అపర భగీరథుడు చంద్రబాబు.. పిఠాపురం వర్మ.!
Published on: Thu Sep 3, 2026 11:56AM
.webp)
ఆంధ్రప్రదేశ్ సాగునీటి రంగ చరిత్రలో గోదావరి జలాలు ఉత్తరాంధ్ర నేలను తాకిన ఘట్టం అపూర్వం, అద్భుతం.. దశాబ్దాల ఉత్తరాంధ్రప్రజల కలలు సాకారమైన క్షణం అని పిఠాపురం వర్మ అన్నారు. అనకాపల్లి జిల్లా పాయకరావుపేట వద్ద ప్రాజెక్ట్ క్రాస్ రెగ్యులేటర్ ద్వారా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గోదావరి జలాలను విడుదల చేసిన సందర్భం చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు.

కాకినాడ జిల్లా కత్తిపూడి సమీపంలో పోలవరం ఎడమ కాలువ జలాలకు పిఠాపురం వర్మ గురువారం (సెప్టెంబర్ 3) ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన నారా చంద్రబాబును అపరభగీరథుడిగా అభివర్ణించారు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా పోలవరం జలాలను మళ్లించి ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని చంద్రబాబు సస్యశ్యామలం చేశారన్నారు. చంద్రబాబు చేపట్టిన మీ కోసం పాదయాత్రలో పురుషోత్తపట్నం ప్రాజెక్టు ఆలోచన రూపుదిద్దుకుందన్న వర్మ.. ఆ తర్వాత 1,650 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో సీఎం చంద్రబాబు ఈ ప్రాజెక్టును వేగంగా పూర్తి చేశారని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన , పిఠాపురంలోనే జరిగిందని గుర్తు చేశారు. ఈ ప్రాజెక్టు పనులను అడ్డుకోవడానికి, నిలిపివేయడానికి గతంలో వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు కేంద్రానికి లేఖలు రాశారని విమర్శించారు.
గతంలో పట్టిసీమ ప్రాజెక్టును తలపెట్టినప్పుడు కూడా జగన్ మోహన్ రెడ్డి ఎగతాళి చేశారనీ, వెకిలి నవ్వులు నవ్వారని గుర్తు చేసిన పిఠాపురం వర్మ.. సుజల స్రవంతి ప్రాజెక్టును సైతం అడ్డుకుని ఉత్తరాంధ్రకు తీవ్ర ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబుకు పేరు వస్తుందన్న అసూయతోనే పురుషోత్తపట్నం పనులను వైసీపీ హయాంలో పక్కనబెట్టారన్నారు. పురుషోత్తపట్నం ప్రాజెక్టు తో ఏలేరు ఆయకట్టు పరిధిలోని ఐదు నియోజకవర్గాల రైతులకు నిరంతర సాగునీరు అందుతుందనీ.. ఈ పథకం ద్వారా లక్ష ఎకరాల్లో రెండు పంటలకు సాగునీరు అందుతుందనీ చెప్పారు. అలాగే ఉత్తరాంధ్ర తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు.
[Apara Bhagirathudu Chandrababu Naidu, Polavaram Project, Uttarandhra Water, Payakaraopeta, Godavari Waters, AP Irrigation, Pithapuram Verma]


