టీ20 వరల్డ్‌ కప్‌లో... బంగ్లా స్థానంలో స్కాట్లాండ్?

posted on: Jan 24, 2026 9:52AM

 

టీ20 వరల్డ్‌ కప్‌-2026లో ఆడటానికి లేనిపోని అభ్యంతరాలు చెపతున్న బంగ్లాదేశ్ స్థానంలో స్కాట్లాండ్ జట్టు ప్రపంచకప్‌లో ఎంట్రీ ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. టీ20 వరల్డ్‌ కప్‌-2026లో భాగంగా మ్యాచ్‌లు ఆడేందుకు తమ జట్టు ఇండియాకు రాబోదని బంగ్లాదేశ్‌ క్రికెట్‌ బోర్డ్‌ ప్రకటించింది. భారత్‌లో తమ ఆటగాళ్లకు భద్రత ఉండదని, తమ మ్యాచ్‌లను శ్రీలంకకు తరలించాలని ఐసీసీకి బంగ్లా ప్రతిపాదన చేసింది. 

ఈ టోర్నీ ప్రారంభానికి తక్కువ సమయం ఉండటంతో వేదికలు మార్చడం అసాధ్యమంటూ బీసీబీ ప్రతిపాదనను ఐసీసీ తిరస్కరించింది. బంగ్లాదేశ్ కూడా తమ నిర్ణయంలో మార్పులేదని స్పష్టం చేసింది. ఒకవేళ ఐసీసీ టీ20 ప్రపంచకప్ నుంచి బంగ్లాదేశ్ వైదొలిగితే ఆ దేశ క్రికెట్ బోర్డుకు భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది. కొన్ని మీడియా కథనాల ప్రకారం.. బంగ్లా జట్టు టోర్నీలో ఆడకుంటే.. 27 మిలియన్ డాలర్లు అంటే భారత కరెన్సీలో సుమారు రూ.240 కోట్ల వరకు నష్టపోయే అవకాశముంది. 

బ్రాడ్‌కాస్ట్‌, స్పాన్సర్‌‌షిప్‌ రూపంలో వారికి రావాల్సిన ఏడాది ఆదాయంలో దాదాపు 60 శాతం కోల్పోవచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఇది ఆ దేశ క్రికెట్‌ బోర్డ్‌ కార్యకలాపాలను తీవ్రంగా ప్రభావితం చేసే అవకాశముందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. మరోవైపు.. ప్రపంచ కప్-2026లో బంగ్లాదేశ్‌ ఆడకుంటే.. ఆ జట్టు స్థానంలో స్కాట్లాండ్‌ వరల్డ్ కప్‌ ఆడనుంది. త్వరలోనే ఈ విషయంపై ఐసీసీ నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశముంది.

google-ad-img
    Related Sigment News
    • Loading...