విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు.. ఈ విషయాలు క్లియర్ చేసుకోండి..!
Published on: Mon Sep 28, 2026 6:08PM
విడాకులు తీసుకున్న వ్యక్తిని పెళ్లి చేసుకునే ముందు.. ఈ విషయాలు క్లియర్ చేసుకోండి..!
జీవితంలో విడాకులు అనేది ఒక అధ్యాయానికి ముగింపు మాత్రమే తప్ప, జీవితానికి కాదు. విడాకులు తీసుకున్న వ్యక్తి మళ్లీ ఒక కొత్త బంధంలోకి అడుగుపెట్టడం, కొత్త జీవితాన్ని ప్రారంభించడం చాలా సహజమైన విషయం. అయితే, భాగస్వామిగా ఎంచుకోబోయే వ్యక్తికి విడాకులు అయి ఉండి, ఇప్పటికీ వారు తమ మాజీ భాగస్వామితో మాట్లాడుతూ, సన్నిహితంగా ఉంటూ, పరిచయంలో ఉంటే ఎన్నో సందేహాలు, భయాలు రావడం కూడా అంతే సహజం. వారు ఇప్పటికీ స్నేహితులుగా మాట్లాడుకుంటున్నా, లేదా పెళ్లి వంటి శుభకార్యాలకు ఆహ్వానించుకుంటున్నా కొంత అభద్రతా భావం కలిగే అవకాశం ఉంటుంది. అయితే ఇటువంటి పరిస్థితుల్లో ఆందోళన చెందడం కంటే, వివాహానికి ముందే కొన్ని విషయాలపై స్పష్టత తెచ్చుకోవడం ఎంతో ఉత్తమం.
స్పష్టత..
ఈ రోజుల్లో విడాకుల తర్వాత కూడా ఇద్దరు వ్యక్తులు పరస్పర గౌరవంతో స్నేహాన్ని కొనసాగించడం తరచుగా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా పిల్లల బాధ్యతలు, ఆర్థిక లావాదేవీలు లేదా పాత బంధాన్ని మానసికంగా దాటి ముందుకు సాగినప్పుడు ఇటువంటి వాతావరణం ఉంటుంది. కానీ కొత్తగా వారి జీవితంలోకి వస్తున్న భాగస్వామికి మాత్రం కొన్ని అనుమానాలు రావచ్చు. వారు ఇప్పటికీ ప్రేమలో ఉన్నారా, కేవలం స్నేహం మాత్రమేనా, పెళ్లి తర్వాత కూడా ఈ స్నేహం సంబంధాన్ని ప్రభావితం చేస్తుందా అనే ఆలోచనలు రావడం సహజం. ఈ సందేహాలను మనసులోనే దాచుకోకుండా, పెళ్లికి ముందే భాగస్వామితో బహిరంగంగా మాట్లాడటం వల్ల భవిష్యత్తులో వచ్చే అనేక సమస్యలను నివారించవచ్చు.
లైఫ్ పార్ట్నర్ తమ మాజీతో పరిచయంలో ఉండటం ఎల్లప్పుడూ తప్పు కాకపోవచ్చు. పిల్లలు, ఉమ్మడి ఆస్తులు, వ్యాపారాలు లేదా కుటుంబ సంబంధాల వల్ల వారు మాట్లాడుకోవాల్సి రావచ్చు. కాబట్టి వారు కేవలం మాట్లాడుతున్నారనే కారణంతోనే ఏదో తప్పు జరుగుతోందని భావించలేం. వారు ఎంతవరకు లిమిట్ లో ఉన్నారో.. వారు ఇంకా మాట్లాడుకోవడానికి కారణం ఏమిటో అర్థం చేసుకోవడం ప్రధానం. అలాగే, వారిద్దరి విడాకులకు అసలు కారణం ఏమిటో, ఆ పాత బంధం నుండి భాగస్వామి ఏం నేర్చుకున్నారో తెలుసుకోవడం వల్ల మళ్ళీ పెళ్లి చేసుకున్న తర్వాత భాగస్వామి స్వభావాన్ని మరింత స్పష్టంగా అర్థం చేసుకునే అవకాశం లభిస్తుంది.
సంకోచం వద్దు..
భార్య అయినా భర్త అయినా.. రెండో సారి పెళ్లి చేసుకున్న తర్వాత మాజీ భార్యతో లేదా భర్తతో మాట్లాడటం మీకు నచ్చదు అనిపిస్తే .. ఆ విషయాన్ని మనసులో దాచుకోవడం కంటే, పెళ్లికి ముందే వారితో ఆ విషయం చెప్పడం ఇద్దరికీ మంచిది. మీతో విషయాలను పంచుకోవడంలో మీ భాగస్వామి ఎంతవరకు ట్రాన్సపరెంట్ గా ఉంటున్నారు అనేది ఇక్కడ ముఖ్యమైన అంశం. మాట్లాడటంలో దాపరికం లేకుండా ఉన్నప్పుడు అనుమానాలకు తావుండదు.
మానసిక బంధం..
భార్యా లేదా భర్తతో విడిపోయిన తర్వాత రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నప్పటికీ.. ఇంకా వదిలేసిన వ్యక్తితో మానసికంగా అటాచ్మెంట్ అయి ఉన్నారా అనేది కూడా పరిశీలించాలి. పాత బంధం పూర్తిగా ముగిసిపోయిందా, లేక ఇప్పటికీ ప్రతి చిన్న విషయానికి మాజీ లైఫ్ పార్టనర్ పై ఆధారపడుతున్నారా అనేది గమనించాలి. మిమ్మల్ని ఎప్పుడూ పాత లైఫ్ పార్టనర్ తో పోల్చడం లేదా పాత బంధంలోని సమస్యల్లోనే ఇంకా ఉండిపోవడం వంటివి ఉంటే, వారు మానసికంగా రెండో పెళ్లి చేసుకుని కొత్త బంధానికి సిద్ధంగా లేరని అర్థం చేసుకోవాలి.
భవిష్యత్తు..
భవిష్యత్తులో వారి మాజీ లైఫ్ పార్టనర్ పాత్ర ఎంతవరకు ఉంటుంది అనే దానిపై కూడా స్పష్టత ఉండాలి. పిల్లలు ఉన్నట్లయితే వారి పెంపకం కోసం మాజీ లైఫ్ పార్ట్నర్ జీవితంలో ఉండే అవకాశం ఉంటుంది. కానీ కలుసుకుంటూ ఉండటం అనేది ఎంత తరచుగా ఉంటుంది? ఎంత వరకు వారు హద్దులో ఉంటున్నారు, , కుటుంబ వేడుకలకు వారు వస్తారా లేదా, అలాగే ఆ సందర్భాల్లో మిమ్మల్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు అనే విషయాలపై ముందే మాట్లాడేసుకోవడం వల్ల భవిష్యత్తు వివాదాలు తగ్గుతాయి.
కష్టంలో..
ఒకవేళ మాజీ లైఫ్ పార్ట్నర్ కు ఏదైనా కష్టం వచ్చినప్పుడు మీ భాగస్వామి ఎంతవరకు స్పందిస్తారు అనే దానిపై కూడా హద్దులు ఉండాలి. పిల్లల విషయంలో సహాయం చేయడం వేరు, కానీ మీ ప్రాధాన్యతలను పక్కన పెట్టి పాత భాగస్వామికే మొదటి స్థానం ఇవ్వడం సరైనది కాదు. మీ భాగస్వామికి మీకే మొదటి ప్రాధాన్యత ఉందా లేదా అనేది స్పష్టంగా తెలియాలి.
విడాకులు తీసుకున్న వ్యక్తితో కొత్త జీవితాన్ని ప్రారంభించడంలో ఎలాంటి తప్పు లేదు. బంధం బలపడటానికి నమ్మకం, స్పష్టమైన కమ్యూనికేషన్, ట్రాన్పరెంట్ గా ఉండటం , పరస్పర గౌరవం ప్రధానమైనవి. వివాహానికి ముందే ఇరువైపులా అన్ని విషయాలు తెరిచిన పుస్తకంలా మాట్లాడేసుకుంటే, ఇద్దరి మధ్య నమ్మకం పెరుగుతుంది. ఇది భవిష్యత్తులో రాబోయే సమస్యలను తొలగించి, ఒక బలమైన, సంతోషకరమైన కొత్త బంధానికి నాంది పలుకుతుంది.
రూపశ్రీ.


