TeluguOne Health
● # Tweets

Download the TeluguOne App

Choose your platform to continue

బలోచిస్థాన్ లో పాక్ సైన్యంపై బిఎల్ఎఫ్ దాడి: 80 మంది సైనికులు మృతి.!

Published on: Thu Oct 29, 2026 9:16AM

పాకిస్థాన్‌లోని బలూచిస్తాన్ ప్రాంతంలో మళ్లీ  ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. పాకిస్థాన్ సైన్యం, నిఘా విభాగాలకు చెందిన 80 మందికి పైగా సిబ్బందిని హతమార్చినట్లు బలూచ్ లిబరేషన్ ఫ్రంట్  బీఎల్ఎఫ్ ప్రకటించింది. గ్వాదర్ జిల్లాలో సైనిక స్థావరాలు, భద్రతా కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని ఆపరేషన్ అల్మాస్ పేరుతో వరుస దాడులు నిర్వహించినట్లు ఆ సంస్థ వెల్లడించింది.  

ఈ నెల  22న ప్రారంభమైన ఈ ఆపరేషన్‌లో భాగంగా గ్వాదర్‌లోని ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్   ప్రధాన శిబిరంపై తొలి దాడి  చేసి  తమ సభ్యులు లోపలికి ప్రవేశించినట్లు బీఎల్ఎఫ్ ప్రకటించింది.  సైనిక నిఘా సంస్థలకు సంబంధించిన కార్యాలయాలు, ఇతర భద్రతా కేంద్రాలపైనా దాడులు చేసినట్లు సంస్థ పేర్కొంది. దాదాపు 20 గంటల పాటు తమ సభ్యులు ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్    శిబిరంపై  తమ నియంత్రణ కొనసాగిందనీ,  ఈ దాడుల్లో సైనిక నిఘా విభాగానికి చెందిన అధికారి సహా పలువురు సిబ్బంది మరణించారని ఆ ప్రకటనలో తెలిపింది.  12 సాయుధ వాహనాలు, సరఫరా ట్రక్కులను ధ్వంసం చేసి నాలుగు క్వాడ్‌కాప్టర్ డ్రోన్లు, రెండు నిఘా డ్రోన్లను కూల్చివేసినట్లు తెలిపింది. 

అయితే పాకిస్థాన్ మాత్రం సైన్యం గ్వాదర్ నగరంతో పాటు గాబ్ద్ సరిహద్దు ప్రాంతంలో చేపట్టిన చర్యల్లో 10 మంది బీఎల్ఎఫ్ సభ్యులు మరణించారని పేర్కొంది. బీఎల్ఎఫ్ ఫ్రాంటియర్ వర్క్స్ ఆర్గనైజేషన్    శిబిరంపై దాడికి చేసిన యత్నాన్ని భగ్నం చేశామని ప్రకటించింది. బీఎల్ఎఫ్ దాడిని తిప్పికొట్టామనీ, ఆ క్రమంలో  తమ భద్రతా సిబ్బందికి ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని పాక్ సైన్యం పేర్కొంది.   


[Baloch Liberation Front Attack  Pakistan Army, Gwadar attacks, Operation Almas, Balochistan, Pak Army, Telugu One]