ఇక లోన్ల EMIలు పెరుగుతాయా.. పెరుగుతున్న ధరలపై ఆర్‌బీఐ తదుపరి చర్య ఏంటి!
Published on: Wed Sep 16, 2026 11:03AM

దేశంలో సామాన్య ప్రజల జేబులకు మళ్లీ చిల్లులు పడుతున్నాయి. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతుండటంతో ఆగస్టు నెలలో రిటైల్ ద్రవ్యోల్బణం ఒక్కసారిగా పెరిగి ఆందోళన కలిగిస్తోంది. ఉల్లిపాయలు, వెల్లుల్లి, అల్లం వంటి వంటగదికి అత్యంత కీలకమైన ఆహార పదార్థాల ధరలు విపరీతంగా పెరగడమే ఇందుకు ప్రధాన కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. నేషనల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (NSO) విడుదల చేసిన తాజా వినియోగదారుల ధరల సూచీ (CPI) వివరాల ప్రకారం, జూలై నెలలో 4.45 శాతంగా ఉన్న రిటైల్ ద్రవ్యోల్బణం ఆగస్టు నాటికి 4.82 శాతానికి చేరుకుంది. జనవరి 2024ను ప్రాతిపదిక సంవత్సరంగా తీసుకుని కొత్త సిరీస్‌ను అమల్లోకి తీసుకొచ్చిన తర్వాత, నమోదైన అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం రేటు ఇదే కావడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
ప్రాంతాల వారీగా పరిశీలిస్తే, పట్టణ ప్రాంతాల కంటే గ్రామీణ ప్రాంతాల్లోనే ధరల మంట ఎక్కువగా కనిపిస్తోంది. ఆగస్టు గణాంకాల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 5.23 శాతంగా నమోదు కాగా, పట్టణ ప్రాంతాల్లో ఇది 4.31 శాతంగా ఉంది. అలాగే ఆగస్టులో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం జూలైలోని 5.52 శాతం నుంచి 5.95 శాతానికి పెరిగింది. నిత్యావసర సరుకుల ధరల పెరుగుదల గణాంకాలను పరిశీలిస్తే దిగ్భ్రాంతి కలిగిస్తోంది. జూలైలో 22.54 శాతంగా ఉన్న ఉల్లిపాయల ద్రవ్యోల్బణం ఆగస్టులో ఏకంగా 48.27 శాతానికి ఎగబాకింది. అదే సమయంలో వెల్లుల్లి ద్రవ్యోల్బణం 35.36 శాతం నుంచి 43.6 శాతానికి పెరిగింది. అల్లం ధరల పెరుగుదల రేటు ఏకంగా 73.82 శాతంతో వినియోగదారులకు కన్నీళ్లు తెప్పిస్తోంది. అయితే టమోటా, బంగాళాదుంప, బెండకాయ వంటి కొన్ని రకాల కూరగాయల ధరలు స్వల్పంగా తగ్గడం కొంత ఉపశమనం కలిగించే అంశం.
(2).webp)
రాష్ట్రాల వారీగా చూస్తే దేశంలోనే అత్యధిక రిటైల్ ద్రవ్యోల్బణం తెలంగాణలో 6.27 శాతంగా నమోదవ్వడం గమనార్హం. ఇక అత్యల్పంగా మిజోరంలో 2.35 శాతంగా ఉంది. కేవలం రిటైల్ రంగానికే పరిమితం కాకుండా టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం (WPI) కూడా భారీగానే పెరిగింది. జూలైలో 9.78 శాతంగా ఉన్న టోకు ద్రవ్యోల్బణం ఆగస్టు నాటికి 9.92 శాతానికి పెరిగింది. అలాగే టోకు ఆహార ద్రవ్యోల్బణం 6.65 శాతం నుంచి 7.05 శాతానికి ఎగబాకింది. 2022-23ను ఆధార సంవత్సరంగా తీసుకున్న కొత్త WPI సిరీస్‌లో ఇది రెండవ అత్యధిక స్థాయి కావడం గమనార్హం.
ఈ పరిస్థితి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) రాబోయే ద్రవ్య విధాన నిర్ణయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఆర్‌బిఐ రెపో రేటు లేదా కీలక వడ్డీ రేట్లను నిర్ణయించడంలో ఈ రిటైల్ ద్రవ్యోల్బణమే ప్రధాన ప్రాతిపదికగా పనిచేస్తుంది. అక్టోబర్ 5 నుంచి 7 వరకు ఆర్‌బిఐ ద్రవ్య విధాన కమిటీ (MPC) సమావేశం కానుంది. కేంద్ర ప్రభుత్వం ద్రవ్యోల్బణాన్ని 4 శాతానికి (ప్లస్ లేదా మైనస్ 2 శాతం మార్జిన్‌తో) పరిమితం చేయాలని ఆర్‌బిఐకి సూచించింది. ప్రస్తుత ద్రవ్యోల్బణం ఈ పరిమితి లోపే ఉన్నప్పటికీ, పశ్చిమాసియాలో కొనసాగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల కారణంగా ఇంధన ధరలు పెరిగే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఆర్‌బిఐ 2026-27 సంవత్సరానికి సిపిఐ ద్రవ్యోల్బణాన్ని 5 శాతంగా అంచనా వేయగా, అందులో రెండవ త్రైమాసికానికి 4.7 శాతం, మూడవ త్రైమాసికానికి 5.9 శాతం, నాలుగో త్రైమాసికానికి 5.5 శాతంగా అంచనాలు వేసింది. గత సమావేశంలో ద్రవ్యోల్బణ భయాల దృష్ట్యా ఆర్‌బిఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచినప్పటికీ, రాబోయే అక్టోబర్ భేటీలో ఈ పెరుగుతున్న ధరలను దృష్టిలో ఉంచుకుని ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటుందోనని మార్కెట్ వర్గాలు, సామాన్య ప్రజలు అత్యంత ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.
[Retail Inflation, India Inflation, CPI Inflation, August 2026 Inflation, NSO, Food Inflation, Onion Prices, Garlic Prices, Ginger Prices, RBI MPC]


