TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

కారులో ఇరుక్కొని ఐదేళ్ల చిన్నారి దుర్మరణం..!

Published on: Sun Sep 20, 2026 5:44PM

కారు డోర్ లాక్ అయి.. ఊపిరాడక సర్పంచ్ కూతురు మృతి..!

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వినోబానగర్ గ్రామంలో జరిగిన  హృదయ విదారక ప్రమాదంలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. గ్రామానికి చెందిన సర్పంచ్ గంగావత్ నవీన్ ముద్దుల కుమార్తె అయిన ఐదేళ్ల తన్విశ్రీ ఆడుకుంటూ ప్రమాదవశాత్తు ఇంట్లో ఉన్న కారులోకి వెళ్లినట్లు తెలుస్తోంది. అయితే అనుకోకుండా కారు డోర్లు లాక్ అయిపోవడంతో ఆ చిన్నారి లోపల తీవ్రంగా ఇరుక్కుపోయింది. బయటకు రాలేక, గాలి సరిగ్గా అందక ఉక్కపోతకు గురైన చిన్నారి ఊపిరాడక విలవిలలాడిపోయింది. కొద్దిసేపటి వరకు చిన్నారి కనిపించకపోవడంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు చుట్టుపక్కల అంతా గాలించారు.


ఆ సమయంలో ఇంటి వద్ద నిలిపి ఉంచిన కారును పరిశీలించగా, తన్విశ్రీ లోపల అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించి ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు. వెంటనే కారు డోర్లు తెరిచి చిన్నారిని బయటికి తీసుకువచ్చినప్పటికీ, అప్పటికే జరగరాని అనర్థం జరిగిపోయింది. చిన్నారిని తక్షణమే మెరుగైన వైద్యం కోసం ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించినప్పటికీ, అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయినట్లు వైద్యులు ధృవీకరించారు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న ఐదేళ్ల పసిపాప ఇలా విగతజీవిగా మారడంతో సర్పంచ్ గంగావత్ నవీన్ కుటుంబంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. 

కన్నబిడ్డ శవంతో ఆ తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అక్కడున్న ప్రతీ ఒక్కరి కంటతడి పెట్టించింది. ఈ హృదయ విదారక వార్త తెలిసిన వెంటనే వినోబానగర్ గ్రామస్థులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి సర్పంచ్ కుటుంబాన్ని పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని, సంతాపం తెలిపారు. చిన్నారి అకాల మరణంతో ఆ ప్రాంతం మొత్తం ఒక్కసారిగా మూగబోయింది. పిల్లలు ఆడుకునే సమయంలో తల్లిదండ్రులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా కార్లు లేదా ఇతర ప్రమాదకర వస్తువుల దగ్గరకు వెళ్లకుండా కంటికి రెప్పలా కాపాడుకోవాలని ఈ ఘటన మరోసారి కన్నీటి గుణపాఠం మిగిల్చింది

 

 

 

[ Bhadradri Kothagudem District, toddler dies in car, julurupad news, telangana crime news, car lock accident child, mandal news,  CM Revanth reddy,  DGP C.V. Anand, Hyderabad police, Telugu One, Telugu News ]