జనసేనలో బాలినేని పరిస్థితి ఏంటి?
Published on: Wed Sep 2, 2026 10:00AM
.webp)
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒంగోలు నియోజకవర్గం ఎప్పుడూ కీలకంగానే ఉంటుంది. 2024 ఎన్నికల అనంతరం వైసీపీని వీడి జనసేన గూటికి చేరిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. ప్రకాశం జిల్లాలో మరీ ముఖ్యంగా ఒంగోలులో గట్టి పట్టు, రాజకీయ పలుకుబడి ఉన్న సీనియర్ నేత అయిన బాలినేనికి, జనసేనలో ఏ మాత్రం ప్రాధాన్యత లభించడంలేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తీసుకుంటున్న నిర్ణయాలు, స్థానిక పరిస్థితులు కూడా ఆ ప్రచారానికి బలం చేకూర్చేవిగానే ఉంటున్నాయి.
ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ను లక్ష్యంగా చేసుకుని బాలినేని శ్రీనివాసరెడ్డి మీడియా సమావేశంలో చేసిన విమర్శలు, ఆరోపణలు తెలుగుదేశం, జనసేన పార్టీల మధ్య దాదాపు చిచ్చు పెట్టినంత పని చేశాయి. అయితే సకాలంలో తెలుగుదేశం, జనసేన అధినాయకత్వాలు జోక్యం చేసుకుని దామచర్ల, బాలినేనిలను గట్టిగా హెచ్చరించడంతో పరిస్థితి సద్దుమణిగింది. అయితే బాలినేని వ్యాఖ్యలు, విమర్శల పట్ల మాత్రం ఇరు పార్టీలలోనూ తీవ్ర అసంతృప్తి వ్యక్తమైంది. వ్యక్తిగత విభేదాలు, పాత తగాదాల లేక్క తేల్చచుకునేందుకు బాలినేని జనసేనను వాడుకుంటున్నారన్న విమర్శలు ఇటు తెలుగుదేశంలోనూ, అటు జనసేనలోనూ కూడా వెల్లువెత్తాయి. పరిస్థితిని అర్ధం చేసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. దిద్దుబాటు చర్యలు చేపట్టారు.

ఇటీవల జనసేన పార్టీ ప్రకటించిన స్థానిక సంస్థల ఎన్నికల కమిటీలో బాలినేనికి స్థానం దక్కలేదు. బాలినేని వంటి సీనియర్ నాయకుడికి స్థానిక ఎన్నికల బాధ్యతల్లో ప్రాతినిధ్యం ఇవ్వకపోవడాన్ని బట్టి జనసేనాని బాలినేనిని దూరం పెట్టారని అవగతమౌతోందంటున్నారు పరిశీలకులు. అలాగే ఒంగోలులో ఎంతో ఘనంగా నిర్వహించిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజరు కూడా బాలినేనికి జనసేనలో ఇసుమంతైనా ప్రాధాన్యత ఇవ్వడం లేదని తెలుస్తోందంటున్నారు. అంతే కాదు.. ఒంగొలులో జరిగిన జనసేన ఆత్మీయ సమావేశానికి బాలినేని గైర్హాజర్ కాలేదనీ, ఆయనను ఆ సమావేశానికి పార్టీ అధిష్ఠానం ఆహ్వానించలేదనీ, అందుకే ఆయన దూరంగా ఉన్నారన్న ప్రచారం కూడా జోరుగా సాగుతున్నది. మొత్తం మీద ప్రకాశం జిల్లాలో, ఒంగోలులో బాలినేనికి జనసేనలో ప్రాధాన్యత తగ్గిందనీ, పార్టీ కార్యక్రమాలకు ఆయనను దూరం పెడుతున్నారనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
బాలినేని తీరును, పార్టీ కార్యకర్తల, స్థానిక నేతల అభిప్రాయాలనూ, అలాగే మిత్రపక్షమైన తెలుగుదేశం అభిప్రాయాలనూ పరిగణనలోనికి తీసుకున్న జనసేనాని పవన్ కల్యాణ్.. పార్టీలో బాలినేని ప్రభావాన్ని, జోక్యాన్ని తగ్గించారని అంటున్నారు. పొత్తు ధర్మానికి విఘాతం కలగకుండా ఉండాలన్నా, పార్టీ అంతర్గత క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండాలన్నాబాలినేనిని పార్టీ కార్యక్రమాలకు దూరం పెట్టడమే మేలని, జనసేనాని అదే చేస్తున్నారని పార్టీ వర్గాలే చెబుతున్నాయి. పవన్ కళ్యాణ్ కూటమి ఐక్యత దెబ్బతినకుండా ఉండటానికీ, అలాగే ప్రకాశం జిల్లాలో జనసైనికులలో కొత్త జోష్ నింపడానికి బాలినేనికి పార్టీలో ప్రాధాన్యత లేకుండా చర్యలు తీసుకుంటున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
[Balineni Srinivasa Reddy Imoprtance Diminished, Pawan Kalyan, Janasena Party, Ongole Politics, TDP Janasena Alliance, Telugu One]


