TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

అమెరికాపై సడలిన నమ్మకం: భారత్ తో బంధమే శ్రీరామరక్ష.. ఇండియాపై నెతన్యాహు పొగడ్తలు.!

Published on: Mon Oct 19, 2026 3:11PM

ప్రపంచ భౌగోళిక రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్న తరుణంలో ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమెరికాపై సడలిన విశ్వాసం, భారత్ తో బంధం బలోపేతానికి ఆయన తహతహ ఆ వ్యాఖ్యలలో ప్రస్ఫుటంగా ప్రతిఫలించాయి. నెతన్యాహు వ్యాఖ్యలు  ఇప్పుడు అంతర్జాతీయ స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయి. 

భవిష్యత్తులో అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టే వ్యక్తి  ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా, శత్రుభావంతో వ్యవహరించే అవకాశాలు మెండుగా ఉన్నాయని నెతన్యాహు అన్నారు. అగ్రరాజ్యం రాజకీయాల్లో భవిష్యత్తులో తలెత్తగల ఇటువంటి ఊహించని సవాళ్లను ఎదుర్కొనేందుకు, ముందస్తు వ్యూహంగా భారత్ వంటి బలమైన దేశాలతో వ్యూహాత్మక కూటములను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందని నెతన్యాహు అభిప్రాయపడ్డారు. ఇజ్రాయెల్‌  ఎన్నికల వేళ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు అగ్రరాజ్యంపై సడలిన ఆయన నమ్మకానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచాయి. 

ప్రస్తుతం అంటే ఇప్పుడు అమెరికాతో ఉన్న అనుకూల వాతావరణాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఇజ్రాయెల్ తన స్థానాన్ని మరిత పటిష్టం చేసుకోవాలన్న నెతన్యాహు.. ప్రస్తుత అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ హయాంలో అగ్రరాజ్యం ఇజ్రాయెల్ అనుకూల విధానాలను అవలంబిస్తోందనీ, అయితే ఇదే పరిస్థితి అమెరికా తదుపరి అధ్యక్షుడి హయాంలో ఉంటుందన్న నమ్మకం ఇసుమంతైనా లేదనీ పేర్కొన్నారు.  వచ్చే రెండేళ్లలో అమెరికా నుంచి గరిష్ట ప్రయోజనాలను సాధించుకోవాలని, అదే సమయంలో భవిష్యత్ అనిశ్చితిని దృష్టిలో ఉంచుకొని, అంటే డోనాల్డ్ ట్రంప్ తరువాత అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టే వ్యక్తి హయాంలో ఇజ్రాయెల్ ప్రతికూల విధానాలకు అమెరికా ఉపక్రమించే అవకాశాలను దష్టిలో ఉంచుకుని  ప్రత్యామ్నాయ భాగస్వామ్యాలను విస్తరించుకోవాలని ఆయన నొక్కి చెప్పారు. భారత్ చిన్న దేశం కాదని, అంతర్జాతీయంగా అపారమైన శక్తి సామర్థ్యాలు కలిగిన దేశమని నెతన్యాహు ప్రస్తుతించారు.  ఇండియా,  లాటిన్ అమెరికా, బ్రెజిల్ వంటి దేశాలతోనూ సత్సంబంధాలు పెంపొందించుకోవడంపై తాను ప్రత్యేక దృష్టి సారించానని వెల్లడించారు. 

కాగా నెతన్యాహు ఇండియాపై పొగడ్తల వర్షం కురిపించడం ఇదే తొలి సారి కాదు. ఈ ఏడాది మేలో కూడా ఆయన ఇండియాను భారీ శక్తిగా అభివర్ణించిన సంగతి విదితమే. ఇండియా, ఇజ్రాయెల్ మధ్య  ప్రత్యేకమైన సంబంధాలన్నాయన్న ఆయన, అలాగే ఇండియాలో  ఇజ్రాయెల్ పట్ల సానుకూల వాతావరణం ఉందని చెప్పుకొచ్చారు.  

అయితే తాజాగా అమెరికాతో సంబంధాలు దెబ్బతినే అవకాశాలున్నాయంటూ నెతన్యాహు చేసిన వ్యాఖ్యలు అమెరికాలో భవిష్యత్ రాజకీయ మార్పులపై స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. వచ్చే ఎన్నికలలో అమెరికాలో డెమొక్రాట్ లు అధికారంలోకి వచ్చే అవకాశాలున్నాయన్న సంకేతాలను నెతన్యాహు తన వ్యాఖ్యల ద్వారా ఇచ్చారు. గతంలో అంటే అమెరికాలో డెమోక్రట్ల పాలన సమయంలో ఇజ్రాయెల్, అమెరికా సంబంధాల మధయ ఒడిదుడుకులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు చేసిన అమెరికా తదుపరి అధ్యక్షుడు వ్యాఖ్య రిపబ్లికన్ల ఓటమిని సూచిస్తోందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మరోవైపు, ఇజ్రాయెల్‌లో అక్టోబర్ 27న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు ముందు నెతన్యాహు ఈ వ్యూహాత్మక ప్రకటన చేయడంపై ఆయన రాజకీయ ప్రత్యర్థుల నుంచి   విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నెతన్యాహు ప్రధాన ప్రత్యర్థి, ఇజ్రాయెల్ రక్షణ దళాల మాజీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గాడి ఐసెన్‌కోట్..  ఎన్నికల సమయంలో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి, దేశంలో నెలకొన్న ఇతర ప్రధాన సమస్యల నుంచి ప్రజల దృష్టిని మళ్లించేందుకే నెతన్యాహు ఇలాంటి నినాదాలు, వివాదాలు తెరపైకి తెస్తున్నారని  ఆరోపించారు. దేశ రక్షణకు సంబంధించి స్పష్టమైన విధానం లేకపోవడంతోనే ఇలాంటి వ్యూహాలను ఆశ్రయిస్తున్నారని ఐసెన్‌కోట్ మండిపడ్డారు. 

[Benjamin Netanyahu Lost Faith America, Speak Strong India Relations, US Future President Warnings, Netanyahu Strategy,  Foreign Policy, Israel Elections, Telugu One]