డీఎస్సీ ఉపాధ్యాయులపై దాడి.. వైసీపీ నేతలపై కేసులు నమోదు.!
Published on: Tue Sep 22, 2026 9:45AM

ఆంధ్రప్రదేశ్‌లో మెగా డీఎస్సీ నియామకాల వ్యవహారం మరోసారి రాజకీయ రచ్చకు తెరలేపింది. విజయవాడలోని స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యాలయం వద్ద సోమవారం (సెప్టెంబర్ 20) ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు తమ సమస్యలను క్రీడల శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు అక్కడికి చేరుకోగా, వైసీపీ శ్రేణులు కూడా నిరసన కార్యక్రమానికి రావడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ క్రమంలో ఉపాధ్యాయులపై కోడిగుడ్లు, రాళ్లు, వాటర్ బాటిళ్లు విసిరినట్లు, భౌతిక దాడికి దిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి.
రాష్ట్రంలో మెగా డీఎస్సీ నియామకాల ప్రక్రియపై వైసీపీ నేతలు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. స్పోర్ట్స్ కోటాలో జరిగిన నియామకాల్లో అవకతవకలు ఉన్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారు. మరోవైపు, ఆ కోటాలో ఉద్యోగాలు పొందిన ఉపాధ్యాయులు ఈ ఆరోపణలను ఖండిస్తున్నారు. తాము అర్హతలు, ప్రతిభ ఆధారంగా ఉద్యోగాలు సాధించామని చెబుతున్నారు.

ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య కొంతకాలంగా మాటల యుద్ధం కొనసాగుతోంది. తమపై వస్తున్న ఆరోపణలకు వివరణ ఇచ్చేందుకు, సంబంధిత మంత్రికి వినతిపత్రం సమర్పించేందుకు స్పోర్ట్స్ కోటా ఉపాధ్యాయులు సోమవారం (సెప్టెంబర్ 21)విజయవాడలోని శాప్ కార్యాలయానికి చేరుకున్నారు. ఇదే సమయంలో వైసీపీ నేతలు, కార్యకర్తలు అక్కడికి రావడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.
విజయవాడలో నిరసన కార్యక్రమాలకు అనుమతి లేదని పోలీసులు ముందుగానే స్పష్టం చేసినప్పటికీ వైసీపీ శ్రేణులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం పరిసరాల్లో పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేసి రాకపోకలను నియంత్రించారు. అయితే.. నిరసనకారులు స్టేడియం వైపు వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులకు, వైసీపీ నేతలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. కొందరు బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. చివరకు నిరసనకారులు శాప్ కార్యాలయం సమీపానికి చేరుకోవడంతో అక్కడ అప్పటికే ఉన్న ఉపాధ్యాయులు, వైసీపీ కార్యకర్తల మధ్య నినాదాల పోటీ మొదలైంది. ఆ క్రమంలోనే నిరసనకారులు ఉపాధ్యాయులపై దాడికి దిగారు. దాడిని అడ్డుకునేందుకు ప్రయత్నించిన శాప్ డైరెక్టర్ల అనుచరులపై కూడా కర్రలతో దాడి చేశారు. ఈ ఘటనలో రామకృష్ణ, నితిన్‌రెడ్డి గాయపడినట్లు సమాచారం.
ఈ ఘటనకు సంబంధించి వైసీపీ నేతలు దేవినేని అవినాశ్, పేర్ని కిట్టు, జక్కంపూడి రాజా, లేళ్ల అప్పిరెడ్డి, వెలంపల్లి శ్రీనివాస్, మల్లాది విష్ణు, గౌతంరెడ్డి తదితరులపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉపాధ్యాయులపై దాడి ఘటనకు సంబంధించి పోలీసులు పలు కేసులు నమోదు చేశారు. మాచవరం పోలీస్‌స్టేషన్‌లో రెండు, సూర్యారావుపేట, కృష్ణలంక పోలీస్‌స్టేషన్లలో ఒక్కొక్క కేసు నమోదైంది.
విజయవాడలో ఉపాధ్యాయులపై దాడిని పలువురు మంత్రులు, కూటమి నేతలు ఖండించారు. మంత్రి అచ్చెన్నాయుడు నియామకాలపై అభ్యంతరాలుంటే ఆధారాలతో ముందుకు రావాలని, అవసరమైతే న్యాయస్థానాలను ఆశ్రయించాలి తప్ప ఉపాధ్యాయులపై దాడి సరికాదన్నారు. ఉపాధ్యాయుల భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం ఇసుమంతైనా రాజీపడబోదన్నారు.
మంత్రి నారా లోకేశ్ ఈ ఘటనపై స్పందిస్తూ, ఉపాధ్యాయులపై దాడులకు పాల్పడిన వారిని ఉపేక్షించబోమని హెచ్చరించారు. దాడికి బాధ్యులైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
[Attack on Teachers, Vijayawada, YCP DSC Controversy, Sports Quota Teachers, SAAP Office, Mega DSC, Cases YCP Leaders, Nara Lokesh, Andhra Pradesh politics]


