాంకర్ దత్తా, జస్టిస్ షీల్ నాగులతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం ఈ పిటిషన్ విచారణ చేపట్టింది. విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు.. బాధిత పక్షం ముందుగా రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించకుండా నేరుగా ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టుకు రావడం సరైన విధానం కాదని స్పష్టం చేసింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 226 ప్రకారం హైకోర్టులోనే ఈ విధమైన వివాదాలపై సమగ్ర విచారణ జరిపి తగిన ఉపశమనం పొందే అవకాశం ఉందని పేర్కొంది.
పిటిషన్‌లో వైఎసీపీ ప్రధానంగా సమాచార సాంకేతిక చట్టం నిబంధనలను ప్రస్తావించింది. గతంలో 2014లో వెలువడిన శ్రేయా సింగాల్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా' తీర్పు ప్రకారం.. సోషల్ మీడియాలోని కంటెంట్‌ను తొలగించాలన్నా లేదా బ్లాక్ చేయాలన్నా ఐటీ చట్టంలోని సెక్షన్ 69ఏ ప్రకారం కేంద్ర ప్రభుత్వం నియమించిన అధికారి ఆదేశాలు కానీ, లేదా న్యాయస్థానం ఉత్తర్వులు కానీ ఉండాలని వాదించింది.
అయితే ఈ కేసులో సెక్షన్ 69ఏ కింద ఎలాంటి అధికారిక ఉత్తర్వులు లేకుండానే, స్థానిక పోలీసు అధికారులు ఐటీ చట్టంలోని సెక్షన్ లోనిబంధనలను అస్త్రంగా చేసుకుని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లకు నోటీసులు జారీ చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. పోలీసు ఇన్‌స్పెక్టర్లు 36 గంటల్లోగా పోస్టులు, ఖాతాలను తొలగించాలంటూ నోటీసులు పంపడం నిబంధనలకు విరుద్ధమని పేర్కొంది. పిటిషనర్ వాదనలను విన్న ధర్మాసనం, ఈ చట్టపరమైన అంశాలను హైకోర్టు ముందు లేవనెత్తవచ్చని స్పష్టం చేసింది.
Big shock to ycp in Supreme court,, YCP Social Media, Jagananna Connects, Andhra Pradesh High Court, Supreme Court Writ Petition


