రాష్ట్రంలో వరద పరిస్థితులపై సీఎం టెలీకాన్ఫరెన్స్: మత్స్యకారుల కుటుంబాలకు 50 కేజీల బియ్యం.!
Published on: Sat Sep 26, 2026 2:54PM

రాష్ట్రంలో మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత కొద్ది రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా సంభవించిన వరద పరిస్థితులపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నత స్థాయి సమీక్షా నిర్వహించారు. ఉత్తరాంధ్ర జిల్లాల యంత్రాంగం, ప్రభుత్వ అధికారులతో టెలీకాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిని ఆయన క్షేత్రస్థాయి పరిస్థితులపై ఆరా తీశారు. ప్రతికూల వాతావరణ పరిస్ధితుల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా తక్షణ సహాయక చర్యలు చేపట్టాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు.
భారీ వర్షాల కారణంగా ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాలు అస్తవ్యస్తంగా మారాయని, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. దీనిపై స్పందించిన ముఖ్యమంత్రి, వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం రానున్న ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉన్నందున అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని, ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు.

అలాగే భారీ వర్షాల కారణంగా ఇబ్బందులకు ఎదుర్కొంటున్న వర్గాల సంక్షేమంపైనా చంద్రబాబు ఈ సందర్భంగా అధికారులకు కొన్ని ఆదేశాలు జారీ చేశారు. ప్రతికూల వాతావరణం కారణంగా సముద్రంలో చేపల వేటకు వెళ్లడానికి అవకాశం లేకపోవడంతో మత్స్యకారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న చంద్రబాబు ఉపాధి కోల్పోయి ఇబ్బందులు పడుతున్న ప్రతి మత్స్యకార కుటుంబానికి తక్షణ సహాయంగా యాభై కేజీల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేయాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు.
[AP Rains, North Andhra Floods, CM Chandrababu Naidu, Teleconference, AP Fishermen Relief, 50KGs Rice]


