బాదుడే బాదుడు లేదు: ఆదాయం పెరిగింది.. ఏపీలో చంద్రబాబు మ్యాజిక్.!
Published on: Thu Nov 26, 2026 2:20PM

జగన్ హయాంలో బాదుడే బదుడు అంటు పన్నుల పెంపుపై ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అధికార పగ్గాలు చేపట్టి రాష్ట్ర ఆదాయాన్ని పెంచి మ్యాజిక్ చేశారు. ప్రజలపై ఎటువంటి అదనపు పన్ను భారం మోపకుండా, పాలనా సంస్కరణలు, పారదర్శకత, సాంకేతికత వినియోగం ద్వారానే ప్రభుత్వ ఆదాయాన్ని ఆయన పెంచి చూపారు. రాష్ట్ర సచివాలయంలో ఆదాయ అర్జన శాఖల ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన రాబడి గణాంకాలను పరిశీలించి ఆదాయాన్ని మరింత పంచేందుకు పలు సూచనలు చేశారు. ఆన్లైన్ వ్యవస్థల అమలు, వ్యవస్థాగత లోపాల సవరణతో ఆదాయ లీకేజీలకు అడ్డుకట్ట పడిందని.. రాష్ట్ర ఆదాయం పెరిగిందని చెప్పిన ఆయన, రాష్ట్రంలో చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల ఫలితాలు ఆదాయ వృద్ధిలో మరింత ప్రస్ఫుటం కావాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు.
సమీక్షా సమావేశంలో అధికారులు సమర్పించిన వివరాల ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ 23 నాటికి ప్రత్యేక మార్జిన్‌తో సహా మొత్తం రాష్ట్ర ఆదాయం రూ. 74,342 కోట్లకు చేరుకుంది. గత ఆర్థిక సంవత్సరం ఇదే కాలంతో పోలిస్తే ఇది రూ. 11,738 కోట్లు అధికం. మొత్తం వార్షిక ఆదాయ లక్ష్యం రూ. 1,27,506 కోట్లు కాగా, ఇప్పటికే సుమారు 58 శాతం లక్ష్యాన్ని చేరుకున్నట్లు అధికారులు ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
వివిధ శాఖల వారీగా ఆదాయ పనితీరును అధికారుల వివరాల మేరకు ఇలా ఉంది. మొత్తం పన్ను ఆదాయం 18.8 శాతం వృద్ధితో రూ. 63,796 కోట్లకు చేరింది. ఇందులో ఎక్సైజ్ శాఖ ఆదాయం ప్రత్యేక మార్జిన్‌తో కలిపి 19.6 శాతం వృద్ధితో రూ. 20,083 కోట్లకు, స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఆదాయం 16.6 శాతం వృద్ధితో రూ. 8,020 కోట్లకు చేరుకుంది. వాణిజ్య పన్నుల శాఖ ఆదాయం 18.3 శాతం వృద్ధితో రూ. 5,917 కోట్లుగా నమోదు కాగా, జీఎస్టీ ఆదాయం 18.1 శాతం వృద్ధితో రూ. 3,694 కోట్లు పెరిగింది. రవాణా శాఖ ద్వారా రూ. 3,649 కోట్లు, గనులు, భూగర్భ శాఖ ద్వారా రూ. 2,086 కోట్లు, అటవీ శాఖ ద్వారా రూ. 22 కోట్లు సమకూరాయి. నవంబర్ 20 నాటికి మున్సిపల్ పన్నుల ఆదాయం రూ. 2,365 కోట్లుగా, ఏప్రిల్ 1 నుంచి నవంబర్ 20 వరకు పంచాయతీ పన్నుల ఆదాయం రూ. 238 కోట్లుగా ఉండగా, పన్నేతర ఆదాయం రూ. 1,330 కోట్ల నుంచి రూ. 2,091 కోట్లకు పెరిగింది.

పన్ను వసూళ్లు, తనిఖీల్లో ఏఐ ను విస్తృతంగా వినియోగిస్తున్నట్లు అధికారులు సమీక్షలో వివరించారు. రాష్ట్రంలోని 123 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తిపన్ను వసూలు కోసం ఏఐ ఆధారిత వ్యవస్థను ప్రవేశపెడుతుండగా, వాణిజ్య పన్నుల శాఖలో రిటర్నుల పరిశీలన, ఆడిట్లు, తనిఖీల కోసం ఏప్రిల్ నుంచే ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నట్లు తెలిపారు. సాంకేతికత ఆధారిత పర్యవేక్షణ, ఆన్లైన్ సేవల విస్తరణ వల్ల పన్నుల ఎగవేత, మధ్యవర్తుల ప్రమేయం తగ్గి పారదర్శకత పెరుగుతోందన్న అభిప్రాయం పరిపాలనా వర్గాల్లో వ్యక్తమవుతోంది. కొత్త పన్నులు విధించకుండానే ఆదాయ వృద్ధి సాధించడం ద్వారా సాధారణ ప్రజలు, వ్యాపార వర్గాలపై అదనపు ఆర్థిక భారం పడకుండా చూడటమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
ఇది కూడా చదవండి: అభివృద్ధి, సంక్షేమంలో దేశంలోనే ఏపీ నంబర్ 2: యాక్సెస్ ఈక్వాలిటీ ఇండెక్స్ నివేదిక వెల్లడి.!
క్షేత్రస్థాయిలో వసూళ్ల ప్రక్రియను మరింత సులభతరం చేస్తూనే, శాఖల మధ్య సమన్వయంతో పనితీరును మెరుగుపరచడం ద్వారా మిగిలిన ఆర్థిక సంవత్సర కాలంలో నిర్దేశిత లక్ష్యాన్ని చేరుకునే దిశగా శాఖలు చర్యలు తీసుకోవాలని చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు దిశా నిర్దేశం చేశారు.

రానున్న నెలల్లో పన్నుల వసూళ్లలో ఏఐ వ్యవస్థల పూర్తిస్థాయి వినియోగం, ఆదాయ లీకేజీల నియంత్రణ ద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మరింత బలోపేతం అవుతుందని అధికారులు అంటున్నారు. ప్రజలపై కొత్త పన్నుల భారం మోపకుండానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు అవసరమైన నిధులను సమకూర్చుకోవాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.
మీకు నచ్చవచ్చు: ఏపీ ప్రగతి పరుగులు.. అభివృద్ధికి ఆకాశమే హద్దు!
ఏపీకి మరో భారీ డేటా సెంటర్: 47 వేల 8 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు.!
[APIncome, AditionalTaxes, AITechnology, CBN, Revenue, TeluguOne]


