కొంపలు ముంచిన కోవీషీల్డ్!

కరోనా టీకా కోవీషీల్డ్ వ్యవహారం ఎలా వుందంటే, కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయినట్టుగా వుంది. కరోనా సమయంలో దేశంలో జనానికి కోవీషీల్డ్ కరోనా టీకాలు వెంటపడి మరీ గుచ్చిగుచ్చి వదిలిపెట్టారు. ఎవరైనా కోవీషీల్డ్ వేసుకోనంటే వాళ్ళని మర్డర్ చేసినవాళ్ళ కంటే పెద్ద నేరస్తులన్నట్టు చూశారు. కోవీషీల్డ్ టీకాతోపాటు మరో టీకా కోవాక్సిన్ అనే మరో టీకా కూడా వచ్చిందంటగా, అది వేస్తారా అంటే, ‘హుష్‌కాకీ.. అయిపోయాయి’ అని చెప్పి అందరికీ కోవీషీల్డే గుచ్చారు. అయినవారికి కంచాల్లో, కానివారికి ఆకుల్లో పెట్టినట్టుగా, ప్రధాని మోడీ లాంటి ప్రముఖులు, సెలబ్రిటీలు, డబ్బున్నవాళ్ళు, పలుకుబడి వున్నవాళ్ళు, రాజకీయ నాయకులకు మాత్రం సదరు కోవాక్సిన్ టీకా ఇచ్చారు. మిగతా వాళ్లందరికీ కోవీషీల్డే దిక్కు. ఆ దిక్కుమాలిన కోవీషీల్డ్ వల్ల ఎన్నెన్నో సైడ్ ఎఫెక్టులు.. ఎంతోమంది చనిపోయారు. ఆరోగ్యంగా వున్నవారు కూడా అకస్మాత్తుగా చనిపోయారు. ఇదెక్కడి ఘోరమయ్యా అని అడిగితే, ఏమో మాకు తెలియదు అని మొన్నటి వరకు ప్రభుత్వ వర్గాలు అన్నాయి. ఇప్పుడు కోవీషీల్డ్ తయారు చేసిన అమెరికాకి చెందిన ఫార్మా కంపెనీ ఆస్ట్రాజెనెకా అసలు విషయాన్ని బయటపెట్టింది. మా కోవీషీల్డ్ టీకాకి సైడ్ ఎఫెక్టులు వున్నాయని, మా టీకావల్ల చాలామందికి ఇతర అనారోగ్య సమస్యలు వచ్చాయని, చాలామంది చనిపోయారని, చనిపోయినవారి కుటుంబాలకు మా సానుభూతి అని చావుకబురు చల్లగా చెప్పింది.

అమెరికాకి చెందిన ప్రముఖ ఫార్మాకంపెనీ ఆస్ట్రాజెనెకా, ఆక్స్ ఫర్డ్ యూనివర్సటీ సంయుక్తంగా కోవీషీల్డ్ టీకాని రూపొందించాయి. ఇండియాలో ఈ టీకాని సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేసింది. కరోనా సమయంలో అత్యధికంగా ఉపయోగించిన టీకా కోవీషీల్డే. కరోనా వచ్చి వెళ్ళిపోయిన ఇన్నేళ్ళ తర్వాత ఆస్ట్రాజెనికా అసలు విషయాన్ని బయటపెట్టింది. నిజమే.. మా టీకా తీసుకున్న వాళ్ళలో అరుదైన సందర్భాల్లో (థాంబ్రోసిస్) రక్తం గడ్డకట్టడం, ప్లేట్లెట్స్ కౌంట్ తగ్గడం లాంటి సమస్యలు తలెత్తే అవకాశం వుందని చెప్పింది. ఈ సమస్యల వల్ల చాలామంది చనిపోయారని, వారి కుటుంబాలకు మా సానుభూతి తెలియజేస్తున్నామని చెప్పింది. అయినప్పటికీ, తమ సంస్థ జనాల ప్రాణాలను కాపాడ్డానికి కట్టుబడి వుందని చెప్పుకొచ్చింది. టీకాలతోపాటు అన్ని రకాల ఔషధాల తయారీలో ప్రమాణాలను పాటిస్తాయని చెప్పింది. మరి అన్ని ప్రమాణాలూ పాటిస్తే, ఈ కోవీషీల్డ్ టీకా ఇలా ఎందుకు ఏడిచిందో మరి?!

ఈ తప్పు ఒప్పుకునే కార్యక్రమం సదరు సంస్థ స్వచ్ఛందంగా ఏమీ చేయలేదు.. కోవీషీల్డ్ టీకాల వల్ల కుటుంబ సభ్యులను కోల్పోయిన వారు కోర్డును ఆశ్రయించినప్పుడు, కోర్టులో ఈ సంస్థ తమ తప్పును ఒప్పుకుంది. అంతేలే.. దొరికిందాకా అందరూ దొరలే. కోవీషీల్డ్ వల్ల ఇప్పటికే ఎన్నో ఘోరాలు జరిగాయి.. భవిష్యత్తులో ఇంకెన్ని జరుగుతాయో. ఇలాంటివెన్ని జరిగినా సదరు కార్పొరేట్ సంస్థలు సారీలు, సానుభూతులు చెప్పేసి చేతులు దులుపుకుంటాయి..