TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

ఏపీకి వాయు ‘గండం’: తీరం దాటేదెప్పుడంటే.?

Published on: Tue Sep 22, 2026 5:42PM

బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం కారణంగా ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.  పశ్చిమ మధ్య బంగాళాఖాతం ఏర్పడిన వాయుగుండం..  గంటగంటకూ తన వేగాన్ని పెంచుకుంటూ ఉత్తరాంధ్ర వైపు దూసుకొస్తోందని పేర్కొంది. వాయుగుండం ప్రస్తుత గమనాన్ని బట్టి చూస్తే..  ఇది మరింత బలపడి తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది.    ప్రస్తుతం ఇది విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో , కళింగపట్నానికి సమీపంలో కేంద్రీకృతమై ఉంది.  

ఈ వాయుగుండం ప్రభావంతో   ఆంధ్రప్రదేశ్ తీరప్రాంతాల్లో, మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాలతో పాటు దక్షిణ ఒడిశా ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ హెచ్చరికలతో ఏపీ అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.

ఈ తీవ్ర వాయుగుండం.. బుధవారం (సెప్టెంబర్ 23) రాత్రికి విశాఖపట్నం, గోపాలపురం మధ్య  తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండం తీరం దాటే సమయంలో గంటకు 75 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఆ సమయంలో  సముద్రం అల్లకల్లోలంగా మారుతుందనీ, మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లడం ప్రమాదమని పేర్కొంది. 

భారీ వర్షాల నేపథ్యంలో ఏపీ ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తమైంది.  ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సర్వసన్నద్ధమైంది.  వాగులూ, వంకలూ పొంగిపొర్లే అవకాశం ఉన్న నేపథ్యలో లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు యంత్రాగం ఏర్పాట్లు చేసింది. 


[Bay of Bengal Depression,  Severe Depression Warning, Visakhapatnam Rains, AP weather, IMD Heavy Rain Alert, Andhra Pradesh News, Telugu One]