ఏపీ నేతన్నలకు కూటమి ప్రభుత్వం గుడ్ న్యూస్..!
Published on: Wed Aug 26, 2026 9:09PM

ఈ నెలాఖరులోనే నేతన్నల ఖాతాల్లోకి రూ.25 వేలు..!
ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ఉన్న చేనేత కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని రాష్ట్ర చేనేత, జౌళి శాఖ మంత్రి వి. సవిత స్పష్టం చేశారు. 'నేతన్న సేవ' పథకం కింద నూతనంగా అర్హత సాధించిన ప్రతి చేనేత కుటుంబానికి ఈ నెలాఖరు నాటికి రూ. 25,000 చొప్పున ఆర్థిక సాయం అందిస్తామని ప్రకటించారు. పెనుకొండలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆమె ఈ వివరాలను వెల్లడించారు.
ఇప్పటికే మొదటి దఫాలో 71,536 మంది లబ్ధిదారులకు దాదాపు రూ. 166 కోట్ల మేర ఆర్థిక సహాయాన్ని నేరుగా అందించి ఆదుకున్నామని మంత్రి తెలిపారు. ఇటీవల కొత్తగా మరో 36,617 మంది చేనేత కార్మికులు ఈ పథకం కోసం దరఖాస్తు చేసుకోగా, ప్రస్తుతం క్షేత్రస్థాయి పరిశీలన శరవేగంగా జరుగుతోందని చెప్పారు. అర్హులైన ప్రతి ఒక్కరి ఖాతాల్లోనూ ఈ ఆర్థిక నెలాఖరుకల్లా నగదు నేరుగా జమ అవుతుందని హామీ ఇచ్చారు.
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి తర్వాతి స్థానంలో అత్యధిక కుటుంబాలకు ఉపాధిని కల్పిస్తున్న చేనేత రంగాన్ని బలోపేతం చేసేందుకు చంద్రబాబు నాయకత్వంలోని ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ హయాంలో చేనేత కార్మికులు తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యారని ఆరోపిస్తూ, తమ పాలనలోనే చేనేత రంగానికి మళ్లీ మహర్దశ వచ్చిందని అన్నారు.
ముఖ్యంగా చేనేత కార్మికుల శ్రమను గు గుర్తించి 50 ఏళ్ల వయస్సుకే రూ. 4,000 చొప్పున నెలవారీ పెన్షన్ అందిస్తున్న విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 86,000 మంది నేతన్నలకు లబ్ధి చేకూరుతోందని తెలిపారు. వయోపరిమితి తగ్గించడం వల్ల వృద్ధాప్యంలో నేతన్నలకు గొప్ప ఆర్థిక భరోసా దక్కిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కేవలం ఆర్థిక సాయమే కాకుండా విద్యుత్ వినియోగంలోనూ చేనేత కుటుంబాలకు ప్రభుత్వం బారీ మినహాయింపులు ఇస్తోంది. మగ్గం నడిపే నేతన్నలకు నెలకు 200 యూనిట్ల వరకు, పవర్ లూమ్ యూనిట్లకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తూ ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించేందుకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దాదాపు 52,952 మంది చేనేత కార్మికులు ఈ ఉచిత విద్యుత్ ప్రయోజనాన్ని పొందుతున్నారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన స్వల్ప కాలంలోనే హామీ ఇచ్చిన ప్రతీ సంక్షేమ కార్యక్రమాన్ని వేగంగా అమలు చేస్తోందని చేనేత వర్గాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ప్రభుత్వం అందిస్తున్న ఈ వరుస సాయాలు, మార్కెటింగ్ ప్రోత్సాహకాలతో రాబోయే రోజుల్లో రాష్ట్రంలో చేనేత పరిశ్రమ పూర్వ వైభవాన్ని సంతరించుకుంటుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
AP Weavers Scheme, Minister Savitha, Nethanna Seva Scheme, AP Handloom Welfare, CM Chandrababu, Weavers Pension, Free Power For Handlooms


