కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలతో బిర్యానీ.. బహార్ బిర్యానీ కేఫ్‌లో దారుణం..!
Published on: Wed Sep 16, 2026 7:17PM

హైదరాబాద్ నగరంలో ఫుడ్ సేఫ్టీ నిబంధనల ఉల్లంఘనలపై అధికారులు కొరడా ఝుళిపిస్తున్నారు. గత కొన్ని నెలలుగా హైదరాబాద్ నగరంలోని పలు ప్రాంతాల్లో ఉన్న హోటల్స్, రెస్టారెంట్లు, కేఫ్‌లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఆహార పదార్థాలు తయారు చేసే సంస్థలపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ తనిఖీల్లో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఆహార పదార్థాల తయారీలో ప్రమాదకరమైన రసాయన పదార్థాలను ఉపయోగించడం, హోటల్స్, రెస్టా రెంట్లు, కేఫ్‌లలో అశుభ్ర మైన వాతావరణంలో వంటకాలు తయారు చేయడం, గడువు ముగిసిన పదార్థాలను వినియోగించడం వంటి ఉల్లంఘనలు అధికారుల తనిఖీల్లో బయటపడుతున్నాయి. ఇప్పుడు తాజాగా దిల్సుఖ్‌నగర్‌లోని M/s Bahar Biryani Cafeపై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

కేఫ్ కిచెన్‌లోకి అధికారులు ప్రవేశించగానే దుర్వాసన రావడంతో అనుమానం కలిగింది. దీంతో కిచెన్ లోని ఆహార పదార్థాలు, నిల్వలను అధికారులు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ తనిఖీల్లో కిలోల కొద్దీ కుళ్లిపోయిన ఆహార పదార్థాలు బయటప డ్డాయి. ముఖ్యంగా కుళ్లిపోయిన చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన ఇతర ఆహార పదార్థాలను ఉపయోగిస్తూ టేస్టీ బిర్యానీ తయారు చేస్తున్నట్లుగా అధికారులు గుర్తించారు. తనిఖీల్లో వినియోగానికి అనర్హంగా ఉన్న ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు.. మొత్తం సుమారు 50 కిలోల చికెన్, మటన్, రొయ్యలతో పాటు గడువు ముగిసిన,పాడైపోయిన, ఆహార పదార్థాలను అక్కడికక్కడే డిస్పోజ్ చేశారు.

బిర్యానీ, ఇతర ఆహార పదార్థాల కోసం వచ్చే వినియోగదారులకు సురక్షితమైన, నాణ్యమైన ఆహారం అందించాల్సిన కిచెన్‌లోనే ఇంత పెద్ద మొత్తంలో పాడైపోయిన పదార్థాలు బయటపడటం అధికా రులను సైతం ఆశ్చర్యానికి గురిచేసింది. ఆహార పదార్థాల నాణ్యతపై మరింత స్పష్టత కోసం యాక్ట్ ప్రకారం వివిధ ఆహార పదార్థాల శాంపిల్స్‌ను ఫుడ్ సేఫ్టీ అధికారులు సేకరించారు. సేకరించిన నమూనాలను ల్యాబ్ పరీక్షలకు పంపిం చారు. పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధమ య్యారు.తనిఖీల్లో గుర్తించిన ఉల్లంఘనలను పరిగణనలోకి తీసుకున్న ఫుడ్ సేఫ్టీ అధికారులు Bahar Biryani Cafe FSSAI లైసెన్స్‌ను సస్పెండ్ చేయాలని డిజిగ్నేటెడ్ ఆఫీసర్‌కు సిఫారసు చేశారు. బిర్యానీ కోసం వచ్చే కస్టమర్లకు నాణ్యమైన ఆహారం అందించాల్సిన చోటే.. కుళ్లిన చికెన్, మటన్, రొయ్యలు, ఎక్స్‌పైర్డ్ ఉత్పత్తులు బయటప డటం దిల్సుఖ్‌నగర్‌లో కలకలం రేపింది.

[ Bahar Biryani Cafe, Dilsukhnagar, Hyderabad Food Safety, Food Safety Raid, Food Safety Officials, Rotten Chicken, Rotten Mutton, Rotten Prawns, Expired Food, Biryani Cafe, FSSAI License, Food Safety Violations, Hyderabad Restaurants, Telangana Food Safety ]


