బంగ్లాదేశ్‌లో భగభగ మండుతున్న గార్మెంట్ కార్మికుల ఆందోళనలు!
Published on: Thu Nov 5, 2026 8:40AM

బంగ్లాదేశ్ వస్త్ర మరియు రెడీమేడ్ గార్మెంట్స్ (RMG) రంగం తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. పెరుగుతున్న జీవన వ్యయం, ద్రవ్యోల్బణం మరియు నిత్యావసర ధరల భారాన్ని తట్టుకోలేక కార్మికులు పెద్దఎత్తున రోడ్డెక్కడంతో దేశవ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. కనీస నెలవారీ వేతనాన్ని ప్రస్తుతమున్న 12,500 టకా నుంచి ఏకంగా 30,000 టకాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ కార్మికులు ఆందోళనకు దిగారు. ఈ నిరసనలు ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారడంతో బంగ్లాదేశ్‌లోని కీలక పారిశ్రామిక ప్రాంతాలైన సావర్, అశులియా, గజిపూర్ మరియు నారాయణ్గంజ్లలో కార్మికులకు, పోలీసులకు మధ్య తీవ్ర ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఆందోళనకారులు రోడ్లను దిగ్బంధించి హైవేలపై రాకపోకలను పూర్తిగా స్తంభింపజేయగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు టియర్ గ్యాస్ షెల్స్, సౌండ్ గ్రనేడ్లు మరియు రబ్బరు బుల్లెట్లను ప్రయోగించాల్సి వచ్చింది. ఈ ఘర్షణల్లో భద్రతా సిబ్బందితో సహా కనీసం 50 మందికి పైగా గాయపడగా, పరిస్థితి అదుపు తప్పుతుందనే ఆందోళనతో దాదాపు 370కి పైగా గార్మెంట్ ఫ్యాక్టరీలు తాత్కాలికంగా తమ ఉత్పత్తిని నిలిపివేశాయి.

ప్రపంచంలోనే చైనా తర్వాత రెండో అతిపెద్ద వస్త్ర ఎగుమతి దేశంగా వెలుగొందుతున్న బంగ్లాదేశ్‌లో, ఈ గార్మెంట్ రంగం దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలా నిలుస్తోంది. సుమారు 40 బిలియన్ డాలర్ల ఎగుమతి ఆదాయాన్ని సమకూర్చే ఈ పరిశ్రమపైనే దేశం ఆధారపడి ఉంది. దాదాపు 2,500కు పైగా ఫ్యాక్టరీలు ఉన్న ఈ రంగంలో సుమారు 4 మిలియన్ల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో అత్యధికంగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన మహిళలే ఉండటం గమనార్హం. అయితే, గత కొన్ని సంవత్సరాలుగా విపరీతంగా పెరిగిన ఆహార ద్రవ్యోల్బణం, ఇళ్ల అద్దెలు మరియు గ్యాస్ బిల్లుల కారణంగా తాము బతకడమే కష్టంగా మారిందని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్మికుల డిమాండ్లపై స్పందించిన ప్రభుత్వం, సంక్షోభాన్ని చల్లార్చేందుకు ఒక నూతన వేతస బోర్టును ఏర్పాటు చేసింది. ఈ కొత్త వేతన శ్రేణి కింద కార్మికులకు జనవరి నుంచి సవరించిన జీతాలు అందే అవకాశం ఉందని చైర్మన్ సయ్యద్ అజాద్ సుభానీ తెలిపారు. ఏదేమైనప్పటికీ, దేశ ఎగుమతుల్లో 80 శాతానికి పైగా వాటా కలిగిన ఈ వస్త్ర రంగంలో నెలకొన్న ఈ అశాంతి అంతర్జాతీయ బయ్యర్ల విశ్వాసాన్ని దెబ్బతీసే ప్రమాదం ఉందని ఆర్థిక నిపుణులు హెచ్చరిస్తున్నారు.
[Bangladesh Garment Workers Protest, Bangladesh RMG Industry, Bangladesh Minimum Wage, Garment Workers Salary Hike, Bangladesh Labour Unrest, Savar, Ashulia, Gazipur, Narayanganj, Bangladesh Textile Exports]


