కాలాపాని నుంచి హుస్సేనీవాలా సమాధి వరకూ.. చరిత్ర గుర్తించని యోధుడు బటుకేశ్వర్ దత్.!
Published on: Wed Nov 18, 2026 8:34AM

బటుకేశ్వర్ దత్ జయంతి సందర్భంగా ప్రత్యేక వ్యాసం
స్వాతంత్ర్య సంగ్రామ చరిత్రలో అసమాన ధైర్యసాహసాలతో చెరగని ముద్ర వేసిన విప్లవ వీరుడు బటుకేశ్వర్ దత్ జయంతిని నవంబర్ 18న దేశవ్యాప్తంగా జరుపుకుంటూ ఆయనను స్మరించుకుంటున్నారు. 1910 నవంబర్ 18న జన్మించిన బటుకేశ్వర్ దత్..షాహీద్ భగత్ సింగ్‌కు అత్యంత సన్నిహితుడు, పోరాట సహచరుడు. బ్రిటిష్ సామ్రాజ్యవాదుల గుండెల్లో వణుకు పుట్టించిన మహాయోధుడు కూడా. 1929 ఏప్రిల్ 8న బ్రిటిష్ పాలకులు తీసుకువచ్చిన ప్రజావ్యతిరేక చట్టాలకు నిరసనగా భగత్ సింగ్, బటుకేశ్వర్ దత్ కలిసి ఢిల్లీలోని సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు విసిరారు.
అయితే ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగకూడదనే ఉద్దేశంతో ఖాళీ బెంచీల వద్దే వారు ఈ పేలుడుకు పాల్పడ్డారు. ఆ తరువాత అక్కడ నుంచి తప్పించుకుపోవడానికి ఉన్న అవకాశాన్ని కాదనుకుని ఇంక్విలాబ్ జిందాబాద్ నినాదాలు చేస్తూ.. విప్లవ కరపత్రాలను గాలిలోకి వెదజల్లారు. భారత స్వాతంత్ర్య కాంక్షను గుర్తించకుండా గుడ్డి దర్బార్ గా వ్యవహరిస్తున్న బ్రిటిష్ సామ్రాజ్యావాదుల కళ్లు తెరిపించడం, స్వాతంత్ర్య నినాదాలను వినకుండా చెవిటి దర్బార్ నడుపుతున్న బ్రిటిష్ పాలకుల చెవుళ్లో తుప్పు వదిలి దేశం గొంతు వినిపించాలన్న ఉద్దేశంతోనే బటుకేశ్వర్ దత్, భగత్ సింగ్ లు సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు పేల్చారు. ప్రాణహాని కలిగించడం వారి ఉద్దేశం కాదు. బ్రిటిష్ పాలకులకు దేశ స్వాతంత్ర్య సంగ్రామ సింహనాదాన్ని వినిపించడమే వాలక్ష్యం.
సరే సెంట్రల్ అసెంబ్లీలో బాబులు విసిరిన ఘటన తరువాత పోలీసులు బటుకేశ్వర్ దత్, భగత్ సింగ్ లను అదుపులోనికి తీసుకున్నారు. విచారణ తరువాత భగత్ సింగ్ కు ఉరి శిక్ష అమలు చేశారు. బటుకేశ్వర్ దత్ ను అండమాన్‌లోని సెల్యులార్ జైలుకు (కాలాపానీ) తరలించారు. అక్కడ దాదాపు పద్నాలుగేళ్ల పాటు ఆయన నరకయాతనను అనుభవించారు.

దేశ స్వాతంత్ర్య సాధన లక్ష్యాన్ని మరచి క్షమాభిక్ష కోరడానికి మాత్రం అంగీకరించలేదు. పిన్న వయస్సులోనే మరణశిక్షకు గురైనందున భగత్ సింగ్ విప్లవ ప్రతీకగా జనం గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. అంతకు ఇసుమంతైనా తక్కువ కాని త్యాగం చేసిన బటుకేశ్వర్ సింగ్ కు మాత్రం చరిత్రలో తగినంత గుర్తింపు రాలేదు.
ఇది కూడా చదవండి
అండమాన్ జైలు శిక్ష పూర్తి చేసుకుని బయటకు వచ్చిన బటుకేశ్వర్ దత్ ను స్వాతంత్ర్యం సిద్ధించిన తరువాత కూడా నెహ్రూ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది. ఉపాధి, ఆదరణ లేక ఆ మహావీరుడు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు.చివరి రోజుల్లో క్షయవ్యాధితో బాధపడిన బటుకేశ్వర్ సింగ్.. 1965 జూలై 20న ఢిల్లీలో తుదిశ్వాస విడిచారు. మరణానికి ముందు తనను తన ప్రాణమిత్రుడు భగత్ సింగ్ సమాధి పక్కనే ఖననం చేయాలని చివరి కోరికగా అడిగారు. ఆయన చివరి కోరిక మేరకు పంజాబ్‌లోని హుస్సేనివాలాలో భగత్ సింగ్ సమాధి పక్కనే బటుకేశ్వర్ దత్ అంత్యక్రియలు నిర్వహించి స్మారకాన్ని నిర్మించారు.

దేశ స్వాతంత్ర్యం కోసం సర్వస్వం త్యాగం చేసిన ఇలాంటి అజ్ఞాత వీరుల చరిత్రను నేటి తరానికి పరిచయం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇప్పటికైనా పాఠ్యపుస్తకాల్లో ఆయన జీవిత చరిత్రను పాఠ్యాంశంగా చేర్సాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదే విధంగా ఆయన జయంతి, వర్ధంతులకు ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి బటుకేశ్వర్ దత్ త్యాగాలను గుర్తించి, ఆయన అసమాన పోరాట చరిత్రను నేటి తరానికి పరిచయం చేయడమే ఆయనకు అర్పించే నిజమైన నివాళి.
మీకు నచ్చవచ్చు:
[Batukeshwar Dutt, Birth anniversary, Bhagat Singhassociate, Freedom fighter, Hussainiwala memorial, TeluguOne]


